12ఏళ్ల నెతన్యాహు పాలన ముగిసింది: ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్, మోడీ అభినందనలు
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో సంచలన మార్పు చోటు చేసుకుంది. ఆ దేశంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌ను ఎన్నుకుంది. 120 మంది సభ్యులున్న నెసెట్‌లో భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటు వేశారు.
ఈ నేపథ్యంలో బెంజిమన్ నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రధానిగా ఎన్నికైన నఫ్తాలీ బెన్నెట్ మరో రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో 8 పార్టీలున్నాయి. వీటిలో ఓ అరబ్ పార్టీ కూడా ఉంది. అంతేగాక, ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఓ అరబ్ పార్టీ ప్రభుత్వంలో చేరడం విశేషం.

కాగా, 120 మంది సభ్యులుగా ఉన్న పార్లమెంట్ నెసెట్‌కు గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే, ఎన్నికల్లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లిక్‌డ్ పార్టీ మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని పదవిని ఇరుపార్టీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఇజ్రాయెల్‌కు కొత్త ప్రధానిగా ఎన్నికైన 49 ఏళ్ల నఫ్తాలీ బెన్నెట్ దేశంలోని మిలియనీర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నారు. బెన్నెట్ తల్లిదండ్రులు అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు బెన్నెట్ ఓ టెక్ కంపెనీ ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరు గడించారు. మతపరమైన జాతీయవాదిగా రాజకీయాల్లో అతనిపై ముద్ర ఉండటం గమనార్హం. 2013లో బెన్నెట్ రాజకీయాల్లోకి వచ్చారు. బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వంలో బెన్నెట్ రక్షణ, విద్య, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈ క్రమంలోనే నెతన్యాహుకు బెన్నెట్ ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, దేశానికి ఎంతో సేవ చేశారంటూ నెతన్యాహుపై ప్రశంసలు కురిపించారు. అయితే, బెన్నెట్ కూటమి పార్టీ నేతలు మాత్రం నెతన్యాహుపై తీవ్ర విమర్శలు చేశారు. నెతన్యాహు 12ఏళ్లపాటు ఇజ్రాయెల్ ప్రధానిగా వ్యవహరించారు. 1996-99 మధ్య తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధాని అయ్యారు. అప్పట్నుంచి నాలుగుసార్లు ఆయనే ప్రధానిగా కొనసాగారు.
ఇజ్రాయెల్ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు. భద్రత, శాంతి, అన్ని విషయాల్లోనూ ఇజ్రాయెల్ నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా బెన్నెట్‌కు అభినందనలు తెలియజేశారు. ఇరు దేశాల సత్ససంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications