బిలియనీర్ రాజకీయాలు.. మస్క్ 'అమెరికా పార్టీ' vs పెరోట్ 'రిఫార్మ్ పార్టీ' - భవిష్యత్ ఎలా?
America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అసంతృప్తితో ఎలన్ మస్క్ ఒక కొత్త పార్టీని ప్రకటించారు. అమెరికాలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని.. ప్రజలకు వారి స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తామని ఆయన అన్నారు. ఎలన్ మస్క్ కొత్త పార్టీతో పాటు రాస్ పెరోట్ పేరు కూడా మరోసారి చర్చలోకి వచ్చింది.
ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ కొత్త పార్టీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన ఎలన్ మస్క్ శనివారం తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ పాలన "బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై అసంతృప్తితో ఉన్న మస్క్ 'అమెరికా పార్టీ'ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తన అమెరికా పార్టీ.. రిపబ్లికన్ , డెమోక్రటిక్ పార్టీల ద్విదళ రాజకీయాలకు సవాల్ విసురుతుందని ఆయన అన్నారు. ట్రంప్‌కు కొంతకాలం క్రితం వరకు అత్యంత సన్నిహితుడైన మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఇలా రాశారు, "మనం ప్రజాస్వామిక దేశంలో కాకుండా, దేశాన్ని వినాశనం, అవినీతితో దివాలా తీస్తున్న ఒక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాము. ఈ రోజు 'అమెరికా పార్టీ' మీకు మీ స్వాతంత్య్రాన్ని తిరిగి ఇవ్వడానికి సృష్టించబడింది." అని అన్నారు.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు ఎలన్ మస్క్ అత్యధిక నిధులను సమకూర్చారు. ఇటీవల వరకు ఆయన అధ్యక్షుడికి సన్నిహిత సలహాదారుగా ఉన్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక సమాఖ్య ఏజెన్సీ అయిన డోజ్‌కు నాయకత్వం వహించడానికి ట్రంప్ ఎలన్ మస్క్‌ను ఎంచుకున్నారు.
ట్రంప్‌తో ఎలన్ మస్క్ వైరం
ఫెడరల్ లోటును 3.3 ట్రిలియన్ డాలర్ల మేర పెంచుతుందని మస్క్ భావించినందున ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ విమర్శిస్తున్నారు. ఇది దేశంపై రుణ భారాన్ని పెంచుతుందని మస్క్ అంటుండగా, దీని వల్ల దేశానికి చాలా ప్రయోజనం ఉంటుందని ట్రంప్ అంటున్నారు. ఎలన్ మస్క్ మొదటి నుంచి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. గత నెలలో ఈ బిల్లు కారణంగా ఇద్దరి మధ్య బహిరంగ వివాదం చోటుచేసుకుంది. తర్వాత మస్క్ ట్రంప్ పై తన వ్యాఖ్యలకు చింతించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం కొద్దిగా శాంతించింది. కానీ గత వారం ఈ బిల్లు ఆమోదించబడటంతో ఎలన్ మస్క్ కోపం మరోసారి కట్టలు తెంచుకుంది. ట్రంప్ శుక్రవారం ఈ బిల్లుపై సంతకం చేసి దానిని చట్టంగా మార్చారు.

మరోవైపు మస్క్ కొత్త పార్టీ ప్రకటనను ట్రంప్ "హాస్యాస్పదం" అని అభివర్ణించారు. అమెరికాలో ఎల్లప్పుడూ ద్విదళ వ్యవస్థ ఉందని, మూడో పార్టీని ప్రారంభించడం గందరగోళాన్ని సృష్టిస్తుందని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. "మూడో పార్టీని ప్రారంభించడం హాస్యాస్పదం అని నేను భావిస్తున్నాను. రిపబ్లికన్ పార్టీతో మాకు అద్భుతమైన విజయం లభించింది. డెమోక్రాట్లు తమ దారి తప్పారు, కానీ అమెరికాలో ఎల్లప్పుడూ ద్విదళ వ్యవస్థ ఉందిమూ. మూడో పార్టీని ప్రారంభించడం కేవలం గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుందని నేను భావిస్తున్నాను." అని ట్రంప్ పేర్కొన్నారు.
అప్పట్లో బిలియనీర్ హెన్రీ రాస్ పెరోట్ కొత్త రాజకీయ పార్టీ
మస్క్ కొత్త పార్టీని ప్రారంభించడం, మూడో పార్టీల గురించి ట్రంప్ చేసిన ప్రకటనలతో మరో పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. అది బిలియనీర్ హెన్రీ రాస్ పెరోట్. హెన్రీ రాస్ పెరోట్ అమెరికాలో బాగా తెలిసిన పేరు, ఆయన పేదరికం నుండి పైకి వచ్చి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి, కొత్త పార్టీని ఏర్పాటు చేసి రెండుసార్లు అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడ్డారు. బిలియనీర్ వ్యాపారవేత్త రాస్ 1992 అధ్యక్ష ఎన్నికలలో 19 శాతం ఓట్లు సాధించారు, కానీ అమెరికా రాజకీయ వ్యవస్థ కారణంగా, ఆయన ఏ రాష్ట్రంలోనూ ఓట్ల విషయంలో మొదటి స్థానంలో నిలవలేకపోయారు. ఎటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను పొందలేకపోయారు.
బిలియనీర్ పెరోట్ ఏ పరిస్థితుల్లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు?
1992కు ముందు రాస్ పెరోట్ ఎటువంటి ప్రభుత్వ పదవిలో లేరు, కానీ అదే సమయంలో ఆయన ఒక టాక్ షోలో స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. తన ప్రచారంలో ఆయన సామాన్య ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించి, బడ్జెట్‌లో వారిని పరిగణనలోకి తీసుకుంటామని, ఉద్యోగాలలో ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేస్తామని అన్నారు.పెరోట్ 'రిఫార్మ్ పార్టీ' పేరుతో తన పార్టీని స్థాపించి, తన ప్రచారం కోసం 6.3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే సంవత్సరం, అంటే 1992 జూన్‌లో, ఆయన డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ఇద్దరు ప్రత్యర్థులను అధిగమించిన సమయం వచ్చింది. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీలో కూడా ఆయన కనిపించారు.
ప్రజలలో ఆయన ప్రజాదరణకు ఒక ముఖ్య కారణం ఆయన సరళమైన పద్ధతి. ఆయన నేరుగా సమస్య గురించి మాట్లాడేవారు. పెరోట్ ఎల్లప్పుడూ ఒక మాట అనేవారు, ఒక పాము కనిపిస్తే, ముందుగా దానిని చంపడం ముఖ్యం కానీ పాముల గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం కాదు.దీంతో పాటు, పెరోట్ గత ఎనభై సంవత్సరాలలో అత్యంత విజయవంతమైన మూడో పక్ష అభ్యర్థిగా నిలిచి, 19 శాతం ఓట్లు సాధించారు. ఈ ఫలితాలు ప్రజలు ద్విదళ వ్యవస్థతో విసుగు చెంది బయటి వ్యక్తి కోసం చూస్తున్నారని చూపించాయి. అనేక మంది విశ్లేషకులు పెరోట్ విజయం కారణంగా రిపబ్లికన్ జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ వైట్ హౌస్‌లో తన రెండవ పదవీకాలాన్ని కోల్పోయారని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఆయన ఓట్లలో కొంత భాగం పెరోట్‌కు వెళ్లిపోయింది.
1992లో ఓడిపోయిన తర్వాత పెరోట్ 1996లో మళ్లీ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు, కానీ ఈసారి అతని ప్రజాదరణ తగ్గింది. అతన్ని అధ్యక్ష చర్చలకు ఆహ్వానించలేదు, ఎందుకంటే నిర్వాహకులు ఆయనకు తగిన మద్దతు లభించలేదని చెప్పారు. రాస్ పెరోట్‌కు కేవలం అతనికి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఓటమి తర్వాత, పెరోట్ ఒక జాతీయ రాజకీయ శక్తిగా మారాలనే ఆశలు చెదిరిపోయాయి. ఈ పరాజయం తర్వాత, అతను స్థాపించిన, జాతీయ రాజకీయ శక్తిగా మారాలని ఆశించిన రిఫార్మ్ పార్టీ విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. 2000 నాటికి పెరోట్ జాతీయ రాజకీయాల నుండి దాదాపు బయటపడ్డారు. జులై 2019లో రాస్ పెరోట్ 89 సంవత్సరాల వయస్సులో మరణించారు.












Click it and Unblock the Notifications