పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.. బోరిస్ భారత పర్యటనపై బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్...
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రియా,ఇటలీ,హాంకాంగ్ తదితర దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇటీవలి కాలంలో యూకె నుంచి తమ దేశాలకు వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రస్తుతం ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో చైనా అంటే ప్రపంచం ఎంతలా వణికిపోయిందో... ఇప్పుడు బ్రిటన్ పేరు చెప్తే వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త కరోనా వైరస్ జన్యువు,దాని తీవ్రతపై స్పష్టత వచ్చేంతవరకూ బ్రిటన్‌కు రాకపోకలు నిషేధించడమే మంచిదని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని హాజరవుతారా లేక పర్యటనను రద్దు చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ ఏమంటోంది...
బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ డా.చాంద్ పాల్ మాట్లాడుతూ... బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఉండకపోవచ్చునని తెలిపారు. 'కొత్త కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పుడే మేమేమీ చెప్పలేం. అయితే ఇప్పుడున్న స్థాయిలోనే వైరస్ వ్యాప్తి కొనసాగితే మాత్రం ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన సాధ్యపడకపోవచ్చు.' అని తెలిపారు. ఒకవేళ యూకెలో టైర్ 4 లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలుచేసి... కొద్దిరోజులకు పరిస్థితి అదుపులోకి వస్తే... అప్పుడు బోరిస్ భారత పర్యటనకు అవకాశం ఉందన్నారు.

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా...
వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత్ ఆహ్వానించడం... అందుకు ఆయన అంగీకరించడం తెలిసిందే. వారం రోజుల క్రితమే ఆయన భారత్ ఆహ్వానానికి ఓకె చెప్పారు. కానీ ఇంతలోనే బ్రిటన్‌లో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ వెలుగుచూడటం... అది వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకవేళ బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వస్తే... అది మరో 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలా భారత్‌లో కరోనా వ్యాప్తికి కారణమవొచ్చునన్న అభిప్రాయాలు,ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకుంటారా లేక భారత ప్రభుత్వమే ఆయన్ను రావొద్దని కోరుతుందా అన్న చర్చ జరుగుతోంది.

యూకెలో నిండిపోయిన ఆస్పత్రులు...
ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో కొత్త కరోనా స్ట్రెయిన్‌ను గుర్తించారు. పాత కరోనా వైరస్‌తో పోల్చితే కొత్త వైరస్ జన్యువులో 17 రకాల మార్పులను గుర్తించారు. అయితే ఇది ప్రాణాంతకమేమీ కాదని.. మరణాల సంఖ్య పెరిగే అవకాశమేమీ లేదని నిపుణులు చెప్తున్నారు.అయితే పాత వైరస్ కన్నా ఇది 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు చెప్తున్నారు. గతంలో డెన్మార్క్,ఇటలీ,నెదర్లాండ్,ఆస్ట్రేలియా దేశాల్లో కొత్త స్ట్రెయిన్స్ వెలుగుచూశాయి. అయితే వాటితో పోల్చితే దీని వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే యూకెలో దాదాపు 90శాతం ఆస్పత్రులు పేషెంట్లతో నిండిపోయాయని డా.నాగ్‌పౌల్ తెలిపారు. కరోనా మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.