ఇరాన్-ఇటలీ వాలీబాల్ మ్యాచ్: జైలు శిక్ష పడిన గవామీకి క్షమాభిక్ష
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్‌లో రాజధాని టెహ్రాన్‌లో ఇరాన్-ఇటలీ జట్ల మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సంతతికి చెందిన ఇరానియన్ గోంచ్ గవామి (25) అనే యువతికి స్ధానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే ఇరాన్ కోర్టు ఆమెకు క్షమాభిక్ష పెట్టినట్లు బ్రిటన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఆమెపై మోపిన అభియోగాలను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. "ఇరాన్‌లోని స్ధానిక కోర్టు గవామీకి క్షమాభిక్ష పెట్టడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, ఆమె ప్రయాణంపై నిషేధం విధించారు" అని బ్రిటన్ విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు.
గవామీ విచారణను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని, ఆమె కుటుంబానికి కూడా అందుబాటులో ఉంటామని చెప్పారు. గవామీకి క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని తెలుసుకున్న ఆమె సోదరుడు ఇమాన్ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో "ఫ్రీ గవామీ" అంటూ పోస్టు చేశాడు.

ఇరాన్ దేశంలో సాంప్రదాయ చట్టాలకు పెద్ద పీట వేస్తారు. అలాంటి తమ సాంప్రదాయ చట్టాలకు గౌరవం ఇవ్వకుంటే ఎంతవారికైనా శిక్ష తప్పదు. గోంచ్ గవామి యూనివర్సిటీ ఆఫ్ లండన్ స్కూల్‌లో గ్రాడ్యుయేట్. ఇరాన్‌లో పురుషులు ఆడే ఆటలకు ఆడవారిని బ్యాన్ చేశారు.
దీనికి నిరసనగా గత ఏడాది జూన్‌లో రాజధాని టెహ్రాన్‌లో ఇరాన్-ఇటలీ జట్ల మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ జరిగిన స్టేడియం బయట కొంత మంది మహిళలతో వాలీ మ్యాచ్ జరిగే ఫ్రీడమ్ స్టేడియంలోకి వెళ్లేందుకు గోంచ్ గవామి ప్రయత్నించింది. దీంతో గవామీని పోలీసులు అరెస్టు చేయగా, స్ధానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్', బ్రిటిష్ ప్రభుత్వాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అనంతరం ఆమె అభ్యర్ధనపై కోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే మూడు వారాలకే గవామీ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications