ట్రంప్ ఎఫెక్ట్! యుద్ధానికి తెర, ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం
పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కారణం ఏంటంటే.. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరుపక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.
దీంతో గత 15 నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు కలిగినట్లయింది. మొదట ఆరు వారాలపాటు ఈ ఒప్పందం అమలులో ఉండనుంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను క్రమంగా వీడనున్నాయి. కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొద్ది నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదట్నుంచి మద్దతు పలుకుతోంది.

ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని, శాంతియుత పరిస్థితులకు ఇరు దేశాలు ముందుకు రావాలని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం.
ఈ క్రమంలో ట్రంప్ స్పందించారు. 'బందీల విడుదల కోసం పశ్చిమాసిలో మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. త్వరలోనే బందీలు విడుదల అవుతారు' అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో వెల్లడించారు.
2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా భారీ ఎత్తున బాంబులతో దాడి చేశారు. కాల్పులు జరిపారు. దీంతో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా అపహరించారు. ఈ నేపథ్యంలో హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియా, అక్టోబర్ 7నాటి ఘటనకు సూత్రధారి అయిన యహ్యా సిన్వార్ తోపాటు కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 45 వేలకుపైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా, ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications