రష్యాకు సాయం చేస్తే చైనాపైనా ఆంక్షలు-యూఎస్ హెచ్చరిక-డ్రాగన్ క్లారిటీ ఇదే
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఇందులో ఉక్రెయిన్ కు జరుగుతున్న నష్టంతో పాటు రష్యా కూడా భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఆ వార్త ఇప్పుడు రష్యా, చైనా, అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రకంపనలు రేపింది. చివరికి దీనిపై చైనా స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Recommended Video
ఉక్రెయన్ పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, చైనాతో పాటు ఇతర దేశాలేవీ నేరుగా జోక్యం చేసుకునేందుకు కానీ, సాయం చేసేందుకు కానీ ముందుకు రావడం లేదు. కేవలం రష్యాపై ఆంక్షలతో సరిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా.. చైనా నుంచి మిలటరీ సామాగ్రి సాయం కోరినట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ తో పాటు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

దీనిపై స్పందించిన అమెరికా సర్కార్ కూడా డ్రాగన్ ఇందులో జోక్యం చేసుకోవద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. రష్యాకు సాయం చేస్తే చైనాపైనా ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. దీంతో చైనా స్పందించింది.
రష్యా తమ నుంచి ఎలాంటి సైనిక సామాగ్రి సాయం కోరలేదని అమెరికాలో చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఉక్రెయిన్ పై పోరు మొదలైన దగ్గరి నుంచి రష్యా తమను ఎలాంటి సాయం కూడా అడగలేదని చైనా రాయబార కార్యాలయ అధికారి లీ పెంగ్యూ వెల్లడించారు. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్ధితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని, వీటిని అడ్డుకోవడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని చైనా రాయబార కార్యాలయఅధికారి తెలిపారు. దీంతో రష్యాకు సాయం విషయంలో చైనా కూడా క్లారిటీతోనే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications