చల్లారని లఢక్ సరిహద్దు వివాదం: భారత్‌కు చైనా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి సాగిస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. భారత్-చైనా సైన్యాధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు నిర్వహించినప్పటికీ కొలిక్కి రావట్లేదు. ఏదో ఒక అంశం మీద ప్రతిష్ఠంభన ఏర్పడుతోంది. వాస్తవాధీన రేఖ వివాదంపై కమాండర్ ర్యాంక్ స్థాయి అధికారులు ఇటీవలే నిర్వహించిన చర్చలు కూడా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
లఢక్ సెక్టార్ సమీపంలో గాల్వన్ వ్యాలీ, పాంగ్యాంగ్ లో భారత్-చైనా సైనికుల మధ్య 2020 జూన్‌లో చోటు చేసుకున్న ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటూ వచ్చింది. అంతకుముందు నుంచే అంటే- అదే ఏడాది మేలో భారత జవాన్లు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భద్రత సిబ్బంది మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ సైన్యాన్ని.. జవాన్లు విజయవంతంగా అడ్డుకున్నారు.

అప్పటి నుంచీ లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే వస్తోన్నాయి. అవి ఇప్పటికీ చల్లారట్లేదు. ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా రెండు దేశాల కూడా వాస్తవాధీన రేఖ వెంబడి భారీ ఎత్తున సైనిక బలగాలు మోహరించాయి. యుద్ధ సామాగ్రిని తరలించాయి. ఈ ఉద్రిక్తతలను నివారించడానికి కమాండర్ స్థాయి అధికారులు తరచూ ముఖాముఖి సమావేశమౌతున్నారు. ఛుసుల్-మోల్డోలోని బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్‌లో ఈ చర్చలు కొనసాగిస్తున్నారు.
రెండు సంవత్సరాలవుతున్నప్పటికీ- ఈ చర్చలు మాత్రం కొలిక్కి రాకపోవడంతో- చైనా ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. చైనా వాస్తవాధీన రేఖ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ.. దృష్టి సారించారు. త్వరలో ఆయన భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తన పర్యటన సందర్భంగా వాంగ్ యీ.. విదేశాంగం, రక్షణ శాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహదారు అజిత్ దోవల్‌తో భేటీ కానున్నారు.
వాస్తవాధీన రేఖ వివాదం చెలరేగిన తరువాత చైనాకు చెందిన ఓ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా- భారత్ రావడానికి ముందు వాంగ్ యీ- నేపాల్ వెళ్తారని అంటున్నారు. ఇదివరకు నేపాల్ ప్రభుత్వం భారత్‌ను కాదని చైనాకు దగ్గరైన విషయం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్నపరిణామాల మధ్య తన వైఖరిని మార్చుకుంది.












Click it and Unblock the Notifications