వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా: జిన్‌పింగ్ మళ్లీ సోషలిజం వైపు అడుగులు వేస్తున్నారెందుకు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జిన్‌పింగ్

సాంకేతికంగా కమ్యూనిస్టు దేశమైనప్పటికీ చైనా తన ఆర్థిక విధానాలలో సంపన్నులు, పెట్టుబడిదారులకు పెద్ద పీట వేస్తూ వచ్చింది.

ధనికుల సంపద మరింత పెంచేలా చర్యలు చేపడితే వారి ద్వారా మొత్తం సమాజం లబ్ధి పొందుతుందని నమ్మింది.

''ట్రికిల్ డౌన్ ఎకనమిక్స్‌’’గా పేర్కొనే ఈ ఆర్థిక విధానం కొంత వరకు పనిచేసింది. ఈ విధానం ఫలితంగా మధ్య తరగతి వర్గం పెరిగింది. అంతేకాదు, సమాజంలోని అన్ని ఆర్థిక స్థాయిల్లోని ప్రజలూ మెరుగైన జీవన ప్రమాణాలను అందుకున్నారు.

చైనా

సంపద అసమానత

1970ల నాటి ఆర్థిక మందగమనాన్ని దాటుకుని పైకెదిగిన చైనా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికాను సవాల్ చేస్తోంది.

కానీ, దేశంలోని ఆదాయ అసమానతలను మాత్రం చైనా చక్కదిద్దలేకపోయింది.

ప్రభుత్వ ఆర్థిక విధానాలను సమయానుకూలంగా వాడుకోగలిగిన వారి పిల్లలను చూస్తే ఇది అర్థమవుతుంది.

1980లలో ఫ్యాక్టరీలను సంపాదించుకుని విపరీతంగా లాభపడిన వారి సంతానం ఇప్పుడు నగరాల్లో అత్యాధునిక స్పోర్ట్స్ కార్లలో తిరుగుతోంది.

అదే సమయంలో జీవితంలో ఏ నాటికైనా సొంతిల్లు సంపాదించుకోగలమా అని ఎదురుచూసే భవన నిర్మాణ కార్మికులు లెక్కలేనంత మంది ఉన్నారు.

సోషలిజానికి సొంత భాష్యం చెప్పుకొని అనేక వెసులుబాట్లతో చైనాలో సాగిన పాలన నిజానికి సోషలిజం అనిపించుకోదు.

ఇప్పుడిక అలాంటి 'చైనా సోషలిజం’ ఇక ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ షీ జిన్‌పింగ్ నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తోంది.

జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం అక్కడి పాలక కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతోకొంత కమ్యూనిజాన్ని ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఇప్పుడు 'కామన్ ప్రాస్పరిటీ’ నినాదాన్ని ఎత్తుకుంది.

ప్రస్తుతానికి ఈ నినాదం ఇంకా వీధివీధికీ చేరలేదు.. కానీ, ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

జిన్‌పింగ్ చేపడుతున్న చర్యలకు ఈ నినాదమే మూలాధారం.

చైనా

రోజువారీ జీవితంపై ప్రభావం

సంపన్నుల పన్ను ఎగవేతను అరికట్టడం, అందరికీ సమాన విద్యావకాశాలు దక్కేలా ప్రైవేటు విద్యాసంస్థలపై నిషేధం వంటివన్నీ ఈ చర్యలలో భాగమే.

ప్రస్తుతం చైనాలోని టెక్ దిగ్గజాలపై ఆంక్షలు, కఠిన వైఖరి కూడా కామన్ ప్రాస్పరిటీ ప్రణాళికలో భాగమనే చెప్పాలి.

కమ్యూనిస్ట్ తరహా విధానాల దిశగా జిన్‌పింగ్ కదులుతున్నారా అంటే 100 శాతం కచ్చితంగా చెప్పలేం కానీ ప్రస్తుత పరిణామాలు అలాగే ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

ఆదాయంలో అసమానతలను తగ్గించడంతోపాటు రోజువారీ జీవితంలోని పరిణామాలపై కూడా దృష్టిసారించాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు.

ఎందుకంటే, నేడు చాలా మంది పిల్లలను బద్ధకం ఆవరిస్తోంది. చాలా మంది యువకులు వీడియో గేమ్‌ల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారు. దీని నుంచి యువతను కాపాడేందుకు వీడియో గేమ్‌లు ఆడే సమయంపై మూడు గంటల పరిమితిని కమ్యూనిస్టు పార్టీ తీసుకొచ్చింది.

మరోవైపు టీవీ తారలను విపరీతంగా ఆరాదించడం లాంటి ప్రాముఖ్యంలేని విషయాలతో టీనేజర్ల బుర్రలు నిండిపోతున్నాయి. అందుకే కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లపైనా నిషేధం విధించారు.

మరోవైపు జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి పరిష్కారంగా ''అందరికీ ముగ్గురు పిల్లలు’’ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.

ఫుట్‌బాల్, సినిమాలు, సంగీతం, పిల్లలు, భాష, సైన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ మార్పులకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది.

జిన్‌పింగ్

తండ్రి భావాలకు భిన్నంగా

షీ జిన్‌పింగ్ నేడు ఇంత శక్తిమంతమైన నాయకుడిగా ఎదగడానికి గత కారణాలు తెలుసుకోవాలంటే ఆయన నేపథ్యాన్ని మనం పరిశీలించాలి.

ఆయన తండ్రి షీ ఝాంగ్‌షున్ కమ్యూనిస్టు పార్టీ ''యుద్ధ హీరో’’. మావో హయాంలో ఆయన్ను సైన్యం నుంచి తొలగించారు. జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో ఝాంగ్‌షున్ విధానాలను జిన్‌పింగ్ తల్లి కూడా తప్పుపట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

1978లో జైలు నుంచి విడుదలైన తర్వాత, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఆర్థిక సంస్కరణల కోసం ఝాంగ్‌షున్ పోరాడారు. చైనా అభ్యుదయ నాయకుల్లో ఒకరైన హు యావోబ్యాంగ్‌కు ఆయన గట్టిమద్దతుదారుగా నిలిచారు.

విపరీత కమ్యూనిస్టు భావజాలమున్న నాయకుల చేతిలో జిన్‌పింగ్ తండ్రి అణచివేతకు గురయ్యారు. మరోవైపు ఆర్థిక సంస్కరణలకు ఆయన గట్టి మద్దతుదారు. అయితే, జిన్‌పింగ్ మాత్రం తండ్రికి పూర్తి భిన్నమైన మార్గంలో కమ్యూనిస్టు పార్టీని ఎందుకు నడిపిస్తున్నారని చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.

ఈ ప్రశ్నలకు భిన్న సమాధానాలు కూడా మనకు కనిపిస్తాయి.

బహుశా కొన్ని రాజకీయ అంశాల్లో తండ్రితో జిన్‌పింగ్ పూర్తిగా విభేదిస్తూ ఉండొచ్చు. లేదా తండ్రి ప్రాథమ్యాలకు భిన్నంగా పార్టీని నడిపించాలని జిన్‌పింగ్ భావిస్తూ ఉండొచ్చు.

అయితే, జిన్‌పింగ్ విధానాలు మావో హయాం నాటి విధానాలకు సమీపంలో మాత్రం ఉండవు. నిజానికి ఆ మార్గంలో వెళ్లాలని ఆయన అనుకోరు.

తండ్రి జైలుకు వెళ్లినప్పుడు 15ఏళ్ల వయసులోనే జిన్‌పింగ్ పొలాల్లో పనిచేస్తూ ''కేవ్ హౌస్’’లో గడపాల్సి వచ్చింది.

ఆ కష్ట సమయాలు ఆయనలో స్థైర్యాన్ని పెంచాయి. ఈ పరిస్థితులే అతివాద రాజకీయాలపై ఆయనలో ద్వేషాన్ని పెంచి ఉండొచ్చు.

చైనా మళ్లీ 1960, 70ల నాటి కల్లోలిత పరిస్థితుల్లోకి వెళ్లిపోకుండా ఒక శక్తిమంతమైన నాయకుడు మాత్రమే అడ్డుకోగలడని జిన్‌పింగ్ అప్పుడే అనుకుని ఉండొచ్చని కొందరు చైనా పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.

ఇప్పుడు చైనాలో నిబంధనలు చాలా మారాయి. జిన్‌పింగ్ ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లు అధికారంలో కొనసాగొచ్చు.

ఆయన విషయంలో మనకు అన్నీ ఊహాగానాలే వినిపిస్తాయి. ఎందుకంటే, ఆయన ఏం చేస్తున్నారో, ఏం చేయాలని అనుకుంటున్నారో ఆయన ఎప్పుడూ చెప్పరు. చైనాలో మీడియాను ప్రభుత్వమే నియంత్రిస్తున్నప్పటికీ, అక్కడి నాయకులు మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వరు.

చైనాలో ఆర్థిక కార్యకలాపాలపై అమల్లోకి తీసుకొస్తున్న కొత్త నిబంధనలు, నియంత్రణలు, మార్గదర్శకాలు ఏమిటో.. అవి ఎంత దూరం చైనాను తీసుకెళ్తాయో ఊహించడం చాలా కష్టం.

చైనాలో ఇటీవల కాలంలో కొత్తకొత్త మార్పులు తీసుకువస్తూనే ఉన్నారు. ఏదోఒక రూపంలో కొత్త మార్పులను అమలు చేస్తూనే ఉన్నారు. వీటిలో చాలా మార్పులు ఎవరూ ఊహించనివే ఉంటున్నాయి.

వస్తూత్పత్తికి సంబంధించిన భిన్న అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇక్కడేమీ కొత్తకాదు. అయితే, ఎవరూ ఊహించని విధంగా అమలులోకి వస్తున్న కొత్త మార్పులపైనే చర్చ జరుగుతోంది.

నెల రోజుల్లో ఏం జరుగబోతోందో ఊహించడం కష్టమైనప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ముందుకువస్తారు?

జిన్‌పింగ్

దేశ అభివృద్ధిలో ఇలాంటి మార్పులు సహజమని కొందరు వాదిస్తున్నారు. ఇదివరకు ఎలాంటి నియంత్రణ లేని అంశాల్లో నియంత్రణ అవసరమని వారు చెబుతున్నారు.

ఒకవేళ వారు చెప్పేదే వాస్తవమైతే, ఈ మార్పుల షాక్‌లు తాత్కాలికంగా ఉంటాయి. కొన్ని రోజులకు పరిస్థితి సాధారణానికి వచ్చేస్తుంది.

అయితే, ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయి? అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.

ఒకటి మాత్రం సుస్పష్టం. ఇక్కడ ఏ మార్పునైనా మనం జిన్‌పింగ్ ''కామన్ ప్రాస్పరిటీ’’ కోణంలోనే చూడాలి. వీటిని అమలుచేసే సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. అయితే, ఈ ట్రక్కును మనం ఎక్కాలి. లేదంటే ఈ ట్రక్కు మన మీద నుంచి వెళ్లిపోతుంది.

(''చైనాస్ ఛేంజింగ్ రోల్ ఇన్ ద వరల్డ్’’ కథనాల్లో ఇది మొదటిది. ''హౌ బీజింగ్ ఈజ్ రీరైటింగ్ ద రూల్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’, ''గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్’’అంశాలపై రెండు, మూడు కథనాలు ఉంటాయి. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
China: Jinping is once again taking steps towards socialism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X