పెళ్లి కోసం ఆరాటం: చైనా యువతకు సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన చైనా ప్రస్తుతం ఓ వింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చైనాలో పెళ్లి చేసుకునేందుకు యువతకు అమ్మాయిలు దొరకడం లేదు. ఆ దేశంలో పెళ్లి సంబంధాలు దొరకక ఇబ్బంది పడుతున్న యువకులు మోసగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు మహిళలు చైనా పురుషులను పెళ్లి పేరుతో బురిడీ కొట్టించి భారీగా డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. ఈ మోసాలు మితిమీరిపోవడంతో చైనా సర్కారు తన దేశ యువతకు అత్యవసర కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
గత కొన్ని దశాబ్ధాలుగా జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా.. తన జనాభాను నియంత్రించడానికి కఠినమైన జనాభా నియంత్రణ(వన్ చైల్డ్ పాలసీ) నిబంధనలను తీసుకువచ్చింది. ఆ ఆంక్షల వల్ల చైనా సమాజంలో లింగ నిష్పత్తి పూర్తిగా దెబ్బతింది. గత 2020 జనాభా లెక్కల ప్రకారం.. చైనాలో స్త్రీల కంటే పురుషులే 20 మిలియన్లు ఎక్కువగా ఉన్నారు. అంటే చైనాలోని 2 కోట్ల మంది యువకులకు పెళ్లి చేసుకోవడానికి స్థానికంగా అమ్మాయిలు లభించని పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న చైనా యువకులు, పేద దేశాలకు చెందిన యువతులను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవడానికి వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది యువకులు తమకు తగిన వధువును వెతకడానికి చైనా కరెన్సీలో వేల యువాన్లను ఖర్చు చేస్తున్నారు.అయితే దీనిని ఆసరాగా చేసుకుని దారుణమైన మోసాలు కూడా జరుగుతున్నాయి. అంటే విదేశీ మహిళలు చైనా పురుషులను పెళ్లి చేసుకుంటామని వాగ్దానం చేసి మోసం చేసి, డబ్బు తీసుకుని పారిపోతున్నారు. దీని ఫలితంగా.. చాలా మంది చైనా యువత మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతుండటంతో, చైనా తన యువతకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
అందానికి మోసపోవద్దు..
ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశాల్లో జరుగుతున్న వివాహ మోసాలు, మానవ అక్రమ రవాణాలో చిక్కుకోకూడదని సూచించింది. సోషల్ మీడియాలో కలిసే వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించింది. చైనా యువకులు అక్రమ వివాహాలు చేసుకోవద్దని.. వధువుల కొనుగోలు చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రోకర్లు లేదా ఏజెన్సీల ద్వారా విదేశీ వదువులను తీసుకురావడం చట్టరీత్యా నేరమని పేర్కొంది. బంగ్లాదేశ్ చట్టం ప్రకారం.. మానవ అక్రమ రవాణా కింద బుక్కయితే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, 5లక్షల జరిమానా విధిస్తారని చైనా సర్కారు హెచ్చరించారు. తీవ్రమైన కేసులలో మరణశిక్షను కూడా విధించే అవకాశం ఉంది.
ఇతర దేశాల్లో కూడా అప్రమత్తం
"అంతర్జాతీయ వివాహాలు పరస్పర అంగీకారం, నిజమైన ఆకర్షణపై ఆధారపడి ఉండాలి. వధువును కొనడం తరచుగా దోపిడీకి, శారీరక హానికి దారితీస్తుంది" అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతకుముందు వియత్నాం, మయన్మార్, లావోస్, పాకిస్తాన్, నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయాలు కూడా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి.












Click it and Unblock the Notifications