యుద్ధానికి సిద్ధమవుతోంది!: చైనా బలగాల మోహరింపు, రిహార్సల్స్(వీడియో)
సిక్కిం సరిహద్దులోని డోక్లాం వివాదంతో గతకొంతకాలంగా భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా మాత్రం రెచ్చగొట్టే దోరణిని మాత్రం వీడటం లేదు. ఇప్పటికే పలుమార్లు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగిన చైనా.. ఇప్పుడు ఏకంగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టిబెట్ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించి యుద్ధానికి సన్నాహాకాలు మొదలుపెట్టింది.
చెప్పినట్లుగానే..
సిక్కిం సరిహద్దులోని డోక్లాం వివాదంతో గతకొంతకాలంగా భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరిహద్దు నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని లేదంటే సమస్యకు యుద్ధమే పరిష్కారమని చైనా పదేపదే హెచ్చరికలు చేసింది. ఇప్పుడు చెప్పిన విధంగానే యుద్ధ సన్నాహాలు చేస్తోంది.
టిబెట్ ప్రాంతంలో మోహరించిన బలగాలు
చైనా తన సైన్యాన్ని, భారీగా మిలిటరీ ఆయుధాలను, పరికరాలను టిబెట్‌కు తరలించినట్లు వస్తున్న కథనాలు చర్చనీయాంశంగా మారాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యాన్ని, వేల టన్నుల కొద్ది మిలిటరీ పరికరాలు, ఆర్మీ వాహనాలను జూన్ చివర్లో చైనా టిబెట్‌కు తరలించినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
వీడియోలు కూడా వెలువడ్డాయి..
రోడ్డు, రైలు మార్గం ద్వారా వీటిని తరలించినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా వెలువడ్డాయి. కాగా, భారత్‌తో సమస్యను పరిష్కరించేందుకు సైన్యాన్ని టిబెట్‌కు పంపించినట్లు హాంకాంగ్ మీడియా తన కథనంలో పేర్కొంది. దీంతో భారత్‌పై యుద్ధం చేసేందుకు చైనా సన్నాహాలు చేపడుతోందా అన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లవుతోంది.

పీఎల్ఏ కూడా అంగీకరించింది..
కాగా, ఆయుధాలను టిబెట్‌కు తరలించడాన్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మీడియా పీఎల్‌ఏ డెయిలీ కూడా ధ్రువీకరించడం గమనార్హం. అయితే దౌత్యపరమైన చర్చలకు కూడా మిలిటరీ సిద్ధంగా ఉండటం అవసరమని చైనా సైన్యం కమాండర్ ఒకరు తెలిపారు.

చర్చలే మార్గమంటున్న భారత్
అయితే, భారత్-చైనా మధ్య వివాదం దౌత్యపరమైన చర్చలతోనే పరిష్కారమవుతుందని భారత్ భావిస్తుండటం గమనార్హం. ఈ మేరకు సరిహద్దు వివాదం గురించి పూర్తి వివరాలను విదేశాంగశాఖ కార్యదర్శి జయశంకర్ మంగళవారం నాడు పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు. ఓ వైపు చైనా యుద్ధ సన్నాహాలు చేసుకుంటుంటూ భారత్ మాత్రం చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని చెబుతుండటం గమనార్హం. అయితే, డోక్లాం వద్ద భారత బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. యుద్ధం వస్తే తాము వెనుకాడబోమని భారత్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications