చైనా తొండి మాటలు: భూటాన్ భుజాలపై ఎక్కు పెట్టి హస్తినకు ఇలా సవాల్
భారత్, చైనా సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ప్రాంతంపై కన్నేసిన చైనా అక్కడ రోడ్డు నిర్మిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది.
న్యూఢిల్లీ/ బీజింగ్: భారత్, చైనా సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ప్రాంతంపై కన్నేసిన చైనా అక్కడ రోడ్డు నిర్మిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అది భూటాన్‌లో భాగమని, అక్కడ రోడ్డు వేయడమంటే 'యథాతథ స్థితి'ని దెబ్బ తీయడమేనని భారత్ ఎదురు నిలుస్తోంది. ఇదే ఇప్పటి యుద్ధం వస్తుందా? అన్న రీతిలో ఉద్రిక్తతలు నెలకొనడానికి కారణం.
గమ్మత్తేమిటంటే నేరుగా సంబంధ బాంధవ్యాలు లేని భూటాన్‌ను బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని.. తర్వాత భారత్ పై ఒత్తిడితో కూడి పట్టు సాధించాలని డ్రాగన్ కలలు కంటున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్ 6న భారత్‌కు చెందిన బంకర్లను చైనా ధ్వంసం చేసినప్పటి నుంచీ ఉద్రిక్తత రాజుకుంది. ఆ తర్వాత మానస సరోవర్ యాత్రకూ చైనా ఆటంకం సృష్టించింది.
ఏటా యాత్రికులు వెళ్లే నాథులా మార్గాన్ని మూసివేసింది. 'చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోండి' అంటూ 1962 యుద్ధాన్ని భారత్‌కు గుర్తుచేసి కవ్వించింది. తాజాగా సిక్కింలోని డొక్లామ్ వద్ద ముక్కోణపు జంక్షన్ పరిధిలో భారతదేశంతో రాజీ ప్రసక్తే లేదని భారత్ లో చైనా రాయబారి లూ జావోహుయి కుండ బద్దలు కొట్టారు.

చర్చలంటూనే ముందస్తు షరతులుచర్చలంటూనే ముందస్తు షరతులు
సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలకు భారత్‌దే బాధ్యత అని పేర్కొంటూ లూ జావోహుయి తొలిసారి కటువుగా మాట్లాడారు. డోక్లామ్ వద్ద నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించబోమని తెలిపారు. ‘బంతి భారత్ కోర్టులోనే ఉంది. రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలను తగ్గించే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైనే ఉన్నది' అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘చర్చలు ఒక మార్గం. అదీ మీ ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంది' అని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితులకు శాంతియుత పరిష్కార మార్గం కనుగొనాలని తమ దేశం కోరుకుంటున్నదని అన్నారు. ఈ ప్రాంతం నుంచి భారత సైన్యం బేషరతుగా వైదొలిగితేనే అది సాధ్యమన్నారు.

ఉద్రిక్తత నివారించాల్సిందేనంటూనే
దీనిపై రాజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని చైనా రాయబారి లూ జావోహుయి స్పష్టం చేశారు. ‘భారత బలగాలు బేషరతుగా వారి భూభాగంలోకి తరలి వెళ్లాలి. అప్పుడే రెండు దేశాల మధ్య ఎటువంటి అర్థవంతమైన చర్చలైనా సాధ్యం అని అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పరం గుర్తింపు పొందిన సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి తొలిసారి భారత్ సైన్యం వచ్చింది. రెండు దేశాల సైన్యం మధ్య 19 రోజులుగా ఉన్న ఉద్రిక్తత తొలగలేదు' అని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకునేందుకు భారత్ నిరాకరిస్తే సిక్కింలో నెలకొన్న సంక్షోభానికి తెర దించడానికి చైనా సైనిక చర్య చేపడుతుందని ఆ దేశ నిపుణులతోపాటు అధికార మీడియా హెచ్చరించింది. మరోవైపు, సిక్కింలో భారత మిలిటరీ బంకర్ ధ్వంసానికి చైనా బుల్డోజర్లు వినియోగించలేదని భారత సైనిక అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ఎదురుదాడి లక్ష్యంగా చైనా
సిక్కింలోని డోక్లామ్‌పై 1890 నాటి చైనా-బ్రిటన్ ఒప్పందాన్ని భారత్ తొలి ప్రధాని నెహ్రూ అంగీకరించారని చైనా చేస్తున్న వాదనలో డొల్లతనం బయటపడింది. దీనిపై 1959 సెప్టెంబర్ 26న అప్పటి చైనా ప్రధాని చౌఎన్‌లైకి నెహ్రూ లేఖ రాస్తూ సిక్కిం, భూటాన్‌ల పరిధిలో సరిహద్దులపై మీ ప్రకటనలో గూడార్థం మాకు అర్థం కాలేదు. ప్రస్తుతం మనమధ్య చర్చలోకి ఈ అంశం రాదు అని పేర్కొన్నారు. భూటాన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ దేశ విదేశాంగ సంబంధాలపై ఇతర దేశాల ప్రభుత్వాలతో చర్చించే అధికారం భారత్‌కే ఉన్నదని నెహ్రూ తెలిపారు. 1890 ఒప్పందం ప్రకారం సిక్కిం భారత్‌లో భాగమేనని గుర్తు చేశారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పు
ప్రపంచ జనాభా 750 కోట్లయితే అందులో మూడో వంతు మంది చైనా, భారత్ దేశాల్లోనే నివసిస్తున్నారు. అలాంటి భారత్-చైనా యుద్ధానికి దిగితే దాని దుష్ప్రభావం ఆ రెండింటిపైనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దారుణంగా ఉంటుంది. అందువల్ల ఈ యుద్ధ ఫలితం భారత్-చైనాల బలాబలాల మీదే కాకుండా వివిధ దేశాల వైఖరులు, ఒత్తిడులు, భారత్-చైనాల్లో అంతర్గత పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

ఆర్మీలు పరస్పరం తలపడతాయా?
భారత్, చైనాలు ప్రపంచంలో అతి పెద్ద ఆర్మీ కలిగిన దేశాలైనా, వాటి మధ్య భూతల యుద్ధం భారీ స్థాయిలో జరిగే అవకాశాల్లేవు. ఎందుకంటే రెండు దేశాల సరిహద్దు ప్రాంతం కొండలు, లోయలతో చాలా దుర్గమంగా ఉంటుంది. భారీ పరికరాలతో పెద్దఎత్తున సైన్యం ఆ సరిహద్దును దాటి వెళ్లడం సాధ్యం కాదు. ఒక దేశం భారీగా సైన్యాన్ని ముందుకు దూకించినా రెండో దేశం కేవలం శతఘ్నులతోనే వారిని చాలావరకూ అడ్డుకోగలదు. ఎందుకంటే ఇక్కడ సైన్యం ప్రయాణించగల మార్గాలు పరిమితం. ఆ మార్గాలేమిటనేది ఇరు దేశాలకూ స్పష్టంగా తెలుసు. అందుకే 1962 యుద్ధంలో చైనా 80 వేల మంది సైన్యంతో దాడి చేయగా, భారత్ కేవలం 12 వేల సైన్యంతోనే చైనాను చాలావరకూ అడ్డుకోగలిగింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చైనా కొత్తగా కొన్ని రోడ్లు నిర్మించినప్పటికీ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులేదు. భూతల యుద్ధంలో ఎవరిదీ పైచేయి కాకపోయే అవకాశాలు ఉన్నాయి.

జలాంతర్గాముల్లో చైనాదే పైచేయి
ఇరు దేశాల మధ్య భూతల, వైమానిక యుద్ధాలతో పోలిస్తే సాగర యుద్ధమే నిర్ణయాత్మకమయ్యే అవకాశం ఉంది. భారత్ వద్ద యుద్ధ విమాన వాహక నౌక ఒకటి (ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య) ఉండగా, చైనా వద్ద కూడా ఒకటే (లియావోనింగ్) ఉంది. అయితే భారత్ వద్ద 14 జలాంతర్గాములు మాత్రమే ఉండగా చైనా వద్ద ఏకంగా 68 ఉన్నాయి. సంఖ్యాపరంగా చైనా ముందు ఉన్నప్పటికీ భౌగోళికంగా భారత్‌కు సానుకూలత ఉంది. హిందూ మహాసముద్రం మధ్యలో భారత్ ఉండడంతో ఐరోపా, గల్ఫ్, ఆఫ్రికా దేశాల నుంచి చైనాకు చమురు, ఇతర సరఫరాలను భారత్ అడ్డుకోగల అవకాశం ఉంది. తన వద్ద ఉన్న చమురు నిల్వలు అయిపోయిన పక్షంలో చైనా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే చైనాకు అవసరమైన పెట్రో ఉత్పత్తుల్లో 10 శాతం మాత్రమే దేశీయంగా లభ్యమవుతాయి. మిగతా 90 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అమెరికా, జపాన్ వంటివి చైనాపై ఆంక్షలు విధిస్తే ఎగుమతులు తగ్గి కోట్లాది చైనా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అందువల్ల యుద్ధాన్ని ముగించాలని అంతర్గతంగా కూడా చైనాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ఉద్రిక్తతలు ఉన్నా యుద్ధం వచ్చే చాన్స్ లేనేలేదు
భారత్, చైనాలు రెండూ అణ్వస్త్రాలు కలిగిన దేశాలే. భారత్ వద్ద 100 అణు వార్‌హెడ్లు ఉండగా, చైనా వద్ద 280 వరకూ ఉన్నాయని అంచనా. అయితే రెండు దేశాలూ ‘నో ఫస్ట్ యూజ్' విధానాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఏ దేశంపైనా ముందుగా అణ్వస్త్రాన్ని ప్రయోగించబోమనే విధానం. భూమిపై నుంచి, సముద్ర గర్భంలో నుంచి, గాలిలో నుంచి అణ్వస్త్రాలు ప్రయోగించగలిగిన సామర్థ్యం రెండు దేశాలకూ ఉంది. ఒకవేళ అణు యుద్ధమే జరిగితే రెండు దేశాలకూ అది వినాశకరమే కాగలదు. ప్రస్తుతం ఆర్థికంగా దూసుకుపోతున్న తరుణంలో అణు యుద్ధమే కాదు, సంప్రదాయ యుద్ధానికి దిగడానికి కూడా ఇరు దేశాలూ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయని, అందువల్ల యుద్ధం వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

భారత వాయుసేన బలం ఇదీ
భారత్ వద్ద మిగ్, జాగ్వార్, మిరాజ్, తేజస్, సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విమానాలు పాతబడిపోవడంతో భారత వైమానిక దళం విమానాల కొరతను ఎదుర్కొంటోంది. అయితే చైనా పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. సంఖ్యాపరంగా చైనా మెరుగైన స్థితిలో ఉన్నా నాణ్యతపరంగా అంత బాగాలేదు. అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలు భారత్ వద్ద 200కు పైగా ఉండగా చైనా వద్ద అవి 80 లోపే ఉన్నాయి. జె-7, జె-8, హెచ్-6 వంటి పాత తరం విమానాలే చైనా వద్ద ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానంగా చైనా క్షిపణుల నుంచి భారత్‌కు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్‌లోని సైనిక, ఇతర లక్ష్యాలపై దాడులు చేసేందుకు చైనా వద్ద డిఎఫ్-11, డిఎఫ్-15, డిఎఫ్-21 వంటి బాలిస్టిక్ క్షిపణులు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటి నుంచి కాచుకునేందుకు భారత్ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నా అది ఇంకా అందుబాటులోకి రాలేదు. భారత్ వద్ద కూడా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నా వాటిలో అధిక శాతం అణు యుద్ధం కోసం అట్టిపెట్టాల్సి ఉంటుంది కాబట్టి సంప్రదాయ యుద్ధంలో వాడే అవకాశం లేదు. ఉత్తర భారతంలోని అనేక లక్ష్యాలపై చైనా క్షిపణి దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అనివార్యంగా కాల్పుల విరమణ ఇలా
1962 యుద్ధం... భారత్-చైనా ఉద్రికత్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతల నోటి వెంట వినబడుతున్న మాట ఇది. 3,488 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దుపై వివాదం అప్పటికే ఉండగా.. చైనా-భారత్-భూటాన్ సరిహద్దు సమీపంలోని ట్రై జంక్షన్ అయిన తాగ్లా రిడ్జిని చైనా ఆక్రమించడం ఆనాటి యుద్ధానికి దారితీసింది. చైనా సేనల్ని తరిమి కొట్టాలని నాటి ప్రధాని నెహ్రూ ఆదేశించడంతో భారత సైన్యం రంగంలోకి దిగింది. 1962 అక్టోబరు 20న లడఖ్ వద్ద, మెక్ మాహన్ రేఖ వెంబడి చైనా దాడి చేసింది. చుషూల్‌లోని రిజాంగ్ లా, తవాంగ్‌లను ఆక్రమించింది. భారత్ ఓటమి ఖరారవ్వగా నవంబర్ 21న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ యుద్ధం ఫలితంగా ఆక్సాయ్ చిన్ ప్రాంతం భారత్‌నుంచి పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లింది. నాటి యుద్ధంలో సుమారు 12 వేల మంది భారత సైనికులు, 80వేల మంది చైనా సైనికులు పాల్గొన్నారు. 1,383 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా 1,047 మంది గాయపడ్డారు. 722 మంది చైనా సైనికులుమరణించారు. తగిన ఆయుధాలు, మందుగుండు లేకున్నా ప్రధాని నెహ్రూ ఆదేశించగానే ఆర్మీ చీఫ్ అనాలోచితంగా యుద్ధానికి ఉరకడం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మానెక్ షా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications