వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు గత రెండు దశాబ్దాల్లో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటున్నాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు, వాటి ప్రభావం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి అనేక దేశాల జీడీపీ వృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.

కానీ, ప్రపంచ సంపద మాత్రం ఈ 20 ఏళ్లలో ఏకంగా మూడు రెట్లు పెరిగింది. అందులో ప్రధాన వాటా చైనాదే కావటం విశేషం. మెకెన్సీ నివేదిక ప్రకారం, గత ఇరవై ఏళ్లలో ప్రపంచ సంపద ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదలలో మూడో వంతు వాటా చైనాదే.

అతిపెద్ద సంపన్న దేశాలైన చైనా, అమెరికాలలోని మొత్తం సంపదలో దాదాపు 70 శాతం కేవలం 10 శాతం సంపన్న కుటుంబాల చేతుల్లోనే ఉంది.

ప్రపంచ ఆదాయంలో 60 శాతం వాటా గల పది దేశాల (ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మెక్సికో, స్వీడన్, బ్రిటన్, అమెరికా) జాతీయ పద్దులను పరిశీలించిన మెకెన్సీ అండ్ కో సంస్థ ఈ నివేదికను రూపొందించింది. అందులోని ముఖ్యాంశాలివి:

రెండు దశాబ్దాల్లో మూడు రెట్లు పెరిగిన ప్రపంచ సంపద

గత రెండు దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థలు ఎత్తుపల్లాల బాటలో పయనిస్తున్నా, ప్రపంచ సంపద మాత్రం గత రెండు దశాబ్దాల్లో ఏకంగా మూడు రెట్లు పెరిగింది. నిజానికి మన ప్రపంచం ఇంతకు ముందుకంటే సంపన్న ప్రపంచంగా మారిందని మెకెన్సీ నివేదిక చెప్తోంది.

2000 సంవత్సరంలో ప్రపంచ సంపద 160 ట్రిలియన్లు కాగా, 2020లో అది 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే గత 20 ఏళ్లలో 358 ట్రిలియన్ డాలర్ల సంపద సమకూరింది.

చైనా

చైనా సంపద పైపైకి

ప్రపంచ సంపద పెరుగుదలలో దాదాపు మూడో వంతు వాటా చైనాదే.

ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరటానికి ముందు చైనా సంపద 2000 సంవత్సరంలో 7 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. 2021 నాటికి ఆ దేశ సంపద 120 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.

మరోవైపు, ప్రపంచ సంపద పెరుగుదలలో అమెరికా వాటా 22 శాతంగా ఉంది. అమెరికా సంపద ఈ 20 ఏళ్లలో 100 శాతానికి పైగా పెరిగి 90 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

రియల్ ఎస్టేట్

ప్రపంచ సంపదలో స్థిరాస్తులదే ప్రధాన వాటా

మొత్తం ప్రపంచ సంపదలో రియల్ ఎస్టేట్ వాటా 68 శాతంగా ఉంది. అంటే సంపదలో స్థిరాస్తులే సింహ భాగంగా ఉన్నాయి.

అయితే, ఇది స్థిరాస్తుల విలువ పెరగటం ద్వారా సమకూరిన సంపద. అంతేకానీ, మన ఆర్థిక వ్యవస్థలను ముందుకు నడిపే ఉత్పాదక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టటం ద్వారా సమకూరిన ఆస్తి కాదు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా సాఫ్ట్‌వేర్, మేధో సంపత్తి హక్కుల వంటి చరాస్తులే నడుపుతున్నాయి. ఇది అంతకంతకూ పెరుగుతోంది కూడా. కానీ, ప్రపంచ సంపదలో అధిక వాటా స్థిరాస్తులదే.

దీంతో పొదుపు చేసే మదుపరులు తగినంత ఆర్థిక లాభాలు, దీర్ఘకాలిక విలువను అందించే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నారు.

ఇలాంటి పొదుపు పెట్టుబడులన్నీ ఎక్కువగా సంప్రదాయ పెట్టుబడి రంగమైన స్థిరాస్థి రంగంలోకి మళ్లుతున్నాయి.

అంతేకాదు, వడ్డీ రేట్లు తగ్గిపోతుండటం వల్ల కూడా వీటి విలువ పెరుగుతోంది.

చైనా, అమెరికా

ఈ సంపదంతా ఎవరి దగ్గరుంది? ఎక్కడుంది?

మొత్తం ప్రపంచ సంపదలో 95 శాతం కుటుంబాలదే కావటం మరో విశేషం. అందులో సగం ఇళ్లు, నివాసాల వంటి స్థిరాస్తులు కాగా, మిగతా సగం ఈక్విటీలు, డిపాజిట్లు, పెన్షన్ ఫండ్స్ వంటి ఆర్థిక ఆస్తులుగా ఉన్నాయి.

అయితే, అటు చైనాలోనూ, ఇటు అమెరికాలోనూ మొత్తం సంపదలో మూడింట రెండు వంతుల భాగం కేవలం 10 శాతం సంపన్న కుటుంబాల చేతుల్లోనే ఉంది.

మొత్తం స్థిరాస్తి సంపదలో కార్పొరేట్ భవనాలు, ప్రభుత్వ భవనాలు, భూములు తదితర స్థిరాస్తుల వాటా 20 శాతంగా ఉంది.

సంపన్నులు మరింత సంపన్నులు, పేదలు మరింత పేదలు..

అమెరికాలో అగ్రస్థానంలోని 10 శాతం మంది సంపన్నుల చేతుల్లో ఉన్న సంపద 2000 సంవత్సరంలో 67 శాతంగా ఉంటే, 2019 నాటికి అది 71 శాతానికి పెరిగింది.

మరోవైపు, అమెరికాలో అట్టడుగునున్న 50 శాతం మంది వాటా 2000 సంవత్సరంలో 1.8 శాతంగా ఉంటే, 2019 నాటికి అది 1.5 శాతానికి తగ్గిపోయింది.

ఇక చైనాలో అగ్రస్థాయి 10 శాతం మంది సంపన్నుల చేతుల్లో ఉన్న సంపద 2000 సంవత్సరంలో 48 శాతంగా ఉంటే, 2015 నాటికి అది 67 శాతానికి పెరిగింది.

అలాగే చైనాలో దిగువస్థాయిలోని 50 శాతం మంది వాటా 2000 సంవత్సరంలో 14 శాతంగా ఉండగా, 2015 నాటికి అది 6 శాతానికి పడిపోయింది.

తలసరి సంపద ఎంతంటే...

తలసరి సంపద విషయంలో ప్రపంచ దేశాల మధ్య భారీ తేడాలున్నాయి.

మెక్సికోలో తలసరి సంపద 46,000 డాలర్లుగా ఉంటే, ఆస్ట్రేలియాలో ఏకంగా 3,51,000 డాలర్లుగా ఉంది.

మొత్తంగా చూసినపుడు సగటు తలసరి సంపద 66,000 డాలర్లుగా ఉంది.

పది సంపన్న దేశాల్లో తలసరి సంపద ఇలా ఉంది....

పది సంపన్న దేశాల్లో తలసరి సంపద ఇలా....

చైనా

86,000 డాలర్లు

ఫ్రాన్స్

2,96,000 డాలర్లు

జపాన్

2,84,000 డాలర్లు

ఆస్ట్రేలియా

3,51,000 డాలర్లు

స్వీడన్

3,23,000 డాలర్లు

జర్మనీ

2,74,000 డాలర్లు

కెనడా

2,55,000 డాలర్లు

మెక్సికో

46,000 డాలర్లు

బ్రిటన్

1,95,000 డాలర్లు

అమెరికా

2,72,000 డాలర్లు

ప్రపంచ తలసరి సంపద

66,000 డాలర్లు

పెరిగిన ప్రపంచ సంపద స్థిరంగా ఉంటుందా?

ఈ 20 ఏళ్లలో సంపద ఇంత భారీగా పెరగటానికి ప్రధాన కారణం స్థిరాస్తుల విలువ అమాంతంగా పెరిగిపోవటమే.

స్థిరాస్తుల ధరలు ఆదాయంతో పోలిస్తే దీర్ఘకాలిక సగటు కన్నా 50 శాతం అధికంగా ఉన్నాయి. దీంతో ఈ సంపద పెరుగుదల సుస్థిరంగా ఉంటుందా అనే ఆందోళనలు కూడా తలెత్తుతున్నాయి.

స్థిరాస్తుల ధరలు పెరగటం వల్ల గృహనిర్మాణం అందుబాటులో లేకుండాపోవచ్చు. దీనిఫలితంగా 2008లో అమెరికాలో రియల్ బబుల్ విస్ఫోటనంతో తలెత్తినటువంటి తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముంది.

చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే గ్రూప్ వంటి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు అప్పుల ఊబిలో కూరుకుని ఉన్నాయి. ఈ సంక్షోభం ముదిరితే అది ఆ దేశంలో స్థిరాస్థి రంగంపై పెను ప్రభావం చూపవచ్చు. ఆ ప్రభావం మిగతా ప్రపంచం మీద కూడా పడుతుంది.

ఇటువంటి ముప్పులు లేకుండా చూడాలంటే, ప్రపంచ జీడీపీని విస్తరించే ఉత్పాదక పెట్టుబడులు పెట్టటంపై మరింతగా దృష్టి సారించాలని మెకెన్సీ నివేదిక చెప్తోంది.

ఒకవేళ ఆస్తుల విలువ కుప్పకూలితే, ప్రపంచ సంపదలో మూడో వంతు తుడిచిపెట్టుకుపోతుంది. ప్రపంచంలో అతి పెద్ద సంపన్న దేశంగా, అమెరికాను అధిగమించి అగ్ర స్థానంలో నిలిచింది చైనా. కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సే తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China Surpass US to become the richest country reports Mckenzie
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X