అమెరికా.. ఇక ఊపిరి పీల్చుకో -బైడెన్ గెలుపుతో లైవ్‌లో వెక్కివెక్కి ఏడుపు -వాన్ జోన్స్ వీడియో వైరల్
''అమెరికా.. ఇక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకో.. జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఎంతో మంది నల్ల జాతీయులు ఊపిరాడక ప్రాణాలొదిలారు.. చంటి బిడ్డలు తల్లులకు దూరమయ్యారు.. అలాంటి వాళ్లందరికీ క్షమాపణలు.. ఇదిగో.. అమెరికా ప్రజలకు శుభదినం వచ్చేసింది. అధ్యక్షుడి స్థానంలో ఉండి.. ఒక తండ్రిగా పిల్లల ఆలనాపాలన చూసే రక్షకుడొచ్చాడు.. ఈ ఉదయం నుంచి మనమంతా నిశ్చింతగా బతకొచ్చు.. మన పిల్లలకు మంచి నడవడిక నేర్పొచ్చు..'' అంటూ తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు ప్రముఖ టీవీ వ్యాఖ్యత వాన్ జోన్స్.

లైవ్‌లో వెక్కి వెక్కి ఏడుపు
నాలుగు రోజులపాటు సర్వత్రా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో శనివారం ఉదయం నాటికి క్లారిటీ వచ్చింది. సిట్టింగ్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ జో బైడెన్ విజయం సాధించినట్లు ఖరారైన క్షణంలో దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ట్రంప్ పాలనలో తమపై జరిగిన అమానుష దాడులు, వర్ణ వివక్షను గుర్తుచేసుకున్నారు. సాధారణపౌరులతోపాటు మీడియా దిగ్గజం, సీఎన్ఎన్ సహ వ్యవస్థాపకుడు వాన్ జోన్స్ లైవ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యాయ్యారు. జో బైడెన్ గెలుపు వార్తను చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చారు.
పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

ప్రశాంతత దొరికింది..
లైవ్ వార్తల అనంతరం వాన్ జోన్స్ తన ఎమోషనల్ వీడియో క్లిప్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడం అత్యంత గొప్ప విషయమని, ప్రజలందిరికీ ఇదొక సుదినమని, ఇప్పుడు తనలాంటి ఎంతో మంది పీడితులకు కాస్త ప్రశాంతత దొరికిందని ఆయన రాసుకొచ్చారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా.. ‘‘మంచి వ్యక్తిత్వం అనేది కచ్చితంగా అవసరమే(Character MATTERS). నిజానికి ఇదే చాలా కీలకం కూడా. కుత్సిత బుద్ధితో పాడు పనులు చేయడం, క్యారెక్టర్ ను కోల్పోవడం చాలా తేలిక. కానీ దాని పరిణామాలు తిరిగి మనకే తగులుతాయి'' అని జోన్స్ పేర్కొన్నారు.
వైరల్ వీడియో..
సీఎన్ఎన్ వ్యాఖ్యాత వాన్ జోన్స్ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. ఆదివారం నాటికి కేవలం ఆయన ఒక్క ట్వీటుకే మూడు లక్షలకుపైగా లైకులు, 75వేల రీట్వీట్లు వచ్చాయి. ఇక యూట్యూబ్, ఇతర మాధ్యమాల్లోనైతే లక్షల మంది వీక్షించారు. సీఎన్ఎన్ సహా అమెరికాలోని ప్రముఖ ఛానెళ్లన్నీ ట్రంప్ తీరును తొలి నుంచీ ఎండగడుతుండటంతో ప్రెసిడెంట్ పదే పదే ‘ఫేక్ న్యూస్' అంటూ ఎదురుదాడికి దిగడం తెలిసిందే. ఇక ఫలితాలపై ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు, మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ జోబైడెన్ 290, ట్రంప్ 214 ఓట్లు సాధించారు. 12 రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నది. బైడెన్ విజయం ఖరారైనా తుది ఫలితాల వెల్లడికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది.












Click it and Unblock the Notifications