భారీ వర్షాలు, వరదలు..200కు పైగా మృతి,వాతావరణంలో మార్పులే కారణమా..?
Congo Floods:ఆఫ్రికా దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ వరదలు పోటెత్తుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలకు సౌత్ కివు ప్రావిన్స్‌లోని కాలేహే ప్రాంతంలోని నదులు పొంగి పొర్లాయి. దీంతో లోతట్టు గ్రామాలైన బుషుషు, న్యాముకుబీ నీటమునిగాయి.
న్యాముకుబి గ్రామంలో వారాంతపు సంత జరుగుతుండగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కొండచరియల క్రింద చాలామంది గ్రామస్తులు చిక్కుకున్నారు. ఇక చాలా ఇళ్లు నీటిలో కలిసిపోయాయి. పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల బారిన పడి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత డెనిస్ ముక్వేగే ముందుకొచ్చారు. వైద్య బృందాలను ఘటనా స్థలానికి పంపించి అత్యవసర చికిత్స చేయిస్తున్నారు.

సౌత్ కివు ప్రావిన్స్ రవాండతో సరిహద్దు కలిగి ఉంది. ఇక్కడ వరదలతో పాటు కొండచరియలు కూడా తరుచూ విరిగి పడుతుంటాయి. గత వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు 200 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 5వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక కాంగోలో చోటుచేసుకున్న వర్షాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరర్స్ స్పందించారు.
వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతోనే ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయని ఆంటోనియో గుటెరర్స్ చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ పై ప్రతి దేశం అవగాహన కలిగి వాతావరణంలో ప్రమాదకరమైన మార్పులు చోటుచేసుకోకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2014లో కురిసిన భారీ వర్షాలకు 700 ఇళ్లు ధ్వంసంకాగా, 130 మంది కాంగో వాసులు గల్లంతైనట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే కాంగో దేశాధ్యక్షుడు ఫెలిక్స్ వరదల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ ఒకరోజు సంతాప దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. సౌత్ కివు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ఆదేశ కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం ఇది నాల్గవసారి అని స్థానిక ప్రభుత్వ అధికారులు చెప్పారు. విపత్తు వల్ల విధ్వంసం జరగకుండా ఎప్పుడూ ఒక దశాబ్దం పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications