వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

COP26: 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్‌లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి మీద ఉష్ణోగ్రతలు ఏటేటా పెరిగిపోతున్నాయి.

కాప్ 26 సదస్సు ఈ ఏడాది స్కాట్లాండ్‌లో జరుగుతోంది. ఈ సమావేశాలపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కానీ, కాప్ అంటే ఏంటి, అది ఎందుకు జరుగుతుంది, ఎవరు పాల్గొంటారు, అది చెబుతున్న ప్రమాదాలు ఏంటి? అన్నవి మాత్రం చాలామందికి తెలియవు.

అందుకే, వాతావరణ మార్పుల గురించి ప్రస్తుత ప్రపంచంలో ఏం చర్చ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వ్యాసాన్ని చదవండి.

కాప్ 26 అంటే ఏంటి ?

Conference of the Parties. దీనినే షార్ట్‌గా COP అని పిలుస్తారు. ప్రతిఏటా 197 దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది. వాతావరణ మార్పులు, దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.

వాతావరణ మార్పుల పై యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్ ఇది. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం, ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్.

1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా, ఈ ఏడాది జరగబోయేది 26వ ది.

ఈ ఏడు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నవంబర్ 1 నుంచి 12 తేదీల మధ్య ఈ సదస్సు జరుగుతుంది.

భూమి మీద పచ్చదనాన్ని పెంచకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది

కాప్ 26 ప్రాధాన్యత ఎంత?

చాలా ఉంది. కాప్ 26 సదస్సు 2015లో పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, అది ఏం సాధించింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం

పారిస్ ఒప్పందం ప్రాథమికంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు 1.5 సెంటిగ్రేడ్ పెరుగుతున్నాయి.

ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టిస్తాయి.

ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. కాప్ సదస్సుల ఉద్దేశం కూడా అదే. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించుకోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేస్తారు.

పారిస్‌లో జరిగిన COP-21 ప్రమాదకరమైన వాతావరణ మార్పులను నివారించడానికి కీలక లక్ష్యాలను నిర్దేశించింది.

కాప్-21 లోని కొన్ని కీలక నిర్ణయాలు

  • గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించాలి
  • పునరుద్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచాలి
  • ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు ఉండేలా చూడాలి. అవి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ దాటకుండా ఉంచేలా ప్రయత్నించాలి.
  • వాతావరణ మార్పులకు కారణమయ్యే చర్యలను తగ్గించుకునేలా పేద దేశాలకు బిలియన్ల కొద్దీ ఆర్ధిక సాయం అందించాలి.

ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ నిర్ణయాల పురోగతిని సమీక్షించుకోవాలని కూడా కాప్-21 సదస్సులో అంగీకరించారు. వాస్తవానికి కాప్ 26 సదస్సు 2020లో జరగాల్సి ఉన్నా, కోవిడ్ మహమ్మారి కారణంగా అది 2021కి వాయిదా పడింది.

కరోనా వైరస్ కారణంగా కర్భన ఉద్గారాలను తగ్గించుకునే కొన్ని మార్గాలు కనిపించాయి.

కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి?

మహమ్మారి కారణంగా పర్యావరణ పరిరక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. శిఖరాగ్ర సదస్సును ఒక ఏడాది వాయిదా వేయాల్సి వచ్చింది.

మరోవైపు, మహమ్మారి అనంతర ఆర్థిక స్థితి మెరుగు పరుచుకోవడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకునేలా కోవిడ్ అవకాశం కల్పించింది.

ఉదాహరణకు...మనం నిజంగా ఇన్ని ప్రయాణాలు చేయాలా, ఇంటి దగ్గర ఉండి పని చేస్తే సరిపోదా, ఇది కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది కదా, పట్టణీకరణను తగ్గించడానికి అవకాశం ఉందా? లాంటి ఆలోచనలకు దారి తీసింది.

గతంలో ట్రంప్ రద్దు చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని తాను కొనసాగిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. వాతావరణ అనుకూల విధానాలు అవలంబించడం వల్ల ఆర్ధికపరంగా కూడా ఎంతో మంచిదని ఆయన భావిస్తున్నారు.

ఈసారి కాప్‌ లో కూడా పర్యావరణానికి సంబంధించి సరికొత్త, సాహసోపేతమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉంది.

కాప్ సదస్సుల్లో చర్చల కన్నా గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు చాలా కీలకమైన అంశం

కాప్ 26 సదస్సు ఏం సాధిస్తుంది?

సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా, గతంలో మాడ్రిడ్ సదస్సు ద్వారా పరిష్కరించలేని అనేక సమస్యలకు జవాబు వెతకాల్సి ఉంది.

గత సదస్సు సందర్భంగానే స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. వాతావరణ పరిరక్షణపై కఠినంగా చర్యలు చేపట్టకపోతే వచ్చే ప్రమాదాల గురించి ఆమె ప్రపంచ నేతలను హెచ్చరించారు.

ఇంత జరిగినా, కొన్ని వివాదాస్పద సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చేందుకు ఆ సదస్సు ఉపయోగపడలేదు.

ఉదాహరణకు, వాతావరణ మార్పులకు కారణమయ్యే దేశాలలో మొదటి వరసలో పేద దేశాలే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న సముద్ర మట్టాలు ద్వీపాలను నెమ్మదిగా ముంచెత్తుతున్నాయి. ఇటు కరువు, వేడిగాలులు పంటలను దెబ్బ తీస్తున్నాయి.

ప్రస్తుత కాప్ 26 సదస్సులో వందకు పైగా దేశాలు కొన్ని డిమాండ్లు పెట్టాయి.

  • పర్యావరణ సమస్యల పై చర్యలకు నిధులు
  • ఈ చర్యలు తీసుకున్నందుకు కలిగిన నష్టాలకు పరిహారం
  • తమ ఆర్థిక స్థితిగతులు బాగుపడటానికి సహకారం

ధనిక దేశాలన్నీ 2020 నాటికి 100 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.75 వేల కోట్ల ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందులో సుమారు 80% శాతం మాత్రమే ఇవ్వగలిగాయి. వీటిలో ఎక్కువభాగం రుణాలే తప్ప గ్రాంట్లు కాదు.

ఈ సదస్సులో చర్చకు వస్తుందనుకుంటున్న మరో అంశం క్లైమేట్ ఫైనాన్స్. కార్బన్ మార్కెట్లు, కార్బన్ క్రెడిట్‌ల వ్యవస్థను అమలు చేయడానికి సరైన మార్గం వెతకాల్సిన అవసరం ఉంది.

కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేసే వారు గ్రీనర్ ఎకానమీలకు కార్బన్ క్రెడిట్ లను ఇచ్చే విధానం ఇది.

కాలుష్య నివారణలో ధనిక దేశాలు పేద దేశాలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది.

పేద దేశాలకు సాయం అందించాలి

చూడటానికి ఎంతో బాగుంది. కానీ, ధనిక దేశాలు తాము చెల్లిస్తున్నాం కాబట్టి, ఇష్టారాజ్యంగా కాలుష్యాలను విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

మరొక ఉదాహరణ. ఒక అడవిని నాశనం చేసినందువల్ల ఏర్పడిన ఉద్గారాల కోసం ఒక దేశం ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయిస్తారు?

ఒకవేళ గ్లాస్గో శిఖరాగ్ర సమావేశం పైన పేర్కొన్న అన్నింటికీ ఒప్పుకున్నప్పటికీ, మనం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలకు 'కాలపరిమితులు' అవసరం. ఈ సమస్యలకు పరిష్కారం చాలా సులభం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

ఇక కాప్ 26 సదస్సు తన ఎజెండాలో కొత్త అంశాలను ప్రతిపాదించే ముందు, అది దాటవలసిన అవరోధాలు కూడా చాలా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం దగ్గర్లోనే ఉంది.

సవాళ్లు ఎన్నో

2030 నాటికి మరింత దూకుడుగా, వేగంగా కార్బన్ ఉద్గారాలను సున్నాకు తీసుకెళ్లేందుకు అన్ని దేశాలను ఒప్పించడం అతి ముఖ్యమైన సవాలు. అయితే దీనికి కొన్ని ప్రకృతి-ఆధారిత పరిష్కారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

అంటే కొన్ని వాతావరణ సవాళ్లను పరిష్కరించడానికి ప్రకృతినే ఉపయోగించుకోవడం. ఉదాహరణకు కార్బన్ శోషణ, వరదలు ఇసుక తుఫానుల వంటి తీవ్ర వాతావరణ సంఘటనల నుండి రక్షించడానికి పొదలు, చెట్లను నాటడం లాంటివి.

బొగ్గు వినియోగాన్ని నిలిపేయడం, పర్యావరణ వ్యవస్థలను రక్షించడం వంటి నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి పలు ఈ సదస్సులో పలు కార్యక్రమాలను ప్రకటిస్తారని కూడా భావిస్తున్నారు.

ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలో గ్రెటా థన్‌బర్గ్ పాల్గొనడం గురించి ఎక్కడా చర్చకు రాలేదు. కానీ, పోప్ వచ్చి వెళతారన్నా ఊహాగానాలు మాత్రం సాగుతున్నాయి. మొత్తం మీద, ఈ కాప్ సదస్సులో చాలా విశేషాలే ఉండబోతున్నాయని అనుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
COP26: Why are 197 countries meeting in Scotland for 12 days?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X