కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాని షాక్
ఇస్లామాబాద్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్సులు, ఇతర వాహనాల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యుల సహాయార్థం రైల్వే అధికారులు వివిధ రైల్వే స్టేషన్లల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమత బెనర్జీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు ప్రముఖులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూరక సానుభూతిని తెలియజేస్తోన్నానని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోన్నట్లు షరీఫ్ చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంతాప సందేశాన్ని పంపించారు. రైలు ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ క్లిష్ట సమయంలో తమ ఆప్తులను కోల్పోయిన వారి బాధను పంచుకుంటున్నామని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పుతిన్ చెప్పారు. రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ అన్నారు.
ఈ ప్రమాదంపై టర్కీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆయా దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని, ఆప్తులను కోల్పోయిన వారికి నైతికంగా అండగా ఉంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications