• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19: చేపల మార్కెట్‌లో కరోనా కలకలం.. వేలాది మందికి టెస్టులు చేస్తున్న థాయిలాండ్

By BBC News తెలుగు
|

థాయిలాండ్‌లో కరోనా పరీక్షలు

కోవిడ్-19: చేపల మార్కెట్‌లో కరోనా కలకలం.. వేలాది మందికి టెస్టులు చేస్తున్న థాయిలాండ్

పొరుగు దేశాలన్నీ కరోనావైరస్ విజృంభణతో అతలాకుతలమవుతున్నా కొన్ని నెలలుగా కట్టడి చేస్తూ వచ్చిన థాయిలాండ్‌లో ఇప్పుడు పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఆ దేశంలోని అతి పెద్ద చేపల మార్కెట్ కేంద్రంగా వైరస్ ప్రబలి వందలాది పాజిటివ్ కేసులు నమోదవడంతో ఇప్పుడు ఆ మార్కెట్‌తో సంబంధం ఉన్న, సందర్శించిన వేలాది మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

మార్కెట్

రాజధాని బ్యాంకాక్ సమీపంలోని సముత్ సఖోన్ ప్రావిన్స్‌‌లో లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రావిన్స్‌లోనే వైరస్ ప్రబలిన అతి పెద్ద చేపల మార్కెట్ అయిన మాచాయ్ మార్కెట్ ఉంది.

మియన్మార్ నుంచి వచ్చే వలస కార్మికులు అక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తుంటారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి కార్మికులందరినీ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

చైనాలో కరోనావైరస్ ప్రబలిన తరువాత ఆ దేశం కాకుండా కరోనావైరస్ కేసులు వెలుగు చూసిన రెండో దేశం థాయిలాండే.

అయితే, ఇప్పటివరకు గట్టి చర్యలు తీసుకుంటూ కట్టడి చేస్తూ రావడంతో తాజాగా వైరస్ ప్రబలడానికి ముందు వరకు అక్కడ 4000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకు 60 మంది కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్ టెస్ట్

రొయ్యలు అమ్మే వృద్ధురాలితో మొదలు

వందల కోట్ల డాలర్ల చేపల వ్యాపారం జరిగే మాచాయ్ మార్కెట్‌లో రొయ్యలు అమ్మే 67 ఏళ్ల మహిళకు కరోనావైరస్ సోకినట్లు గురువారం నిర్ధరణయింది.

దీంతో అక్కడ సామూహిక పరీక్షలు ప్రారంభించారు. దీంతో ఆ మరుసటి రోజు మరో నాలుగు కేసులు వెలుగుచూశాయి. ఆదివారం నాటికి ఆ మార్కెట్ కేంద్రంగా పాజిటివ్ కేసుల సంఖ్య 689కి చేరింది.

వారిలో అత్యధికులు మియన్మార్ నుంచి వలస వచ్చిన కార్మికులేనని థాయిలాండ్ ప్రజారోగ్య శాఖ ప్రకటించింది.

కాగా, తొలుత వైరస్ సోకిన వృద్ధురాలు ఇతర దేశాలకు ఎక్కడికీ ప్రయాణించలేదు.. అయినా, ఆమెకు వైరస్ ఎలా సోకిందన్నది ఇప్పుడు అధికారులు శోధిస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తుండడమే కాకుండా మార్కెట్‌లో పనిచేసే కార్మికులెవరనీ ఇళ్లు దాటి రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

''వారు ఎక్కడికీ కదలకుండా నిషేధాజ్ఞలు జారీ చేశాం'' అని ఆరోగ్య శాఖ తెలిపింది.

కార్మికులందరికీ భోజనం, నీటి వసతి కల్పిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి తెలిపారు.

ఆదివారం మార్కెట్ ప్రాంతంలో పరీక్షలు నిర్వహించగా ఆ కేంద్రాల వద్ద మియన్మార్ కార్మికులు, స్థానిక కార్మికులు బారులు తీరడం కనిపించింది.

ఇప్పటివరకు నిర్ధరణయిన పాజిటివ్ కేసుల్లో చాలామందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

కాగా సోమవారం మరో 360 మంది వలస కార్మికులకు పాజిటివ్‌గా నిర్ధరణైంది. థాయిలాండ్‌లో ఇంతవరకు ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

వివిధ వర్గాలకు 10,300 మంది ప్రజలలో వైరస్ కేసులు గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికార ప్రతినిధి తవీసిన్ విసనయోథిన్ చెప్పారు.

సముత్ సఖోన్ ప్రావిన్స్‌లో జనవరి 3 వరకు లాక్ డౌన్ ఉంటుంది. రాత్రి పూట అక్కడ కర్ఫ్యూ అమలవుతుంది.

అక్కడ, పరిసర ప్రావిన్సులలో 40 వేల మందికి టెస్టులు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

చేపలు

దేశంపై ఎలాంటి ప్రభావం పడనుంది?

7 కోట్ల మంది జనాభా ఉన్న థాయిలాండ్‌కు మియన్మార్ సహా నాలుగు దేశాలతో సరిహద్దులున్నాయి. చాలా చోట్ల సరిహద్దు బలహీనంగా ఉంటూ చొరబాట్లు, రాకపోకలకు అనువుగా ఉంటుంది.

ఇప్పటివరకు ఆ దేశం కరోనావైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ అదుపులో ఉంచగలిగింది.

''ఈ మహమ్మారి వ్యాప్తి శృంఖలాన్ని మేం ఛేదిస్తాం. ఇప్పటికే ఈ వైరస్‌ను అదుపులో ఉంచడంలో మేం అనుభవం సాధించాం'' అని థాయిలాండ్ ప్రధాని ప్రయూథ్ చాన్ ఓచా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.

''వలస కార్మికులపై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వలస కార్మికులే కరోనావైరస్ థాయిలాండ్‌లోకి తెచ్చారని ఆడిపోసుకుంటున్నారు'' అని టెస్టుల వద్ద మియన్మార్ కార్మికులతో సమన్వయం వ్యవహారాలు చూస్తున్న ఆ దేశానికే చెందిన ఓ కార్మికుడు చెప్పారు.

ప్రజలు మరింతగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు, కార్యాలయాలు కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీలు వంటి ఏర్పాటు చేసుకోవద్దనీ అభ్యర్థించింది.

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న పర్యటక రంగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్న సమయంలోనే అక్కడ వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

విదేశీ పర్యటకులను అనుమతించడంతో ఆంక్షలను గురువారమే సడలించారు.. ఆ రోజే చేపల మార్కెట్‌లో కరోనా వైరస్ కలకలం మొదలైంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus fear in Thailand Fish market
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X