వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: వ్యాక్సీన్ల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనావైరస్ వ్యాక్సీన్

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19కు కళ్లెం వేసేందుకు భారీగా టీకాలు వేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే, వ్యాక్సినేషన్‌కు సంబంధించి కుప్పలుతెప్పలుగా వస్తున్న సమాచారం, సూచనలు ఒక్కోసారి గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ గందరగోళం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని కీలక అంశాలను మనం తెలుసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.

వ్యాక్సీన్ అంటే ఏమిటి?

ఇన్ఫెక్షన్, వైరస్, లేదా వ్యాధితో పోరాడేలా శరీరాన్ని వ్యాక్సీన్ సిద్ధం చేస్తుంది. ఈ వ్యాధులకు కారణమయ్యే

సూక్ష్మజీవులను అచేతనం లేదా బలహీనంగాచేసి వ్యాక్సీన్లను తయారుచేస్తుంటారు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవుల తరహాలో స్పందించే డమ్మీ సూక్ష్మజీవులనూ వ్యాక్సీన్ల తయారీలో ఉపయోగిస్తుంటారు.

వ్యాధి కారక సూక్ష్మజీవులు దాడి చేసినప్పుడు వాటిని గుర్తించి, పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక శక్తికి ఈ వ్యాక్సీన్లు అందిస్తాయి. వీటి వల్ల మనకు పెద్ద అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు. కొంతమందిలో మాత్రం తాత్కాలిక జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి.

ఈ వ్యాక్సీన్లు చాలా శక్తిమంతమైనవని అమెరికాలోని ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. సాధారణంగా ఔషధాలు వ్యాధులతో పోరాడతాయి. కానీ వ్యాక్సీన్లు మాత్రం వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

వ్యాక్సీన్లు సురక్షితమైనవేనా?

తొలినాటి వ్యాక్సీన్లను 10వ దశాబ్దంలో చైనావాసులు తయారుచేశారు. అయితే, ఆధునిక వ్యాక్సీన్లకు ఆధ్యుడు మాత్రం ఎడ్వర్డ్ జెన్నర్. 1796లో ''కౌపాక్స్ ఇన్ఫెక్షన్’’తో మశూచి నుంచి తప్పించుకోవచ్చని ఆయన గుర్తించారు. ఆయన తన వాదనను ప్రయోగపూర్వకంగా నిరూపించారు. రెండేళ్ల తర్వార పరిశోధనల రూపంలో ప్రచురించారు. వ్యాక్సీన్ అనే పదం ''వ్యాక్కా’’అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వ్యాక్కా అంటే ఆవు అని అర్థం.

ఆధునిక ప్రపంచంలో వ్యాక్సీన్లను వ్యాధులపై శక్తిమంతమైన అస్త్రాలుగా భావిస్తున్నారు. ఏటా 30 లక్షల మంది మరణించకుండా ఈ వ్యాక్సీన్లు అడ్డుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. 20కిపైగా వ్యాధుల నుంచి ఈ వ్యాక్సీన్లు రక్షణ కల్పిస్తున్నాయని వివరిస్తోంది.

ఈ వ్యాక్సీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేముందు పక్కాగా పరీక్షలు చేపడతారని సీడీసీ చెబుతోంది. తొలుత ప్రయోగశాలల్లో, తర్వాత జంతువులపై ఈ వ్యాక్సీన్లను ప్రయోగిస్తారు. చివరగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపడతారు. ఆ తర్వాత సంబంధిత దేశాల్లోని ఆరోగ్య ప్రాధికార సంస్థలు వీటికి ఆమోదం తెలుపుతాయి. వీటి వల్ల కొన్ని ముప్పులు కూడా ఉంటాయి. అయితే, ఆ ముప్పులను అడ్డుకోవడానికి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే, ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు ఒకప్పుడు లక్షల మంది ఆఫ్రికా చిన్నారులను బలిగొన్న వ్యాధులు ఇప్పుడు దాదాపుగా కనుమరుగు అయ్యాయి. లక్షలాది మంది మృతులకు కారణమైన మశూచి నేడు పూర్తిగా నిర్మూలన కావడానికి వ్యాక్సీన్లే కారణం.

అయితే, కొన్నిసార్లు ఈ ఫలితాలు పూర్తిస్థాయిలో కనిపించడానికి దశాబ్దాలు పడుతుంది. ఉదాహరణకు గత ఆగస్టులోనే ఆఫ్రికాలో పోలియో అంతరించింది. దీనికి 30ఏళ్ల ముందు పోలియో టీకాల కార్యక్రమం మొదలైంది. అంటే వ్యాధి పూర్తిగా నిర్మూలన కావడానికి ఇక్కడ దాదాపు 30ఏళ్లు పట్టింది.

ప్రస్తుత కోవిడ్-19 వ్యాక్సినేషన్‌తో సాధారణ స్థితి వచ్చేందుకు కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకూ సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

వ్యాక్సీన్లు ఎలా తయారుచేస్తారు?

బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. వాటిలోని యాంటీజెన్లతో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.

సంప్రదాయ వ్యాక్సీన్లలో క్రియాశీలంగాలేని లేదా బలహీనమైన యాంటీజెన్లు ఉంటాయి. సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకముందే ఇవి పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. ఫలితంగా వ్యాధి సంక్రమించే స్థితి వచ్చినప్పుడు పోరాడేందుకు మన శరీరం సిద్ధంగా ఉంటుంది.

అయితే, కొన్ని కరోనావైరస్‌లపై పోరాడే వ్యాక్సీన్లను సిద్ధంచేసేందుకు కొత్త విధానాలను కూడా అభివృద్ధి చేశారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

కొన్ని వ్యాక్సీన్లు భిన్నంగా..

ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా వ్యాక్సీన్లను మెసెంజెర్ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) వ్యాక్సీన్లుగా పిలుస్తున్నారు. అంటే కరోనావైరస్ జెనిటిక్ కోడ్ సాయంతో వీటిని తయారుచేశారు.

వైరస్ ఉపరితలంపై ఉండే ఓ స్పైక్ ప్రోటీన్‌తో కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. అయితే, ఈ స్పైక్ ప్రోటీన్లను తయారుచేసే శక్తిని మన శరీరంలోని కణాలకు అందించడమే లక్ష్యంగా ఈ వ్యాక్సీన్లను తయారుచేశారు. ఫలితంగా శరీరానికి కోవిడ్-19తో పోరాడే శక్తి లభిస్తుంది. ఈ విధానం.. క్రియాశీలంగాలేని లేదా అచేతనమైన వైరస్‌లను ఉపయోగించే విధానం కంటే భిన్నమైనది.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కూడా భిన్నమైనదే. చింపాంజీల్లో సాధారణ జలుబుకు కారణమయ్యే ఓ వైరస్‌కు కోవిడ్-19 జెనిటిక్ కోడ్ జోడించి శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు.

ఈ మూడు వ్యాక్సీన్లకు బ్రిటన్, అమెరికా ఆమోదం తెలిపాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌కు భారత్ కూడా ఆమోదం తెలిపింది. మెక్సికో, చిలీ, కోస్టారికాల్లో ఫైజర్ వ్యాక్సీన్లను భారీగా ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు మొదలయ్యాయి. మరోవైపు బ్రెజిల్ ప్రభుత్వం.. ఆక్స్‌ఫర్డ్, సినోవ్యాక్ వ్యాక్సీన్లకు ఆమోదించింది.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఇతర వ్యాక్సీన్లు ఇవి..

చైనాకు చెందిన ''కరోనావ్యాక్’’ వ్యాక్సీన్‌ను సినోవ్యాక్ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని చైనా, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లలో ప్రజలకు ఇవ్వడం మొదలపెట్టారు. ఈ వ్యాక్సీన్‌ను క్రియాశీలంగా లేని వైరస్‌లతో సంప్రదాయ విధానంలో తయారుచేశారు.

అయితే, దీని సామర్థ్యంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. టర్కీ, ఇండోనేసియా, బ్రెజిల్‌ల్లో తాజా ప్రయోగపరీక్షల ప్రకారం ఇది కేవలం 50.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని వార్తలు వచ్చాయి.

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ ''కోవిషీల్డ్’’తోపాటు దేశీయ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ''కోవాగ్జిన్’’ను కూడా ప్రజలకు ఇస్తున్నారు.

వైరస్‌లో మార్పులు చేస్తూ తయారుచేసిన వైరల్ వెక్టర్ వ్యాక్సీన్ స్పూత్నిక్ వీని రష్యా ప్రజలకు ఇస్తోంది. దీన్ని అర్జెంటీనాలో కూడా ఇస్తున్నారు. రష్యా నుంచి అర్జెంటీనా 3,00,000 డోసులకు ఆర్డరు ఇచ్చింది.

మొత్తంగా 27 కోట్ల ఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ (ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది) వ్యాక్సీన్లు ఆఫ్రికా యూనియన్ ఆర్డరు చేసింది.

అల్పాదాయ దేశాలకు కోవాక్స్ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న 60 కోట్ల వ్యాక్సీన్లకు ఇవి అదనం.

నేను వ్యాక్సీన్ తీసుకోవాలా?

ఇది తప్పనిసరనే నిబంధన ఎక్కడా లేదు. అయితే, ఆరోగ్యపరమైన కారణాలతో వైద్యులు వేసుకొవద్దని సూచిస్తే తప్పితే, మిగతా అందరూ వ్యాక్సీన్ వేసుకోవడమే మంచిది.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ సోకకుండా అడ్డుకోవడంతోపాటు ఇతరులకు కూడా మన నుంచి ఈ వైరస్ సోకకుండా ఈ వ్యాక్సీన్లు రక్షణ కల్పిస్తాయని సీడీసీ చెబుతోంది. ముఖ్యంగా ఈ మహమ్మారి నుంచి మనం బయటపడటానికి వ్యాక్సీన్లు అస్త్రంలా పనిచేస్తాయని వివరిస్తోంది.

కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేయాలంటే ప్రపంచంలో 65 నుంచి 70 శాతం మందికి వ్యాక్సీన్లు ఇవ్వడం తప్పనిసరని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంటే ప్రజలు వ్యాక్సీన్లు వేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్రోత్సహిస్తోంది. అయితే, సరైన విధానాలను అనుసరించకుండా ఆగమేఘాలపై ఈ వ్యాక్సీన్లను తయారుచేశారని కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

నిజమే, వ్యాక్సీన్లు సంప్రదాయ విధానంలో తయారు చేయడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అయితే, ఈ ప్రక్రియలు వేగంగా, సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రపంచ పరిశోధకులు, వ్యాక్సీన్ తయారీ సంస్థలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి పనిచేసింది. దీంతో వేగంగా వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి.

సంక్షిప్తంగా చెప్పాలంటే, కోట్ల మందికి ఈ వ్యాక్సీన్లు ఇవ్వడం ద్వారా కోవిడ్-19 సోకకుండా అడ్డుకోవచ్చు. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వస్తుంది. మనం సాధారణ పరిస్థితికి రావడానికి ఇది తోడ్పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Things You Must Know About Vaccines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X