చైనాలో ‘వుహాన్ డైరీ’ ప్రకంపనలు: నిజాలు వెల్లడించిన రచయితకు చంపేస్తామంటూ బెదిరింపులు
బీజింగ్: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, కరోనావైరస్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు చైనా వైరస్‌కు సంబంధించిన ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడంతో ఆ దేశంపై అమెరికాతోపాటు పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశంలో మీడియాపైనా ఆంక్షలు ఉండటంతో కరోనా మృతుల సంఖ్య, వ్యాప్తికి సంబంధించిన విషయాలు కూడా బయటికి రాకపోవడం గమనార్హం.

వుహాన్ డైరీలో కరోనా పుట్టిన నాటి నుంచి..
తాజాగా, చైనా వూహాన్ నగరాన్ని లాక్‌డౌన్ చేసిన తర్వాత ఏం జరిగింది? కరోనా వ్యాప్తికి సంబంధించిన వివరాలను చైనా అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని పొందిన రచయిత్రి ఫాంగ్‌ఫాంగ్ వెల్లడించే ప్రయత్నం చేశారు. వూహాన్ నగరానికే చెందిన 64ఏళ్ల ఈ రచయిత్రి.. ఆ నగరంలో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందనే విషయాన్ని ఆన్‌లైన్ డైరీ రాయడం మొదలుట్టారు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది అభిమానులుండటంతో, వారంతా ఆమె డైరీ చదవడం ప్రారంభించారు.

నిజాలు బట్టబయలు.. చంపేస్తామంటూ రచయితకు బెదిరింపులు
అంతేగాక, ఆ డైరీ వేర్వేరు విదేశీ భాషాల్లోకి అనువాదం అవుతుండటంతో చైనీయులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పటికే కరోనావైరస్‌పై చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదనే ఇతర దేశాల ఆరోపణలకు మరింత ఆజ్యం పోసేలా చేశావంటూ సదరు రచయితపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాక, చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలకు చైనాపై మరిన్ని అనుమానాలు రేకెత్తించేలా మారుతోంది.

వుహాన్‌లో ఏం జరిగిందంటే..
2019 చివరలో చైనాలోని వుహాన్ నగరంలో కరోనావైరస్(కొవిడ్-19) పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 23న లాక్‌డౌన్ విధించారు. అప్పటినుంచి రచయిత ఫాంగ్ వుహాన్ లో పరిస్థితులు, జీవనం ఎలాఉందో డైరీ రాయడం మొదలుపెట్టింది. ప్రజల్లో నెలకొన్న భయం, ఆగ్రహం, నిర్బంధంలోకి పంపించడంతో నమ్మకం, అధికారుల చర్యల గురించి తన డైరీలో వివరించారు. అయితే, రాజకీయంగా సున్నితమైన అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు.

కరోనా వ్యాపిస్తుందని తెలిసినా..
కరోనాతో ఆస్పత్రులు నిండిపోవడంతో కొత్త రోగుల్ని ఇంటికి పంపేస్తున్నారని, మాస్కుల కొరత ఉందని, సన్నిహితుల మరణాల గురించి ఆమె వెల్లడించారు. ‘ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని మాకు ముందే తెలుసు. ఈ విషయాన్ని మేం మా ఉన్నతాధికారులకు వెల్లడించాం. కానీ, ప్రజలను ఎవరూ హెచ్చరించలేదు' అని తనతో ఓ వైద్యుడు ప్రస్తావించారని ఆమె తన డైరీలో పేర్కొన్నారు. ఇలాంటి వాస్తవాలు బయటపెట్టడం చైనీయులకు గిట్టడం లేదు. ఈ క్రమంలోనే రచయితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైనీయులు.

చైనాలో ప్రకంపనలు.. అమెరికాకు ఆయుద్ధమే..
అంతేగాక, సదరు రచయిత డైరీని కొలిన్ హార్పర్స్ ముద్రిస్తుండటం మరింత ప్రకంపలను సృష్టిస్తోంది. కాగా, రచయిత్ ఫాంగ్ ధైర్యం చేసి నిజాలను వెల్లడించడంపై చైనాలో కొందరితోపాటు విదేశాలు ప్రశంసిస్తున్నాయి. ఈ డైరీ అమెరికాకు ఆయుధంగా మారే అవకాశం ఉండటంతో చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.