Covid Alert: తస్మాత్ జాగ్రత్త.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!
Covid Alert: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే. సరైన సమయానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. లేకుంటే కోట్లలో ప్రాణ నష్టం జరిగి ఉండేది. కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ మరోసారి వైరస్ కలకలం సృష్టిస్తోంది. కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా అమెరికాలో కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో వేసవి సెలవులు కావడంతో ప్రజలు వాటిని ఆస్వాదించేందుకు ప్రయాణాలు చేస్తున్నారు. తీర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రజలు తరలిపోవడం వల్ల కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) వెల్లడించింది.
భారీగా కేసులు నమోదవుతుండటంతో అమెరికా వైద్య శాఖ అప్రమత్తమైంది. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కరోనా కేసులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఓహియో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. సీడీసీ నివేదిక ప్రకారం.. NB.1.8.1, స్ట్రాటస్(XFG) అనే వేరియంట్లు ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ల ప్రభావం వల్ల గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె బరువుగా ఉండటం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని వెల్లడించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మాస్కులు ధరించాలని కోరారు. సాధ్యమైనంతవరకు భౌతిక దూరాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ రకం మురుగు నీటిలో అధికంగా ఉంటుందని.. ప్రజలందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications