వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్: భారత్‌లో కరోనా విలయాన్ని చూసి పాకిస్తాన్ భయపడుతోందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్

భారతదేశంలో కరోనా సంక్షోభం తీవ్రమవుతుండడం పాకిస్తాన్ అధికారులలో గుబులు పుట్టిస్తోంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులే అక్కడ కూడా ఏర్పడితే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 200 మార్కును దాటింది.

దేశంలో మూడో వేవ్ కొనసాగుతోందని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది మునుపటికంటే తీవ్రంగా ఉండొచ్చని భావించిన అధికారులు కోవిడ్‌ ఆంక్షలు విధిస్తున్నారు.

వైరస్ హాట్ స్పాట్‌లు ఉన్నచోట పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

పాజిటివిటీ రేటు అయిదుకన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో విద్యా సంస్థలను మూసివేశారు. ఉత్సవాలు, వివాహ వేడుకలు, క్రీడా కార్యక్రమాలు, పర్యటనలను నిషేధించారు.

సాయంత్రం ఆరు గంటల తర్వాత అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావడానికి ప్రజలను అనుమతిస్తున్నారు. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో వివిధ పరీక్షలనూ వాయిదా వేశారు.

దేశంలో ఎమర్జెన్సీ విధించాలని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్(పీఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ముందు జాగ్రత్త చర్యగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులను నిలిపేయాని కూడా పీఎంఏ సూచించింది.

భారతదేశంలో కరోనా ప్రతాపాన్ని చూశాక, దేశంలో రోజువారీ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 250 టన్నులు పెంచాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని పరిశ్రమలలో ఆక్సిజన్ వాడకాన్ని తగ్గించాలని కూడా భావిస్తోంది.

''ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని 90 శాతం వరకు వాడుకుంటున్నాం. అందులో ఎక్కువ భాగం కరోనా రోగుల చికిత్సకే ఉపయోగిస్తున్నాం'' అని కేంద్ర మంత్రి అసద్ ఉమర్ అన్నారు.

ఆయన నేషనల్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

పాకిస్తాన్

రంగంలోకి దిగిన సైన్యం

పాకిస్తాన్‌‌ లో కోవిడ్ నిబంధనలను అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆంక్షల పేరుతో ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించడం మంచిది కాదని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు.

దీంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (SOP) నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు భారత్‌లో నెలకొన్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని, ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

మొదటి దశలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 16 నగరాల్లో దళాల మోహరింపు పెరిగింది. లాహోర్, రావల్పిండి, కరాచీ, క్వెట్టా, పెషావర్, ముజఫరాబాద్‌లు ఈ నగరాల జాబితాలో ఉన్నాయి.

పాకిస్తాన్

ఆర్థిక వ్యవస్థకు సవాల్

పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంక్షోభం రానురాను ముదురుతోందని చాలామంది భావిస్తున్నారు.

పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగితతో ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెబుతోంది. .

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా హెచ్చరించింది. కోవిడ్ ఆంక్షల కారణంగా 2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వ్యాపారం బాగా దెబ్బతింది. వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది.

వీటన్నిటి దృష్ట్యా సంపూర్ణ లాక్‌డౌన్ నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భావిస్తోంది.

''మూడో వేవ్ మునుపటికన్నా తీవ్రంగా ఉంది. ఇంగ్లండ్ నుంచి లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్‌లకు నగరాలకు వచ్చిన వారి వల్ల కరోనా తీవ్రత ఎక్కువైంది'' అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

''వ్యాక్సీన్ కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. తయారు చేసే దేశాలలోనే వ్యాక్సీన్ అందుబాటులో లేదు. అందువల్ల టీకా సరఫరాలో కొన్ని పరిమితులు తప్పడం లేదు'' అన్నారు ఇమ్రాన్ ఖాన్.

కొన్ని పట్టణాల్లో కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అక్కడ నిత్యావసరాల సరఫరాను ప్రభుత్వం పెంచింది.

పాకిస్తాన్

వ్యాక్సినేషన్ ప్రక్రియ

దక్షిణాసియాలో అందరికన్నా ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన దేశం పాకిస్తాన్. ప్రభుత్వం టీకాలు వేయడం ప్రారంభిస్తే ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో, ప్రైవేటు రంగానికి టీకాలు బయటి నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు.

ఇప్పటి వరకు కేవలం దేశ జనాభాలో 1 శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు. కొంతకాలం కిందటి వరకు పాకిస్తాన్ టీకాను కొనడానికి బదులుగా చైనా నుంచి విరాళంగా వచ్చిన వ్యాక్సీన్‌పై ఆధారపడింది.

డిమాండ్‌ పెరగడంతో ప్రభుత్వం ఇప్పుడు టీకాను కొనడానికి సిద్ధమైంది. వ్యాక్సీన్‌ పొందడానికి పాకిస్తాన్‌ కొన్నాళ్లుగా వేచి చూస్తోంది. ఈలోగా బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లు దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చాయి.

భారతదేశానికి పాకిస్తాన్ సానుభూతి

కరోనా సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌కు పాకిస్తాన్ ప్రజలు సానుభూతి ప్రకటించారు. భారత్‌లో ఆక్సిజన్ సమస్య ఎక్కువగా ఉండటంతో తాము సహకరిస్తామంటూ సోషల్ మీడియాలో అనేక హ్యాష్‌ట్యాగ్‌లతో సంఘీభావం తెలిపారు.

#IndiaNeedsOxygen, #IndainLivesMatter, #PakistanstandswithIndia లాంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

https://twitter.com/LightItUp_BTS_/status/1385987051728740366

ప్రజల ఆకాంక్షలను గమనించిన పాకిస్తాన్ ప్రభుత్వం వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్‌లను భారతదేశానికి పంపుతామని ప్రతిపాదించింది.

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు, సామాజిక వేత్త అబ్దుల్ సత్తార్ ఈడీ కుమారుడు ఫైజల్ ఈడీ భారత ప్రధానమంత్రి ఒక లేఖ రాశారు. భారత్‌కు తాము 50 అంబులెన్సులు పంపుతామని ఆయన ప్రతిపాదించారు.

పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు భారత విదేశాంగ శాఖ ప్రతిస్పందించకపోయినా భారతీయులు చాలామంది ఫైజల్ ఈడీ ప్రతిపాదనను స్వాగతించారు.

పాకిస్తాన్

మసీదులలో ప్రార్థనలు యథాతథం

రంజాన్ మాసంలో మసీదులలో ప్రార్థనలు చేసే సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించినా ప్రజలు వినలేదు. దీంతో ఈసారి కూడా ప్రభుత్వం మసీదులను తెరిచి ఉంచుతోంది.

అయితే, ప్రజలు నమాజ్ సమయంలో సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరుతోంది. మసీదుల కోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను కూడా ప్రకటించింది.

అయితే దేశంలోని వేలాది మసీదులలో వాటిని అనుసరించేలా చూడటం చాలా కష్టం.

భారతదేశంలో తయారైన డబుల్ మ్యూటెంట్ వైరస్ రకం ఇప్పటి వరకైతే పాకిస్తాన్‌లో కనిపించ లేదు. అయితే భారత్‌కు ప్రయాణాలను ప్రభుత్వం 'సి’ కేటగిరీలో చేర్చింది.

మొత్తం మీద ప్రస్తుతానికి పాకిస్తాన్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కానీ, కరోనా కేసులు ఇలాగే పెరిగితే మాత్రం అదుపు చేయడం పాకిస్తాన్‌కు కష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: Is Pakistan scared of corona in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X