గుండెపోటు, బ్లడ్ క్లాట్‌కు కారణం అయ్యే కోవిషీల్డ్ ఉపసంహరణ
Covishield vaccine: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్.. ఇక కనిపించదు. దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు.. వంటి పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై తయారీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
యూకేకు చెందిన టాప్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా.. ఆక్స్‌ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. కోవిడ్‌ను నిర్మూలించడానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని వినియోగించిన విషయం తెలిసిందే. వ్యాక్స్‌జెవ్రియా పేరుతో ఈ వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో భారత్‌లో పంపిణీ చేసింది.

భారత్‌లో 175 కోట్ల డోసులకు పైగా ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసింది సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటూ గతంలో ఆస్ట్రాజెనెకా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ టీకా తీసుకున్న వారు అకాల మరణం బారిన పడుతున్నారంటూ లండన్ హైకోర్టులో పలు కేసులు దాఖలైన నేపథ్యంలో- ఈ విషయాన్ని ఆ సంస్థ అంగీకరించింది.
లిఖితపూరకంగా కోర్టులో డాక్యుమెంట్లను అందజేసింది. గుండెపోటు, బ్లడ్ క్లాట్ సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చని పేర్కొంది. తయారీ కంపెనీ యాజమాన్యమే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. మనదేశంలోనూ కేసులు వేశారు.
ప్రముఖ న్యాయవాది విశాల్ తివారీ.. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. వ్యాక్సిన్ డ్యామేజ్ పేమెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలంటూ ఆయన అభ్యర్థించారు. అలాగే- ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణులు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఆస్ట్రాజెనెకా.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంటోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 5వ తేదీ నాడే లండన్ హైకోర్టుకు వెల్లడించింది. మే 7వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications