Visa: సెప్టెంబర్ 3న కోర్టు కీలక తీర్పు! డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రద్దు?
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులకు సెప్టెంబర్ 3, 2026 అత్యంత కీలకమైన రోజుగా మారింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం (DHS) తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఫెడరల్ కోర్టు ఈ రోజున కీలక విచారణ జరపనుంది.
దశాబ్దాలుగా అమలులో ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానాన్ని రద్దు చేస్తూ, విద్యార్థుల వీసాలపై నిర్దిష్ట ముగింపు తేదీలను (ఫిక్స్డ్ గడువు) విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధన అమలైతే విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుందని యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికాకు వెళ్లే ఎఫ్-1 (F-1), జే-1 (J-1) వీసాదారులు తమ చదువు లేదా రీసెర్చ్ పూర్తయ్యే వరకు ఎలాంటి కాలపరిమితితో సంబంధం లేకుండా దేశంలో ఉండేందుకు 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' నిబంధన ఉపయోగపడేది. కానీ, జూలై 17న డెహెచ్‌ఎస్ (DHS) ప్రకటించిన కొత్త రూల్ ప్రకారం ఇకపై విద్యార్థులకు కచ్చితమైన గడువు మాత్రమే ఇస్తారు.
చదువు పూర్తి కావడానికి అదనపు సమయం కావాలంటే 'యుఎస్‌సీఐఎస్' (USCIS)కు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆ గడువు పెంపు దొరుకుతుందన్న గ్యారెంటీ ఉండదు. దీనికి తోడు కోర్సులు మారడంపై ఆంక్షలు, డిగ్రీ పూర్తయిన తర్వాత ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించడం వంటి నిర్ణయాలు సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి రానున్నాయి.
అమెరికా ఎకానమీకి బిలియన్ డాలర్ల దెబ్బ: పిటిషనర్ల వాదన
అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో యూనివర్సిటీల కూటమి (Presidents' Alliance) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జడ్జ్ ఎఫ్. డెన్నిస్ సేలర్ విచారించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అమెరికా ఆర్థిక రంగానికి ఏటా 72 బిలియన్ల నుంచి 145 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ (STEM) రంగాల్లో అంతర్జాతీయ విద్యార్థుల పాత్ర కీలకమని, ఈ నిబంధనల వల్ల ప్రతిభావంతులు ఇతర దేశాలకు తరలిపోతారని వాదించారు. సెప్టెంబర్ 15 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 3న జరిగే విచారణలోనే కోర్టు ఈ నిబంధనలపై మధ్యంతర స్టే ఇస్తుందా లేదా అనేది తేలిపోనుంది.
కోర్టు తీర్పుపైనే విద్యార్థుల ఆశలు
ఒకవేళ ఫెడరల్ కోర్టు ఈ కొత్త నిబంధనలపై స్టే ఇవ్వకపోతే, సెప్టెంబర్ 15 నుంచి అమెరికాలోని విదేశీ విద్యార్థులందరూ ఈ కఠిన నిబంధనల పరిధిలోకి వస్తారు. ఇది కోర్సు పొడిగింపులు, వీసా ఎక్స్‌టెన్షన్‌లు - పార్ట్‌టైమ్/స్టడీ ట్రాన్స్‌ఫర్‌లలో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం తెచ్చిన జీవోను అడ్డుకుంటే, పాత 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానమే కొనసాగుతుంది. దీంతో అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు సెప్టెంబర్ 3న కోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.














Click it and Unblock the Notifications