కరోనావైరస్ ఎఫెక్ట్: రెండ్రోజులుగా పోర్టులో నౌక.. 3వేల మంది ప్రయాణికుల నిర్బంధం
టోక్యో : జపాన్‌లో గత కొద్దిరోజులుగా ఓ పెద్ద క్రూయిజర్ లంగరు వేసి ఉంది. ఇందులో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరు ఈ క్రూయిజర్‌లోనే కాలం వెల్లదీస్తున్నారు. గత కొద్దిరోజులుగా నౌకాశ్రయంలో నౌక నిలిచిపోవడంతో చాలా మంది ఆందోళన చెందారు. అయితే అసలు విషయం ఏంటంటే ఆ క్రూయిజర్‌లో 10 మందికి కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో మిగతా ప్రయాణికులను కూడా అదే నౌకలో నిర్బంధించారు.

10మంది ప్రయాణికులకు కరోనా వైరస్
10మంది ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని జపాన్ కోస్ట్ గార్డు హాస్పిటల్‌కు తరలించింది. మిగతా ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 273 మంది శాంపిల్స్‌ను పంపగా 31 మంది ప్రయాణికులకు సంబంధించి రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఇక కార్నివాల్ డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ నౌక సోమవారం యొకొహామా నౌకాశ్రయానికి చేరుకుంది. 14 రోజుల తర్వాత ఈ నౌక చేరుకుంది. ఇక మరో రెండు వారాల పాటు ఇందులో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేదు.
ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు
ఇక నౌకలోని ప్రయాణికులు తాము పడుతున్న ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఫోటోలు, రూమ్ సర్వీస్ మీల్స్, నౌకలో ఖాళీగా ఉన్న కారిడార్లు డెక్‌లకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. నౌకలోని ప్రయాణికులంతా వారి గదులను వీడి బయటకు రాకూడదని ఆదేశాలు వచ్చినట్లు బ్రిటీష్ ప్యాసింజర్ డేవిడ్ అబెల్ చెప్పారు. ప్రతి గదికి సిబ్బంది వచ్చి ఆహారంను డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే తాను డయాబెటిక్ పేషెంట్ అని చెప్పిన డేవిడ్ తను సమయానికి ఆహారం తీసుకోకపోతే పరిస్థితి ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెబుతూ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కింది డెక్‌లో జరుగుతున్నాయని... తాను ఉండేది 9వ డెక్‌లో అని చెప్పారు.
పడవలో ప్రయాణించిన వ్యక్తికి కరోనావైరస్
హాంకాంగ్‌కు చెందిన మరో వ్యక్తి కూడా తన బాధను పంచుకున్నాడు. బుధవారం భోజనం పెట్టలేదని కేవలం కాఫీ, నీళ్లతో సరిపెట్టారని చెప్పాడు. తమకు సాధారణ జలుబు మాత్రమే ఉందని మరో ప్రయాణికుడు చెప్పాడు. కానీ కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చెబుతూ తమను నౌకలోనే బంధీలుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నౌకలో ప్రయాణిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడికి కరోనావైరస్ సోకింది. జపాన్‌లోని కగోషిమాలో ఆయన నౌకలోకి ప్రవేశించి జనవరి 25న హాంగ్‌కాంగ్ దిగిపోయారు. అనంతరం కరోనా వైరస్ టెస్టు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే అదే క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న హాంగ్‌కాంగ్ ప్రయాణికులు ముగ్గురికి, ఇద్దరు ఆస్ట్రేలియన్లకు, ఒక అమెరికన్‌కు, ఫిలిప్పీన్‌కు చెందిన సిబ్బంది ఒకరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.

ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాం
ఇదిలా ఉంటే నౌకలో ఉన్న ప్రయాణికులకు ఇంటర్నెట్ సదుపాయం, ఫోన్ సదుపాయం అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పిన సిబ్బంది... ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని చెప్పారు. సర్వీసులో భాగంగా క్రూయిజర్ సముద్రంలో చక్కర్లు కొడుతుందని చెప్పారు. ఇక క్రూయిజర్ ఉన్న ప్యాసింజర్లకు పూర్తి స్థాయిలో టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఫిబ్రవరి 12న జరగాల్సిన ట్రిప్పులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications