వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియంతలైనా దేశం దాటి పారిపోవాల్సిందేనా? అజ్ఞాతంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది? 10 మంది పాలకుల కథ..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గొటాబయ రాజపక్ష

శ్రీలంకలో కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మరి ప్రవాసంలోకి వెళ్లిపోయిన గొటాబయ రాజపక్షకు ఏం జరుగుతుంది? జులై 13న ఆయన మాల్దీవులకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆయన సింగపూర్ వెళ్లారు. ఆ తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, ఇప్పుడు ఆయన సింగపూర్‌లోనే ఉంటారా? అనే విషయంలో స్పష్టత లేదు. స్వల్పకాలిక వీసాపై ఆయన దేశానికి వచ్చినట్లు సింగపూర్ విదేశాంగ శాఖ తెలిపింది. ఆయనది ''ప్రైవేటు’’ పర్యటన అని స్పష్టంచేసింది. మరోవైపు ఆయన తిరిగి స్వదేశానికి వస్తారని శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

శ్రీలంకలో దారుణమైన అంతర్యుద్ధంలో తన ప్రమేయానికి సంబంధించి గొటాబయను అరెస్టు చేయాలని సింగపూర్ అటర్నీ జనరల్ ఎదుట ఒక మానవ హక్కుల సంస్థ పిటిషన్ కూడా దాఖలు చేసింది. మరోవైపు ఆయన సౌదీ అరేబియా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వెళ్లిపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.

పదవీచ్యుతులైన నాయకులు విదేశాలకు పరారు కావడం ఇదేమీ కొత్త కాదు. 1946 నుంచి 2012 మధ్య 180 మందికిపైగా నాయకులు ఇలా ప్రవాసంలోకి వెళ్లిపోయారని అమెరికాలోని నార్త్‌వెస్టెర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అబేల్ ఎస్క్రిబా-ఫోల్క్, డేనియేల్ క్రమారిక్ చెప్పారు.

మరి ప్రస్తుత గొటాబయ కూడా ఆ నాయకుల జాబితాలో చేరతారా? ఇంతకీ ఆ జాబితాలో ఉన్న నాయకులు ఎవరు?

దలై లామా

దలై లామా (1959 నుంచి నేటివరకు)

వివాదాస్పద నాయకుడికి ఆశ్రయమిస్తే.. భౌగోళిక-రాజకీయ సమస్యల ముప్పు..

టిబెట్ తిరుగుబాటుదారులను చైనా హింసాత్మకంగా అణచివేయడంతో.. 1959లో దలై లామా ఆశ్రయం కోరుతూ భారత్‌కు వచ్చేశారు. అయితే, ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో రెండు దేశాల మధ్య ఆరని చిచ్చు మొదలైంది.

ఆనాడు దలై లామాకు ఆశ్రయం ఇవ్వొద్దని చైనా నాయకుడు చౌ ఎల్నాయ్ చేసిన హెచ్చరికలను భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పెడచెవిన పెట్టారు.

''రెండు దేశాల మధ్య సంబంధాలు గాడి తప్పడానికి దశాబ్దాలుగా దలై లామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడమూ ఒక కారణం’’అని పొలిటికల్ సైంటిస్ట్ మహదేవ్ నలపట్ వ్యాఖ్యానించారు.

''చైనా నాయకుడి అభ్యర్థనను తోసిరాజని దలై లామాకు నెహ్రూ ఆహ్వానం పలకడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. అయితే, ఆనాడు మొదలైన విభేదాలు ఇప్పటికీ సద్దుమణగలేదు’’అని మహదేవ్ చెప్పారు.

ఆయతొల్లా ఖొమైనీ

ఆయతొల్లా ఖొమైనీ (1964- 1979), ద షా ఆఫ్ ఇరాన్ (1979-1980)

ఒక నాయకుడు ప్రవాసంలోకి వెళ్తే.. మరొకరు స్వదేశానికి..

ఇరాన్ నాయకుడైన షా మొహమ్మద్ రెజా పలావీపై పశ్చిమ దేశాలకు అనుకూలుడని ముద్ర ఉండేది. ఆయన ప్రభుత్వాన్ని మత నాయకుడు రూహోల్లా ఖొమైనీ కూలదోశారు. ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్‌కు పునాదులు వేసింది కూడా ఖొమైనీనే.

అయితే, అటు షా, ఇటు ఖొమైనీ.. ఇద్దరూ కొన్నాళ్లపాటు ప్రవాసంలో గడపాల్సి వచ్చింది. ముఖ్యంగా దేశాన్ని విడిచి వేరే దేశానికి పరారయ్యేందుకు షా చాలా కష్టపడాల్సి వచ్చింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసే ఖొమైనీ 1964లో ప్రవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. మొదట ఆయన టర్కీకి, అక్కడి నుంచి ఇరాక్‌కు, ఆ తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లారు. షాను గద్దె దించాలని తన మద్దతుదారులకు అక్కడి నుంచే ఆయన పిలుపునిచ్చేవారు.

అయితే, క్రమంగా షాపై అసమ్మతి పెరిగింది. దేశ వ్యాప్తంగా నిరసనలు, అల్లర్లు, ప్రదర్శనలు పెల్లుబికాయి. 1979లో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో కుటుంబంతోపాటు ఆయన ప్రవాసంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ద షా ఆఫ్ ఇరాన్

1979 ఫిబ్రవరి 1న విజయోత్సాహంతో ఖొమైనీ ఇరాన్‌కు తిరిగివచ్చారు. జర్నలిస్టులతోపాటు విమానంలో ఆయన స్వదేశానికి వచ్చారు. బీబీసీ ప్రతినిధి జాన్ సింప్సన్ కూడా ఆనాడు ఖొమైనీతో వచ్చారు. అయితే, ఆ విమానాన్ని ఎక్కడ కూల్చేస్తారేమోనని భయం తమను అనుక్షణం వెంటాడిందని జర్నలిస్టులు మీడియాతో చెప్పారు.

అప్పట్లో దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిలో తిరుగులేని మెజారిటీతో ఖొమైనీ గెలిచారు. ఆ తర్వాత ఇరాన్ రాజకీయ, మత నాయకుడిగా ఆయన జీవితాంతం కొనసాగారు.

షాతోపాటు ఆయన భార్య ఫరా మొదట ఈజిప్టులోని అస్వాన్‌కు వెళ్లారు. షా వైద్య చికిత్సల కోసం అక్కడకు వెళ్లారని అధికారిక ప్రకటన మొదట వెలువడింది.

ఆ తర్వాత మొరాకో, బహమాస్, మెక్సికో, అమెరికా, పనామా ఇలా చాలా దేశాల్లో కొన్నికొన్ని రోజుల చొప్పున ఆయన గడపాల్సి వచ్చింది. చివరగా కైరోలో 27 జులై 1980లో క్యాన్సర్‌తో ఆయన మరణించారు.

వైద్య చికిత్స కోసం షా అమెరికాకు వెళ్లడంతో టెహ్రాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. అక్కడి అమెరికా దౌత్య సిబ్బందిని బందీలుగా తీసుకున్నారు.

1989 జూన్ 4న చనిపోయే వరకు ఇరాన్‌కు అత్యున్నత నాయకుడిగా ఆయన కొనసాగారు.

ఈదీ అమీన్ దాదా

ఈదీ అమీన్ దాదా (1977- 1933)

నియంతలకూ తప్పని అజ్ఞాతం

ఈది అమీన్ దాదా.. ఉగాండాకు చెందిన సైనిక నాయకుడు. 1971లో తిరుగుబాటుతో ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.

ఆ తర్వాత దశాబ్ద కాలంలో ఉగాండా విధ్వంసకర నిరంకుశ పాలనను చూడాల్సి వచ్చింది. భారీగా ఊచకోతలు కూడా జరిగాయి. ఈ ఆఫ్రికా దేశంలోని ఆసియా ప్రజలందరినీ బయటకు వెళ్లగొట్టారు.

ఉగాండా నుంచి వేరే దేశాలకు పరారైన నాయకులు, టాంజానియా బలగాలు కలిసి ఈది అమీన్‌ను గద్దె దించాయి. అయితే, ఊహించని పరిణామాల నడుమ ఉగాండా నుంచి ఆయన బయట పడగలిగారు.

''తమ దేశంతో చారిత్రక, రాజకీయ, సైనిక, ఆర్థిక సంబంధాలు దృఢంగా ఉండే దేశాలకు నియంతలు ఎక్కువగా పారిపోతుంటారు’’అని ప్రొఫెసర్ ఎస్క్రిబా-ఫోల్క్ చెప్పారు.

అలానే, ఈ ముస్లిం నాయకుడికి సౌదీ అరేబియా ఆశ్రయం ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4,00,000 మంది ఉగాండా పౌరుల హత్యకు ఈది అమీన్ కారణమని ఆరోపణలు వచ్చినప్పటికీ సౌదీ పట్టించుకోలేదు.

2003 వరకు సౌదీలో ఈది అమీన్ విలాసవంతమైన జీవితం గడిపారు. అక్కడే ఆయన మరణించారు.

బేబీ డాక్ డువాలియెర్

''బేబీ డాక్’’ డువాలియెర్ (1986-2011)

కొన్నిసార్లు విదేశాల్లోనూ తిప్పలు తప్పవు

తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులకు ఆశ్రయం ఇచ్చేది సౌదీ అరేబియా మాత్రమే అనుకుంటే పొరపాటే. కొన్ని యూరోపియన్ నగరాలు కూడా ఇలాంటి పదవీచ్యుత, అసావహ నాయకులకు ఆశ్రయం కల్పించాయి. తమ మాజీ వలస పాలిత ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఇలాంటి ఆశ్రయాలకు ఎర్రతివాచీ పరిచేవి.

దీనికి హైతీ నాయకుడు జీన్ క్లాడ్ డువాలియెర్ ప్రవాసాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన్ను ''బేబీ డాక్’’గా అంతా పిలిచేవారు. 19ఏళ్ల వయసులోనే తండ్రి ఫ్రాంకోయిస్ (పాపా డాక్) నుంచి దేశ అధ్యక్ష పదవి ఆయనకు వచ్చింది. 1957 నుంచి దేశానికి పాపా డాక్ అధ్యక్షుడిగా ఉండేవారు.

తండ్రిలానే బేబీ డాక్ కూడా అసమ్మతిని అణచివేసేందుకు ''టాంటన్ మాకోట్స్‌’’గా పిలిచే విధ్వంసకర పౌర సైన్యంపై ఎక్కువగా ఆధారపడేవారు. బేబీ డాక్ పాలనలో మొత్తంగా 20,000 నుంచి 30,000 మందిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

1986లో ప్రజల నుంచి తిరుగుబాటు లేవడంతో బేబీ డాక్ విదేశాలకు పరారు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత 25ఏళ్లపాటు ఆయన ప్రవాసంలోనే గడపాల్సి వచ్చింది. ఎక్కువ కాలం ఆయన దక్షిణ ఫ్రాన్స్‌లోనే గడిపారు.

అయితే, 1986లో స్విస్ బ్యాంక్‌లోని ఆయనకు చెందిన 6 మిలియన్ డాలర్లు (రూ.47.85 కోట్ల)ను స్తంభింపచేశారు. ఆ తర్వాత 1993లో ఒక విడాకుల కేసులో చాలా డబ్బులను ఆయన ఇవ్వాల్సి వచ్చింది.

చివరి కాలంలో తన మద్దతుదారులు పంపిన డబ్బులతోనే ఆయన బతకాల్సి వచ్చింది. పారిస్‌లోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన జీవించేవారు.

2011లో ఆయన మళ్లీ హైతీకి వచ్చారు. అయితే, తన పాలనా కాలంలో నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో కేసు మోపారు. చివరగా పోర్టౌ ప్రిన్స్‌ శివార్లలో జీవించేందుకు ఆయన్ను అనుమతించారు. 2014లో గుండె పోటుతో ఆయన మరణించారు.

బెనజీర్ భుట్టో

బెనజీర్ భుట్టో (1984-1986, 1999-2007), నవాజ్ షరీఫ్

ప్రవాసం నుంచి ప్రధానిగా..

కొన్ని దేశాల్లో రాజకీయ పరిస్థితుల వల్ల ఎక్కువ మంది రాజకీయ నాయకులు ప్రవాసంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి.

బెనజీర్ భుట్టో తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండు సార్లు ఆమె ప్రవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. మొదటిసారి బ్రిటన్‌కు, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఆమె వెళ్లారు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చి రెండుసార్లు ప్రధాన మంత్రి అయ్యారు. పాకిస్తాన్‌లో ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 1988 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1996 వరకు ఆమె ప్రధానిగా కొనసాగారు.

తన కెరియర్ పతాకస్థాయిలో ఉన్నప్పుడు ప్రపంచంలోని హైప్రొఫైల్ మహిళా నాయకుల్లో ఒకరిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె సభలకు ప్రజలు భారీగా తరలివచ్చేవారు.

రెండుసార్లు ఆమె ప్రధాని పదవిని అవినీతి ఆరోపణలతో దేశ అధ్యక్షుడు రద్దు చేశారు.

నవాజ్ షరీఫ్

2013లో ఒక ఆత్మాహుతి దాడిలో ఆమె కన్నుమూశారు. ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు కూడా ఇలాంటి దాడుల్లోనే మరణించారు.

భుట్టో తర్వాత రెండుసార్లూ నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. అయితే, 1999లో ఆయన్ను పదవి నుంచి సైన్యం తొలగించింది. దీంతో ఆయన కూడా భుట్టోలానే ప్రవాసంలోకి వెళ్లిపోయారు. కొన్ని రోజులు జైలులో గడిపిన ఆయన సౌదీకి వెళ్లిపోయారు.

14ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు.

అయితే, 2017లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు అవినీతి ఆరోపణల్లో ఆయన్ను దోషిగా నిర్ధారించింది. పనామా పత్రాల కేసులో ఈ తీర్పును కోర్టు వెల్లడించింది.

1999లో భుట్టో, షరీఫ్‌లు ప్రవాసంలోకి వెళ్లేందుకు కారణం పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు. అయితే, ఆ తర్వాత ముషారఫ్ కూడా ప్రవాసంలోకి వెళ్లిపోయారు.

జైన్ అల్-అబిదైన్ బెన్ అలీ

జైన్ అల్-అబిదైన్ బెన్ అలీ

23ఏళ్ల పాటు పాలించి ఆ తర్వాత ప్రవాసంలోకి..

జైన్ అల్-అబిదైన్ బెన్ అలీ.. ట్యునీసియాను దాదాపు 23ఏళ్లపాటు పాలించారు. అరబ్ స్ప్రింగ్ నిరసనల్లో భాగంగా 2011 జనవరిలో ఆయన తన పదవిని పోగొట్టుకున్నారు.

బెన్ అలీ మొదట్లో నిరసనలు చేపట్టేవారిని తీవ్రవాదులుగా చెప్పారు. అయితే, ఆ తర్వాత నిరసనకారుల మృతులపై సంతాపం ప్రకటిస్తూ.. సంస్కరణలు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పారు.

అయితే, ఆ ప్రకటనలు నిరసనకారులను శాంతింప జేయలేదు. మరోసారి భద్రతా బలగాలపైకి నిరసనకారులు ఘర్షణలకు దిగారు. దీంతో సౌదీ అరేబియాకు బెన్ అలీ పరారయ్యారు. 19 సెప్టెంబరు 2019లో ఆయన అక్కడే మరణించారు.

అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసినట్లు ఆయనకు పేరుండేది. అయితే, రాజకీయ స్వేచ్ఛను నియంత్రించేవారని ఆరోపణలు కూడా ఉండేవి.

ఆయన పదవీచ్యుతుడైన ఆరు నెలల తర్వాత ఆయన భార్యను అవినీతి కేసులో ట్యునీసియా కోర్టు దోషిగా నిర్ధారంచింది. ఆమెకు 35ఏళ్ల జైలు శిక్ష విధించారు.

2012లో నిరసనకారుల హత్య కేసులో బెన్ అలీకి కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది.

అరబ్ స్ప్రింగ్ నిరసనల్లో భాగంగా ట్యునీసియాతోపాటు ఈజిప్టు, లిబియా, యెమెన్‌లలో ప్రభుత్వాలు కూడా కుప్పకూలాయి. మరోవైపు సిరియాలో అంతర్యుద్ధం చెలరేగింది.

కేవలం ట్యునీసియాలో మాత్రమే ప్రజాస్వామ్య ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగింది. అయితే, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం లాంటి సమస్యల వల్ల ట్యునీసియన్లకు రాజకీయ పార్టీలపై విశ్వాసం సన్నగిల్లుతోంది.

కొత్త రాజ్యాంగం కోసం దేశంలో జులై 25న ఓటింగ్ జరిగింది. దేశ అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు కల్పించేందుకు దీనిలో నిబంధనలు ఉన్నాయి. దీనికి మద్దతుగా 90 శాతం మంది ఓటు వేసినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి.

ముమ్మర్ గడాఫీ

అంత తేలిక కాదు..

మరి ఆశ్రయం దొరకని వారి పరిస్థితి ఏమవుతుంది? అలాంటివారు అధికారంలో కొనసాగేందుకు ఏదైనా చేస్తారని ప్రొఫెసర్ అబేల్ ఎస్క్రిబా-ఫోల్క్ చెబుతున్నారు.

లిబియా మాజీ అధ్యక్షుడు ముమ్మర్ గడాఫీని ఆయన ఉదహరించారు. 2011లో లిబియా అంతర్యుద్ధం చల్లబడేందుకు గడాఫీ ప్రవాసంలోకి వెళ్లాలని కొన్ని అంతర్జాతీయ వర్గాలు సూచించాయి.

అయితే, ఆయన మాత్రం నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లేందుకు మొగ్గుచూపారు. అయితే, తన సొంత ఊరు సీర్తెలో ఆయన్ను హత్యచేశారు.

''ఆయన ప్రవాసంలోకి వెళ్లే బదులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. సురక్షితమైన ఆశ్రయం దొరక్క పోవడమూ దీనికి ఒక కారణం’’అని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు 2017లో ఒక కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Do dictators have to flee the country? What happens when you go into hiding? The story of 10 rulers..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X