
కొండచిలువలు నిజంగానే మనుషులను మింగేస్తాయా? ఇది సాధ్యమేనా? ఇండోనేసియాలో ఏం జరిగింది?

ఇండోనేసియాలోని జాంబీ ప్రావిన్స్‌లో ఓ మహిళను కొండచిలువ పూర్తిగా మింగేసిందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
జారా అనే 50 ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం రబ్బరు తోటలో పనికి వెళ్తుండగా కొండచిలువ దాడి చేసిందని, అనంతరం ఆమె కనిపించడం లేదని వెతకగా పొట్ట భారీగా ఉన్న కొండచిలువ ఒకటి కనిపించిందని.. అనుమానంతో దాన్ని చంపి పొట్ట చీల్చి చూడడంతో అందులో జారా మృతదేహం ఉందని స్థానికులు చెప్పారు.
జారాని చంపిన కొండచిలువ 5 మీటర్ల(సుమారు 16 అడుగులు) పొడవు ఉందని స్థానికులు చెప్పారు.
అయితే, కొండచిలువలు నిజంగానే మనుషులను మింగేస్తాయా? అదెలా సాధ్యం?
'జారా మృతదేహం కొండచిలువ కడుపులో ఉంది' అని బెతారా జాంబీ పోలీస్ చీఫ్ ఏకేపీ హరేఫా స్థానిక మీడియాతో చెప్పారు.
కొండచిలువ 5 మీటర్ల పొడవు ఉందని, పొట్టలో మహిళ మృతదేహం పెద్దగా ఏమీ పాడవలేదని తెలిపారు.
మనిషిని కొండచిలువ మింగేయడం అరుదే అయినప్పటికీ ఇలా జరగడం ఇండోనేసియాలో ఇదే తొలిసారేమీ కాదు.
2017లో ఒకరు, 2018లో ఇంకొకరు కొండచిలువ మింగేయడంతో ప్రాణాలు కోల్పోయారు.

కొండచిలువలు ఎలా దాడి చేస్తాయి?
గత అయిదేళ్ల కాలంలో ఇండోనేసియాలో ఇలా మనుషులను చంపిన కొండచిలువలు 'రెటిక్యులేటడెడ్ పైథాన్' జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి.
ఈ రకం కొండచిలువలు గరిష్ఠంగా 32 అడుగుల వరకు పెరుగుతాయి. చాలా శక్తిమంతంగా ఉంటాయి కూడా.
ఇవి తాము తినాలనుకునే జీవులపై ఒక్కసారిగా దాడి చేసి గట్టిగా చుట్టేసి పట్టు బిగించి నలిపేస్తాయి. ఆ తరువాత మింగేస్తాయి.
చుట్టూ గట్టిగా పట్టుబిగించడంతో నిమిషాల వ్యవధిలోనే ఊపిరాడక కానీ, కార్డియాక్ అరెస్ట్ వల్ల కాని ఆ జీవులు చనిపోతాయి.
కొండచిలువలు తమ ఆహారాన్ని పూర్తిగా మింగేస్తాయి. వాటి దవడలు ఎక్కువగా సాగుతాయి, కాబట్టి ఆహారం ఎంత పెద్దదైనా దాన్ని అమాంతం మింగేయడం కొండచిలువకు సాధ్యమవుతుంది.
మనుషులను తినే విషయానికొస్తే భుజాలు వాటికి ప్రధానంగా ఆటంకమవుతాయని, మిగతా ఎముకల్లా కాకుండా అవి గట్టిగా బిగించడం వల్ల విరగవని రెటిక్యులేట్ పైథాన్ ఎక్స్‌పర్ట్ మేరీ రూత్ లో 'బీబీసీ'తో చెప్పారు.
సింగపూర్ వైల్డ్ లైఫ్ రిజర్వ్‌స్‌లో కన్జర్వేషన్, రీసెర్చ్ ఆఫీసర్‌గా మేరీ పనిచేస్తున్నారు.

ఇతర పెద్ద జంతువులను పైథాన్స్ తింటాయా?
కొండచిలువలు సాధారణంగా క్షీరదాలను తింటాయని.. అప్పుడప్పుడు మొసళ్లు వంటి సరీసృపాలనూ తింటాయని మేరీ చెప్పారు.
మామూలుగా అయితే మిగతా పాముల్లాగే ఎలుకలు, ఇతర చిన్నచిన్న జంతువులను తింటుంటాయి. కానీ, పరిమాణంలో బాగా పెద్దవయ్యాక అవి ఎలుకలు వంటి చిన్నచిన్న జంతువులపై ఆధారపడవు.
అప్పుడు పెద్ద జంతువులనూ ఆహారంగా తీసుకుంటాయి. పందులు, ఆవులు వంటి పెద్ద జంతువులనూ అవి లక్ష్యంగా చేసుకోవచ్చు.
ఒక్కోసారి కొండచిలువలు తమ ఆహారాన్ని సరిగా అంచనా వేయలేకపోవచ్చు. తనకు సాధ్యం కానంత పెద్ద జీవిని తినడానికి ప్రయత్నించి విఫలం కావొచ్చు. 2005లో ఫ్లోరిడాలో ఇలాంటి ఘటనే జరిగింది.
అక్కడ బర్మీస్ పైథాన్ ఒకటి భారీ మొసలిని తినేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో పైథాన్, మొసలి రెండూ చనిపోయాయి. ఆ తరువాత ఫారెస్ట్ రేంజర్లు చనిపోయిన ఆ రెండింటిని గుర్తించారు.
అయితే, సరైన ఆహారం వీటి కంటపడకపోతే చిన్నచిన్న జంతువులపై ఆధారపడుతూ పెద్ద జంతువు కనిపించేవరకు కాలం వెళ్లదీస్తుంటాయి ఈ కొండచిలువలు.
మనిషిని తినడం ఇదే తొలిసారా?
తాజా ఘటన సహా ఇండోనేషియాలో గత ఐదేళ్లలో ఇలాంటివి మూడు ఘటనలు నమోదయ్యాయి.
2018లో సులవేసి ప్రావిన్స్‌లో తన కూరగాయల తోటకు వెళ్లిన ఓ మహిళ తప్పిపోయింది. ఆమె చెప్పులు, కొడవలి ఆ తరువాత కనిపించాయి. అక్కడికి 30 మీటర్ల దూరంలో పొట్టంతా ఉబ్బిపోయి ఒక కొండచిలువ కనిపించింది.
అప్పుడు స్థానికులు కొండచిలువే ఆమెను మింగేసిందని అనుమానించి దాన్ని చంపి పొట్ట కోయగా అందులో ఆ మహిళ మృతదేహం కనిపించింది.
2017లో సులవేసిలోనే 7 మీటర్ల పొడవైన కొండచిలువ ఓ రైతును మింగేసింది.
2002లో దక్షిణాఫ్రికాలో 10 ఏళ్ల బాలుడిని కొండచిలువ మింగేసింది.
2017లో ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన పామాయిల్ తోటలో ఉన్నప్పుడు సుమారు 8 మీటర్ల కొండచిలువ ఆయనపై దాడి చేసింది. కానీ, ఆయన దాంతో పోరాడి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
అంతకుముందు కూడా ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాలలో కొండచిలువలు మనుషులను మింగేసినట్లు వార్తలొచ్చినా నిరూపణ కాలేదు. మారుమూల ప్రాంతాలు, వెంటనే ఎవరూ చూడకపోవడం వంటి కారణాలతో అలాంటివి నిరూపణ కాలేదు.
ఫిలిప్పీన్స్‌లోని 'అగ్తా' అనే తెగకు చెందిన వేటగాళ్లతో కలిసి ఆంత్రపాలజిస్ట్ థామస్ హెడ్‌లాండ్ కొన్ని దశాబ్దాలు గడిపారు. ఆ తెగలో పావు వంతు మంది మగాళ్లు ఏదో ఒక సమయంలో కొండచిలువల దాడికి గురైనట్లు ఆయన చెబుతున్నారు.
తమ వద్ద ఉండే ఆయుధాల సాయంతో వాటితో పోరాడి బయటపడేవారని చెప్పారు.
అయితే, పరిమాణంలో చిన్నగా ఉండే అగ్తా తెగ మనుషులను కొండచిలువలు అప్పుడప్పుడు తినేసిన ఘటనలూ ఉన్నాయని థామస్ అధ్యయనంలో తేలింది.
ఇండోనేసియాలోని బ్రవిజయా యూనివర్సిటీకి చెందిన నియా కుర్ణియవాన్ 'బీబీసీ'తో గతంలో మాట్లాడినప్పుడు కొండ చిలువల గురించి చెప్పారు.
అవి చిన్నచిన్న శబ్దాలను, వైబ్రేషన్లను, దీపాల వేడిని ఇట్టే గుర్తిస్తాయని.. సాధారణంగా మనుషులుండే ప్రాంతాలకు దూరంగా ఉంటాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం జరిగిందా? ఫామ్‌హౌస్‌పై పోలీసుల రెయిడ్, టీఆర్ఎస్, బీజేపీ పరస్పర ఆరోపణలు
- 'పిల్లలకా? పెంపుడు జంతువులకా? భోజనం ఎవరికి పెట్టాలి?’ - పెరిగిన ధరల ఎఫెక్ట్‌తో పెంపుడు జంతువుల్ని వదిలేస్తున్న ఆస్ట్రేలియన్లు
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)