వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాన్సర్ సోకిందని టూత్ బ్రష్ చెప్పేస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పూల వాసన చూస్తున్న మహిళ

పరిమళాన్ని వెదజల్లేందుకు ఒంటిపై చల్లుకునే సువాసన ద్రవ్యాలు (సెంటులు), డియోడరెంట్లు కూడా ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విప్లవాత్మకంగా మారే తాజా వస్తువుల జాబితాలోకి చేరనున్నాయి.

పరిమళాలలో వచ్చే కొత్త ట్రెండ్స్‌ను గుర్తించేందుకు బిగ్ డేటా, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లను ఉపయోగించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్పత్తులను వేగంగా తయారు చేస్తున్నారు.

ఏఐ స్మెల్ విప్లవం ద్వారా రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించేందుకు అవసరమైన సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఇవి మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతికేందుకు సహాయపడతాయి.

మనం ఒంటికి వేసుకునే సెంటుల నుంచి రోగాలను గుర్తించే వరకూ ఏఐ జీవితంలో ప్రతీ అంశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

రద్దీగా ఉన్న స్టేషన్

టెక్ స్టార్ట్‌అప్ అరిబాల్ కొత్త పరిమళాలను సృష్టించడానికి బదులు ఆ పరిమళాలు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేసి మన ఆరోగ్యం గురించి ఏమని చెబుతాయో విశ్లేషిస్తోంది.

వాసనను గ్రహించడం కాస్త కిటుకుతో కూడుకున్న విషయం. కాంతికి, శబ్దానికి ఒక ప్రత్యేకమైన వేవ్‌లెంగ్త్ ఉండగా, వాసనలను కొలవడానికి, లెక్కించడానికి సులభమైన మార్గమేమీ లేదు.

ఈ ఫ్రెంచ్ సంస్థ వాసన పీల్చలేని ఆక్సిజన్, నైట్రోజెన్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాటిని పక్కన పెట్టి, సిలికాన్ చిప్స్ పై పరుచుకున్న ప్రోటీన్ భాగాలను వాడి మనం వాసన చూడగలిగే అణువులను గ్రహిస్తుంది.

"వాసనను శాస్త్రీయంగా వర్ణించే అవకాశం లేకపోవడంతో, దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమవుతుంది" అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ గిలోమి చెప్పారు.

"ఈ యంత్రానికి 'ఇది చీజ్', 'ఇది స్ట్రాబెర్రీ', 'ఇది రాస్ప్‌బెర్రీ' అని నేర్పడం మాత్రమే మనం చేయగలం" అని అన్నారు.

ఏదైనా రద్దీగా ఉండే ప్రదేశం ప్రశాంతంగా ఉందో లేదో చెప్పేందుకు మనం సమయాన్ని గడిపే ప్రదేశాలను పర్యవేక్షించడంలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించగలదు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ విషయం పట్ల ప్రజలు మరింత అవగాహనతో ఉండాలని అనుకుంటున్నారు.

కొన్ని రోగాలు వాసన ద్వారా గ్రహించవచ్చని చాలా ఏళ్లుగా తెలిసిన విషయమే. విమాన ప్రయాణీకుల్లో కోవిడ్ రోగులున్నారేమోనని తెలుసుకునేందుకు గతేడాది హెల్సింకి ఎయిర్ పోర్టులో కుక్కల ద్వారా ట్రయల్స్ నిర్వహించారు.

ఈ విధమైన ఆలోచన మన ఆరోగ్యాన్ని ప్రతీ నిత్యం పర్యవేక్షించి రోగాల లక్షణాలను తొలి దశలోనే గుర్తించగలిగే ఉత్పత్తులను తయారు చేసేందుకు దారి తీస్తుంది.

"నేను పళ్ళు తోముకుంటున్నప్పుడు నా టూత్ బ్రష్ లో ఉండే ఆల్‌ఫ్యాక్టివ్ స్మెల్ సెన్సార్ నా ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది" అని గిలోమి చెప్పారు.

టూత్‌బ్రష్‌లో ఉండే సెన్సార్ "ఇది డయాబెటిస్‌కు సంకేతం, ఇది క్యాన్సర్‌కు సంకేతం" అని చెప్పగలదు.

దీంతో వ్యాధి లక్షణాలు ముదరకముందే తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వీలవుతుంది.

ఇప్పటికే ఏఐతో కూడుకున్న డైయాగ్నాస్టిక్ టూత్‌బ్రష్ లాంటి స్మార్ట్ ఉత్పత్తులు కనిపిస్తున్నట్లు గిలోమి చెప్పారు.

"ఇది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుందనే ప్రశ్న లేదు. ఇదెప్పుడు అందుబాటులోకి వస్తుందనే ప్రశ్న మాత్రమే ఉంది" అని అన్నారు.

సెంట్ కార్డుల పై పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్న వ్యక్తి

"నాకు నాలుగేళ్ళున్నప్పటి నుంచీ పెర్ఫ్యూమ్‌లు విరివిగా వాడేదానిని. చెప్పాలంటే, ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే" అని మరియా నూరిస్లమోవా అన్నారు.

"నేను మా అమ్మగారు వాడే పెర్ఫ్యూమ్‌లను దొంగిలిస్తూ ఉండేదానిని. ఆమె ప్రతీ సారీ ఈ విషయాన్ని కనిపెడుతూ ఉండేవారు" అని చెప్పారు.

పెర్ఫ్యూమ్‌ల పట్ల చిన్నప్పటి నుంచీ ఉన్న ప్రేమ ఆమె సెంట్ బర్డ్ అనే అమెరికన్ స్టార్టప్‌‌కు సహవ్యవస్థాపకురాలిగా ఉండేందుకు దారి తీసింది. ఈ సంస్థ ప్రతీ నెలా తమ సబ్‌స్క్రైబర్‌లకు విభిన్నమైన హై ఎండ్ పెర్ఫ్యూమ్‌లను పంపిస్తూ ఉంటుంది.

"కానీ, టెక్నాలజీ నాకున్న రెండవ ఆసక్తి" అని ఆమె చెప్పారు.

సంస్థ యూనిసెక్స్ సెంట్‌లను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వారి 300,000 మంది సబ్‌స్క్రైబర్లు రాసిన రివ్యూలను విశ్లేషించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించింది.

వారు ఈ యూనిసెక్స్ విభాగంలో లాంచ్ చేద్దామని అనుకున్న చాలా పరిమళాలను ఒక జెండర్‌కు చెందిన వారు ప్రేమిస్తే, మిగిలిన వారు వాటిని కేవలం సహించేవారు. ఈ సమస్యను వారు పరిష్కరించాల్సి ఉంది.

"అన్ని లింగాలకు చెందిన వారూ ఒకే రకమైన పెర్ఫ్యూమ్ ఇష్టపడేలా చేయడం కాస్త కష్టమే". కానీ, 12 రకాల సువాసనలను అన్ని జెండర్లకు చెందిన వారూ సమానంగా ప్రశంసించారని వారి పరిశోధన తెలిపింది.

ఈ సమాచారాన్ని ఉపయోగించి వారు 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ రెబెల్ రేంజ్'‌ను తయారు చేశారు.

అత్యుత్తమంగా అమ్ముడుపోయే సంస్థ ఉత్పత్తుల్లో ఈ రేంజ్ టాప్ 3% లో ఉంది.

"దీనిని నేను విజయమనే అంటాను" అని నూరిస్లమోవా అన్నారు.

"గుచ్చీ , వెర్సేస్ లాంటి బ్రాండుల తరహాలో కన్ఫెషన్స్ ఆఫ్ ఆ రెబెల్ తొందరగా గుర్తించే బ్రాండ్ కాదు. కానీ, ఇది భీభత్సంగా విజయవంతం అయింది. అది సృష్టించేందుకు పనికొచ్చిన డేటాయే ఈ విజయానికి కారణమంటాను" అని అన్నారు.

సెంట్‌బర్డ్ అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని మరిన్ని పరిమళాలను తయారు చేసేందుకు వాడుతోంది.

ఈ ఏడాది సంస్థ మరో రెండు కొత్త రేంజ్‌లను చేర్చింది.

కానీ, మనం వాసన చూసే తీరును మార్చేందుకు ఏఐను వాడుతున్న సంస్థ సెంట్‌బర్డ్ ఒక్కటే కాదు.

పూల పరిమళాన్ని ఆస్వాదిస్తున్న మహిళ

భావోద్వేగాల పై ప్రభావం

పెర్ఫ్యూమ్‌లను అభివృద్ధి చేసేందుకు ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ (ఐఎఫ్‌ఎఫ్ )కూడా ఏఐ ను వాడుతోంది. కానీ, సెంట్ మన పై చూపే ప్రభావం గురించి వారు మరింత లోతైన అధ్యయనం చేస్తున్నారు.

షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఈ మల్టీ నేషనల్ సంస్థల పేర్లు మనకి కనిపించవు. కానీ, అర్మానీ, కాల్విన్ క్లీన్ , గివెన్చీ లాంటి పెద్ద పెద్ద బ్రాండులను తయారు చేసేందుకు ఈ సంస్థలు తెర వెనుక నుంచి పని చేస్తాయి.

పెర్ఫ్యూమ్‌లను తయారు చేసే విషయంలో ఐఎఫ్‌ఎఫ్ కు ఒక శతాబ్దానికి పైగా అనుభవం ఉంది. కానీ, 2000 రకాల సువాసనల పాలెట్ నుంచి 60-80 రకాల పదార్ధాలను వాడే పెర్ఫ్యూమ్‌ల తయారీలో సృజనాత్మకమైన ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ఏఐ చాలా సహాయపడుతుంది.

"ఏఐ ఒక పరికరం. ఇది పెర్ఫ్యూమ్ తయారు చేసే వారికి సంక్లిష్టత నుంచి బయటపడేందుకు గూగుల్ మ్యాప్స్‌లా దారి చూపిస్తుంది. దాంతో, పెర్ఫ్యూమ్ తయారీ పై, భావోద్వేగాల పై వారు పూర్తిగా దృష్టి పెట్టగలరు" అని సంస్థ సెంట్ విభాగం ఇన్నోవేషన్ గ్లోబల్ హెడ్ వాలెరీ క్లాడ్ చెప్పారు.

ఐఎఫ్‌ఎఫ్ కేవలం ఫ్రాగ్రెన్సెస్ తయారు చేయడం మాత్రమే కాకుండా ప్రతీ రోజూ మనం పీల్చే వాషింగ్ పౌడర్లు, ఫ్యాబ్రిక్ సాఫ్టనర్లు, షాంపూలు మొదలైన వాటిలో వాడే పరిమళాలను కూడా తయారు చేస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల అవసరాలు కూడా మారాయి.

వారి అవసరాలు "శుభ్రంగా ఉండటం నుంచీ తాజాగా ఉండటం వరకూ మారాయి" అని క్లాడ్ అన్నారు.

"వారు మరింత జాగ్రత్తగా, సురక్షితంగా ఉండేందుకు అవసరమైన అన్ని అంశాలూ ఉండాలని కోరుకుంటున్నారు".

"వారు సౌకర్యవంతంగా, తమను సంరక్షిస్తున్నట్లుగా ఉండాలని భావిస్తున్నారు" అని క్లాడ్ అన్నారు.

పరిమళాలు మనుషుల భావోద్వేగాలు , అభిప్రాయాల పై కలిగించే ప్రభావం పై ఈ సంస్థ ఎక్కువగా ఆధారపడుతోంది.

సంస్థ నిర్వహించే సైన్స్ ఆఫ్ వెల్‌నెస్ కార్యక్రమం ఏఐ టెక్నాలజీ వాడి సంతోషాన్ని, ప్రశాంతతను, ఏకాగ్రతను, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే పరిమళాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి సహాయం చేసేందుకు కూడా సంస్థ అధ్యయనాలు నిర్వహిస్తోంది.

"జీవన ప్రమాణాలను పెంచే విషయంలో, అల్జీమర్స్ లాంటి రోగాల విషయంలో దృశ్యాలు, వాసనల లాంటివి సానుకూల పాత్రను పోషిస్తాయి" అని వాలెరీ అన్నారు.

"వీటి వలన రోగాలు నయం కాకపోవచ్చు కానీ, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు మెదడును ప్రేరేపిస్తాయి" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Does a toothbrush tell you that you have cancer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X