2021 వరకు కరోనా వ్యాక్సినేషన్ గురించి ఆశలొద్దు: వారి తరువాతే.. అందరికీ: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: ప్రపంచ దేశాలను ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ ప్రమాదపుటంచుల్లో నెట్టేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ లక్షలాదిమందిని బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 30 వేల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. కోటిన్నర మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్‌ను నిర్మూలించడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సహా ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ వంటి ఒకట్రెండు మందులు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. మానవులపై ప్రయోగాలకు శ్రీకారం చుట్టాయి. మానవులపై చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తే.. వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌పై ఇప్పట్లో ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2021 వరకు కరోనా వ్యాక్సినేషన్ గురించి ఆశలు పెట్టుకోవద్దని తేల్చి చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉధృతంగా పుట్టుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ 2021 నాటికి సాధ్యం కాకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ అధినేత మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ పేషెంట్లకు కరోనా వ్యాక్సిన్‌ను అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. వారికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాతే.. సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రాణాలను నిలపడానికే తాము ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. 2021 తొలి ఆరు నెలల వరకూ వ్యాక్సినేషన్ ఉండకపోవచ్చని చెప్పారు.
కరోనా వైరస్ విరుగుడు కోసం పలు సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నాయని, అవన్నీ వేగంగా కొనసాగుతున్నాయని మైక్ ర్యాన్ అన్నారు. వ్యాక్సిన్ తయారీలో ఆశించదగ్గ పురోగతి కనిపిస్తోందని చెప్పారు. మానవులపై ప్రయోగాలు కూడా అంచనాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత.. చిట్టచివరి వ్యక్తికి కూడా దాన్ని అందిస్తామని మైక్ ర్యాన్ అన్నారు. ప్రాధాన్యత క్రమంలో కరోనా పేషెంట్లు ముందువరసలో ఉండొచ్చని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications