"రష్యాకు ఒక కస్టమర్‌ను నేను పోగొట్టేశాను".. ట్రంప్ పగటి కలలు!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాకు చమురు కొనుగోలుదారుగా ఉన్న భారత్ ఇప్పుడు రష్యాకు దూరమైందని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన సమావేశానికి ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అమెరికాలోని అలస్కాలో డొనాల్డ్ ట్రంప్-వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి ముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఆర్థిక సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటూ.. రష్యాకు అతిపెద్ద చమురు వినియోగదారులలో ఒకటైన భారతదేశాన్ని రష్యా కోల్పోయిందని అన్నారు. రష్యా కొనే చమురులో దాదాపు 40 శాతం వరకు భారత్ కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.

భారత్ నిజంగా చమురు కొనుగోలు చేయడం ఆపిందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వాస్తవాలు వేరేలా ఉన్నాయి. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. వాస్తవానికి అది క్రమంగా పెరుగుతూనే ఉంది. కెప్లెర్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్ జులై నెలలో రష్యా నుంచి రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. ఆగస్టు నెలలో ఇది రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగింది. దీనితో పాటు భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాలలో అమెరికా ఐదో స్థానంలో ఉంది.
TRUMP: "RUSSIA'S OIL CLIENT INDIA". MAY BE I WON'T HAVE TO (IMPOSE SECONDARY TARIFFS)
— Rahul Shivshankar (@RShivshankar) August 16, 2025
Trump: "They lost oil client India which was doing about 40% of the oil and China's doing a lot...if I did a secondary tariff it would be devastating...if I have to I will...may be I won't have… pic.twitter.com/wgQNvkJxGy
డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యల్లో.. ఒకవేళ సెకండరీ టారిఫ్‌లు విధించాల్సి వస్తే.. అది చాలా వినాశకరమని, కానీ అవసరమైతే ఆ నిర్ణయం తీసుకోవడానికి తాను వెనకాడనని కూడా స్పష్టం చేశారు.
అలస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ
అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ పైన ప్రపంచవ్యాప్తంగా అందరి ఆసక్తి కొనసాగింది. రెండున్నర గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత వీరికి కీలక భేటీ ముగిసింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎటువంటి ఒప్పందం జరగకుండానే వీరిద్దరి భేటీ ముగిసింది. భేటీ అనంతరం మాట్లాడిన ఇరువురు నేతలు భేటీకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పుతిన్ తో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని, సమావేశం ఫలప్రదం అయిందని తెలిపారు. అయితే ఇంకా కొన్ని కీలక అంశాల పైన చర్చించాల్సి ఉందన్నారు. ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించుకో వలసిందిగా, ఈ దఫా జరిగిన చర్చల్లో చాలా పురోగతి ఉందని పేర్కొన్నారు.చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications