భారత్ ను కాదని.. పాక్, బంగ్లాదేశ్ కు ట్రంప్ వరాలు: శతృవులను ఎగదోస్తుండు
వివిధ దేశాలపై విధించిన వాణిజ్య సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునఃసమీక్షించారు. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ నాటికి గడువు ముగిసిన నేపథ్యంలో, ఈ కొత్త టారిఫ్ అమలులోకి రానున్నాయి. రష్యాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోన్నందుకు భారత్ కు భారీగా పెనాల్టీ విధించారు. 25 శాతం టారిఫ్ పెట్టారు.
మరిన్ని అదనపు ఆంక్షలు సైతం విధించారు డొనాల్డ్ ట్రంప్. భారత ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి ఆయిల్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఇరాన్ తో శత్రుత్వాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో- ఆ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా.

కంచన్ పాలిమర్స్, ఆల్ కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రమ్ణిక్ లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, పెర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ లు ఈ జాబితాలో ఉన్నాయి.
అదే సమయంలో భారత శత్రుదేశం పాకిస్తాన్ తో పాటు హిందువులపై దౌర్జన్యకాండతో అట్టుడికి పోయిన బంగ్లాదేశ్ పైనా వరల జల్లు కురిపించారు డొనాల్డ్ ట్రంప్. భారత్‌పై 25 శాతం టారిఫ్ ను కొనసాగిస్తూనే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో సహా పలు దేశాలపై విధించిన టారిఫ్ లను తగ్గించారు. వాటిని పునఃసమీక్షించారు.
పాకిస్థాన్‌పై ఇదివరకు 29 శాతం టారిఫ్ ను విధించింది అమెరికా. బంగ్లాదేశ్ పై ఏకంగా 35 శాతం టారిఫ్ పెట్టారు. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. వాటిని అమలు చేయడానికి విధించిన గడువు ముగిసే సమయానికి.. ఈ రెండు దేశాలపై విధించిన టారిఫ్ ల సంఖ్య భారీగా తగ్గింది.
పాకిస్తాన్ టారిఫ్ నుంచి 29 నుంచి 19 శాతానికి తగ్గించారు డొనాల్డ్ ట్రంప్. అలాగే- బంగ్లాదేశ్ పై విధించిన టారిఫ్ శాతాన్ని 35 శాతం నుంచి 20కి తగ్గించారు. కొత్త టారిఫ్ ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది. కస్టమ్స్ విభాగం కొత్త టారిఫ్ సేకరణకు సిద్ధం కావడానికి ఈ అదనపు సమయం కేటాయించినట్లు వివరణ ఇచ్చింది.
గతంలో చైనాతో భారత్ వ్యాపార సంబంధాల నేపథ్యంలో, భారత్ ఒక మంచి ప్రపంచ భాగస్వామిగా వ్యవహరించడం లేదని, ఇది అమెరికా వాణిజ్య బృందానికి నిరాశ కలిగించిందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఇతర దేశాలపై కూడా అమెరికా సుంకాలు విధించింది.
తైవాన్- 20, కాంబోడియా- 19, థాయ్‌లాండ్- 19, దక్షిణాఫ్రికా- 30, టర్కీ- 15, ఇజ్రాయెల్- 15, దక్షిణ కొరియా-15 శాతం మేర టారిఫ్ లు అమల్లోకి వస్తాయి. స్విట్జర్లాండ్‌పై 39 శాతం టారిఫ్ విధించడం వల్ల స్విస్ కరెన్సీ విలువ డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపోయింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిర్ణయించుకున్న కెనడాపై విధించిన సుంకాన్ని 25 నుంచి 35 శాతానికి పెంచారు.












Click it and Unblock the Notifications