పశ్చిమ తీరంలో భారీ భూకంపం
New Zealand earthquake: న్యూజిలాండ్‌లో పెను భూకంపం సంభవించింది. ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతాన్ని వణికించింది. సునామీ భయాలను పుట్టించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటం వల్ల అలలు ఎగిసిపడ్డాయి. తీర ప్రాంతాలు మొత్తం ఖాళీ అయ్యాయి. స్థానిక అధికారులు తాత్కాలికంగా ఎమర్జెన్సీ విధించారు.
రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.8గా రికార్డయింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:15 నిమిషాల సమయంలో న్యూజీలాండ్ పశ్చిమం- నైరుతి తీర ప్రాంత పట్టణం రివర్టన్ సమీపంలో భూమి ప్రకోపించింది. రివర్టన్/అపర్ణియాకు 159 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల దిగువన న్యూజిలాండ్ ఆస్ట్రేలియన్- పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. దీని ప్రభావం.. రివర్టన్/అపర్ణియాపై తీవ్రంగా పడింది. పలు నివాసాలు బీటలు వారినట్లు స్థానిక మీడియా వివరించింది.
ప్రధాన భూకంపం తరువాత కూడా దాని తీవ్రత కొనసాగింది. వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు వెయ్యి మంది వరకు జనాభా కలిగిన చిన్న టౌన్.. రివర్టన్. సౌత్ ల్యాండ్ ప్లెయిన్స్‌గా పిలుస్తారీ ప్రాంతాన్ని. ఇక్కడి నేల సెడిమెంటరీ సాయిల్‌తో నిండివుంటుంది. ఇది- భూకంప ప్రభావం మరింత పెరగడానికి కారణమైంది. రివర్టన్‌లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ప్రాణనష్టం తప్పిందనే అంచనాలు ఉన్నాయి.
ద్వీపదేశం కావడం, భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటం వల్ల తొలుత సునామీ ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. సముద్ర తీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉండే ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సూచించింది.












Click it and Unblock the Notifications