చుట్టుముట్టిన పెను ఉత్పాతం- వరుసగా మూడోరోజూ: ఇంటర్నెట్, పవర్ కట్..!!

అంకారా: అరుదుగా సంభవిస్తాయని భావించే భూకంపాలు ఇప్పుడు వరుస కట్టాయి. వరుసగా మూడోరోజూ మరో దేశాన్ని వణికించాయి. తొలుత సోమవారం ఇండోనేషియాలోని జావాలో పెను భూకంపం సంభవించింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చింది. మూడోరోజు కూడా ఇండోనేషియన్లు ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి కోలుకోలేకపోతోన్నారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 250 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

తేరుకోకముందే..

ఈ భూకంపం మిగిల్చిన విషాదం నుంచి ఇంకా జనం తేరుకోలేదు. పలువురు భవన శిథిలాల మధ్య చిక్కుకున్నారు. వారిని వెలికి తీస్తోన్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసిందీ భూకంపం. భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయక్కడ.

ఆ మరుసటి రోజే

ఆ మరుసటి రోజే సొలొమన్ ఐలండ్స్‌లో మరో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఇండోనేషియాకు సమీపంలోనే ఉన్న సొలొమన్ ఐలండ్స్‌ను వణికించిందీ భూమి. రాజధాని హొనియారాకు నైరుతి దిశగా ఉన్న మలాంగోలో మంగళవారం ఉదయం 7:33 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. సునామీ అలర్ట్‌ను కూడా జారీ చేశారు పసిఫిక్ వార్నింగ్ సెంటర్ అధికారులు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

టర్కీలో..

ఇప్పుడు తాజాగా టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇది కూడా తీర ప్రాంత నగరానికి సమీపంలోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నల్ల సముద్రం ఒడ్డునే ఉన్న డుజ్సె సిటీలో ఈ తెల్లవారు జామున 4:08 నిమిషాలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. డుజ్సె నగరానికి వాయవ్య దిశగా 14 కిలోమీటర్లు, అడపజాన్ సిటీకి ఈశాన్య దిక్కున 51 కిలోమీటర్ల దూరం గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.

పలు నగరాలపై ప్రభావం..

ఉపరితలం నుంచి రెండు కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు యూరోపియన్ మిడ్ టెర్రయిన్ సీస్మాలజీ సెంటర్ వెల్లడించింది. దీని తీవ్రత రాజధాని అంకారాతో పాటు ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లోనూ కనిపించినట్లు టర్కీ జియాలజికల్ డిపార్ట్‌మెంట్ కందిల్లి అబ్జర్వేటరీ వెల్లడించింది. బోలు, గోల్కుక్, గెబ్జ్ వంటి నగరాలు సైతం కంపించినట్లు పేర్కొంది.

ఇంటర్నెట్, పవర్ కట్..

భూప్రకంపనలు సంభవించిన వెంటనే డుజ్సె సహా పలు నగరాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అంకారా, ఇస్తాంబుల్‌లో ఇంటర్నెట్ కూడా స్తంభించిపోయింది. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితికి గురయ్యారు స్థానికులు. నిద్రలో నుంచి ఉలిక్కి పడి బయటికి పరుగులు తీశారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పలు నివాసాలు బీటలు వారాయి. శిథిలాలు విరిగి పడ్డాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని డుజ్సె మేయర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+