ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!
ఆఫ్రికా దేశాల్ని ప్రాణాంతక ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశాల్లో విస్తరిస్తున్న వైరస్ రకం పేరు బందిబుగ్యో.. ఇది ఒక అరుదైన, ప్రాణాంతకమైన స్టెయిన్ గా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఎబోలాలోని జైర్ అనే స్ట్రెయిన్ కు వ్యాక్సిన్లు కనుగొన్నప్పటికీ ఈ బందిబుగ్యో స్ట్రెయిన్ కు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు. అయితే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
యూకేలోని ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అరుదైన స్ట్రెయిన్ కోసం మొట్టమొదటి వ్యాక్సిన్ ను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం జంతువులపై వేగంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయితే రాబోయే రెండు మూడు నెలల్లోనే మానవులపై మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్ ను మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భారత్ కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలతో భాగస్వామ్యం ఏర్పడింది.
మరోవైపు కాంగోలో ఎబోలా వైరస్ పరిస్థితి అదుపుతప్పింది. వేగంగా కేసులు విజృంభణ జరుగుతోంది. దశాబ్దాలుగా అంతర్యుద్ధం కారణంగా ఆ దేశ ప్రజలు తమ సొంత ఇళ్లను కోల్పోయి ప్రస్తుతం శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ప్రజారోగ్య ముప్పు స్థాయిని హై నుంచి వెరీ హై కు మార్చింది. వీలైనంత వేగంగా ఈ కొత్త వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ఆఫ్రికా దేశాల్లో ముంచుకొస్తున్న పెద్ద విపత్తును తప్పించాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

ఇక ఎబోలా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న క్రమంలో భారత్ కూడా అలర్ట్ ప్రకటించింది. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికుల్లో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేసింది. ఎబోలా వైరస్ కు సంబంధించిన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications