ఫోన్ నంబర్ అవసరమే లేకుండానే..ఆడియో, వీడియో కాల్స్: ఎలాన్ మస్క్ సంచలనం
వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ఎక్స్‌గా అవతరించిన మాజీ ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉన్నన్ని రోజులూ రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు.. తాజాగా మరో సరికొత్త ఫీచర్లకు శ్రీకారం చుట్టారు. వాట్సప్‌తో సై అంటే సై అనేలా పోటీకి రంగం సిద్ధం చేశారు.
ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ ద్వారా ఇకపై ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసలుబాటును కల్పించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీనికి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్ చేశారు.

ఇతరులకు ఆడియో గానీ లేదా వీడియో కాల్స్ గానీ చేయడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ అవసరం లేదు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ఉంటే సరిపోతుంది. తమ అకౌంట్‌ను ఓపెన్ చేసి, అందులో కొత్తగా చేర్చబోయే ఆడియో కాలింగ్, లేదా వీడియో కాలింగ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫోన్ చేసుకోవచ్చు.
ఐఓఎస్, ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ ఫోన్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు చెప్పారు ఎలాన్ మస్క్. దీనితో పాటు- మ్యాక్, పర్సనల్ కంప్యూటర్స్ నుంచి ఎక్స్ అకౌంట్‌లోకి లాగిన్ కావడం ద్వారా కూడా ఈ కాల్స్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారాయన.
ఇది కార్పొరేట్ సెగ్మెంట్‌లో సరికొత్త పోటీ వాతావరణానికి తెర తీసినట్టయింది. ప్రస్తుతం ఈ తరహా వెసలుబాటు వాట్సప్‌లో అందుబాటులో ఉంది. వాట్సప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. దీనికి ఫోన్ నంబర్ అవసరమౌతుంది. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకునే ఫీచర్‌ను ఎక్స్ ప్రవేశపెట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇటీవలే ఎలాన్ మస్క్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను నెలకొల్పారు. దీని పేరు ఎక్స్ఏఐ. టాప్ సెర్చింజిన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్‌మైండ్.. వంటి సంస్థల్లో పని చేసిన కొందరు మాజీ ఉద్యోగులతో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు.
ఈ స్టార్టప్ ద్వారా ఈ కాల్స్ సౌకర్యం అందుబాటులోకి తెస్తారని భావిస్తోన్నారు. టెస్లా ఇంటర్నేషనల్ కార్పొరేషన్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ పెట్టుబడిదారులతో ఈ ఏఐ స్టార్టప్‌కు నిధులు సమకూర్చడంపై చర్చలు జరుపుతున్నారు మస్క్. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విదియా కార్పొరేషన్ నుంచి వేలాది ప్రాసెసర్‌లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications