రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాన్ మస్క్ కీ రోల్: తన సొంత శాటిలైట్ నుంచి
వాషింగ్టన్: ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడుతోంది. నాలుగో రోజు తన దాడిని మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి. అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వారి దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.
యుద్ధం తీవ్రతరమౌతున్న కొద్దీ ఉక్రెయిన్‌లో ఇంటర్‌నెట్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతూ వస్తోంది. రాజధాని కీవ్ సహా కొన్ని ప్రధాన నగరాల్లో మినహా మెజారిటీ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులో లేకుండాపోయాయి. మిగిలిన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదనే వార్తలు వస్తోన్నాయి. ఇంటర్‌నెట్ పూర్తిగా స్తంభించిపోతే- ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందనేది బాహ్య ప్రపంచానికి అప్పటికప్పుడు తెలియకవపోచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి మిఖాయిలో ఫెడొరొవ్ అప్రమత్తం అయ్యారు. ఇంటర్‌నెట్ సేవలు స్తంభించిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అపర కుబేరుడు, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను సంప్రదించారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహం ద్వారా తమ దేశానికి ఇంటర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందజేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
Starlink service is now active in Ukraine. More terminals en route.
— Elon Musk (@elonmusk) February 26, 2022
అంగారక గ్రహంపై కాలనీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతోన్న ఈ ఆధునిక కాలంలో తమ దేశాన్ని ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నాలు సాగిస్తోందని ఎలాన్ మస్క్‌కు వివరించారు. స్పేస్ ఎక్స్ రాకెట్లు విజయవింతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్తోంటే రష్యా సంధించిన మిస్సైళ్లు తమదేశ పౌరులను గాయపరుస్తున్నాయని పేర్కొన్నారు. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా స్టార్ లింక్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలను అందించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

ఆయన చేసిన విజ్ఞప్తికి ఎలాన్ మస్క్.. సానుకూలంగా స్పందించారు. స్టార్ లింక్ శాటిలైట్ సర్వీసులను ఉక్రెయిన్‌లో యాక్టివేట్ చేశామని చెప్పారు. మిఖాయిలొ ఫెడొరొవ్ చేసిన ట్వీట్‌కు బదులిచ్చారు. మరిన్ని టెర్మినల్స్‌కు స్టార్ లింక్ ఉపగ్రహం నుంచి ఇంటర్‌నెట్ సేవలు అందుతాయని హామీ ఇచ్చారు. లో ఎర్త్ ఆర్బిట్ (లియో)ను అనుసంధానిస్తూ స్పేస్ ఎక్స్ ఈ స్టార్ లింక్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది.












Click it and Unblock the Notifications