యూఎస్ రెడ్ అలర్ట్: ట్రంప్‌ను మట్టుబెట్టే ప్లాన్
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వ్రే ఓ ప్రకటన విడుదల చేశారు.
అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది. రక్తమోడింది. అక్కడే ఉన్న భద్రతసిబ్బంది అతన్ని కాల్చి చంపారు. షూటర్‌ను పెన్సిల్వేనియాకు చెందినవాడిగా గుర్తించారు. అతని పేరును వెల్లడించడానికి ఎఫ్‌బీఐ ప్రస్తుతానికి నిరాకరించింది. కేసు దర్యాప్తు ఇప్పుడిప్పుడే ఆరంభమైనందున వెల్లడించలేమని స్పష్టం చేసింది. అతని వద్ద నుంచి ఎలాంటి గుర్తింపుకార్డులు లభించలేని పేర్కొంది.
ఈ ఘటనపై ఎఫ్ఐబీ పిట్స్‌బర్గ్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్.. మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌ను మట్టుబెట్టడానికే ఈ కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. ఈ ఉదంతాన్ని ట్రంప్ హత్యకు కుట్ర (Attempted assassination of Donald Trump)గా అభివర్ణించారు. దీని వెనుక గల కారణాలపై దర్యాప్తు సాగిస్తోన్నట్లు వివరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎఫ్‌బీఐ దర్యాప్తు ఏజెంట్లందరినీ యాక్టివ్ చేశామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకునేలా ఆదేశాలను జారీ చేశామని అన్నారు. ట్రంప్‌పై కాల్పులకు సంబంధించిన ఏ చిన్న క్లూ దొరికినా తమకు చేరవేయాలనే సమాచారాన్ని అందజేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications