Mehul Choksi: ఎలా ఉండేవాడు..ఇలా అయిపోయాడు: డొమినికా జైలులో ఆర్థిక నేరస్తుడు
ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. డొమినికా పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నారు. విచారణ సందర్భంగా ఆయన డొమినికా జైలులో ఉంటోన్నారు. ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి కనిపించకుండా పోయిన మేహుల్ చోక్సీ ఆచూకీ డొమినికా తేలింది. ఆయనను ఆంటిగ్వా పంపించాలా? లేక భారత ప్రభుత్వానికి అప్పగించాలా? అనే విషయంపై విచారణ సాగుతోంది.
భారత్‌కు అప్పగించడానికి డొమినికా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై అక్కడి న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా పడింది. విచారణ సందర్భంగా డొమినికా జైలులో ఉన్న మేహుల్ చోక్సీ ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. ఆంటిగ్వా మీడియా హౌస్ అంటిగ్వాన్ న్యూస్‌రూమ్ ఈ ఫొటోలను విడుదల చేసింది. మేహుల్ చోక్సీని అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆయనపై భౌతికదాడికి దిగారనేది నిజమేనంటూ అంటిగ్వాన్ న్యూస్‌రూమ్ పేర్కొంది.

ఇదివరకు చోక్సీ తరఫు న్యాయవాది, ఆంటిగ్వాకు చెందిన వేన్ మార్ష్ చెప్పిన విధంగానే ఆయన శరీరంపై గాయాలు కనిపించాయి. ఎడమ కంటి మీద గాయమైంది. చేతులు నల్లగా కమిలిపోయాయి. శరీరంలోని ఇతర భాగాలపై కాలిన గుర్తులు ఉన్నట్లు వేన్ మార్ష్ ఇప్పటికే వెల్లడించారు. దీన్ని డొమినికన్ పోలీసులు కూడా ధృవీకరించారు. మేహుల్ చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించాలంటూ అంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గ్యాస్టన్ బ్రౌనె..డొమినికా ప్రధానమంత్రికి విజ్ఙప్తి చేయడాన్ని సవాల్ చేస్తూ అడ్వొకేట్ వేన్ మార్ష్ ఈస్టర్న్ కరేబియన్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
మేహుల్ చోక్సీ.. ఏ దేశం నుంచి డొమినికాకు చేరుకున్నాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఆయన ఆంటిగ్వా నుంచి వచ్చినందున.. ఆ దేశానికే అప్పగించాలని కోరారు. మేహుల్ చోక్సీ భారతీయుడు కాదని తన పిటీషన్‌లో స్పష్టం చేశారు. ఆయనకు ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం ఉందని, ఆయనను ఆ దేశ పౌరుడిగానే గుర్తించాలని పేర్కొన్నారు. ఈ పిటీషన్‌పై విచారణ సాగుతోంది. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications