కాల్పులతో దద్దరిల్లిని టెక్సాస్: 8 ఏళ్ల చిన్నారితోపాటు ఐదుగురు మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు ఓ ఇంట్లోకి దూరి తన వద్ద ఉన్న తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 8 ఏళ్ల చిన్నారితోపాటు ఐదుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించిన ఓ ఫోన్ కాల్ వచ్చిన అనంతరం.. సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడగా.. ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల ఇంటి సమీపంలోనే ఉంటున్న నిందితుడు.. తన నివాసంలో గాల్లోకి కాల్పులు జరుపుతుండగా.. భారీ శబ్ధం వస్తుండటంతో బాధిత కుటుంబసభ్యులు అతడ్ని కాల్పులు ఆపాలని కోరారు. ఎందుకంటే తమ ఇంట్లోని పిల్లలు, కుటుంబసభ్యులు నిద్రిస్తున్నారని చెప్పారు. నిందితుడు మాత్రం వారి విన్నపాన్ని వినిపించుకోకుండా కోపోద్రుక్తుడయ్యాడు.

ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో నిందితుడు వారింట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఐదుగురు ప్రణాలు కోల్పోయారు. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారితోపాటు ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇంటి ముందు ద్వారం నుంచి బెడ్రూం వరకు బాధితుల మృతదేహాలు పడి ఉన్నాయి. చనిపోయిన వారంతా హోండూరస్ దేశానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కాల్పుల ఘటన నుంచి ఇద్దరు పిల్లలు ప్రాణాలతో భయటపడ్డారు.
ఇద్దరు స్త్రీలు వారిపై పడుకోవడం వల్లే ఇద్దరు చిన్నారులతో ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 45ఏళ్ల నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, అమెరికాలో గత కొంత కాలంగా కాల్పుల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే జరిగిన పలు కాల్పుల ఘటనల్లో దాదాపు వందమంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
దుండగుల కాల్పుల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భారతీయులు కూడా చనిపోయారు. ఇటీవల దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగువారు కూడా మరణించడం శోచనీయం. గన్ కల్చర్‌కు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. ఆత్మ రక్షణ కోసం కొనుగోలు చేస్తున్న ఆయుధాలతో కొందరు దుండగులు సామాన్యుల ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు, పార్టీలు జరిగే ప్రాంతాలను ఎక్కువగా ఈ దుండగులు లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలు పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.












Click it and Unblock the Notifications