యువ ప్రేమ జంట: 200 అడుగుల టవర్ నుంచి పడి బతికారు
ఖాట్మాండ్: గత శనివారం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం నుంచి ఓ యువ ప్రేమ జంట ప్రాణాలతో బయటపడింది. అది కూడా 200 అడుగుల ఎత్తైన ధరహరా టవర్ నుంచి కిందపడి. వివరాల్లోకి వెళితే.. రమిలా శ్రేష్ట అనే 17ఏళ్ల యువతి తన తల్లిదండ్రులకు సినిమాకెళ్తున్నానని చెప్పి గత శనివారం ఇంటి నుంచి బయటికి వచ్చింది.
ఆ తర్వాత ఆమె తన ప్రియుడు సంజీబ్(17)ను కలిసింది. వారిద్దరూ ఖాట్మాండ్‌లోని చారిత్మక కట్టడం ధరహరా టవర్ వద్దకు వెళ్లారు. ఈ ఇద్దరూ తాము ప్రేమించుకుంటున్న విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియకుండా చూసుకుంటున్నారు.

18శతాబ్దంలో నేపాల్ రాణి నిర్మించిన ఈ భారీ టవర్ పైకి వెళ్లి ఖాట్మాండ్ నగరాన్ని వీక్షించాలని అనుకున్నారు. వెంటనే టవర్ 8వ అంతస్తు వరకు వెళ్లి అక్కడ్నుంచి నగరాన్ని వీక్షించారు రమీల, సంజీబ్. బాల్కనీ నుంచి నగరాన్ని వీక్షిస్తున్న సమయంలోనే టవర్ కొంచెం కొంచెం కదలడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత భారీ భూకంపం కారణంగా టవర్ కుప్పకూలిపోయింది. టవర్ పైనుంచి పడిన ఈ యువ ప్రేమజంట గాయాలపాలై స్పృహ కోల్పోయింది. అనంతరం సహాయక బృందాలు వీరిద్దరిని నగరంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారికి తలకు, వీపుకి స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం ఏమి లేదని చెప్పారు. కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని తెలిపారు.
కాగా, రమీల, సంజీబ్‌లు ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఇద్దరికి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారనే చెప్పడంతో వారిద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. రమీల తన అదృష్టమని చెప్పాడు సంజీబ్. కాగా, మీ ప్రేమ వ్యవహారం మాకు తెలిసిపోయిందని వైద్యుడు సంతోష్ పాండే చెప్పడంతో.. సంజీబ్ మాత్రం ఎవరికీ చెప్పకూడదని ఆయనని కోరాడు.
‘మేమిద్దరం భారీ ప్రమాదం నుంచి బయటపడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లోనూ మేమిద్దరం కలిసి ఉంటాం' అని సంజీబ్ తెలిపాడు. దీంతో రమీల తన తలకు పట్టి ఉన్నప్పటికీ నవ్వేసింది. ఇది ఇలా ఉండగా ఆ యువ జంట ప్రేమ వ్యవహారం వైద్యుడి ద్వారా ఇరు కుటుంబాల్లోనూ తెలిసిపోయింది. అయితే పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆ ప్రేమ జంటను ఎవరూ ఏమి అనలేదు. కాగా, ఈ ప్రమాదం ఆ యువజంట ప్రేమను రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications