Sheikh Hasina: మళ్లీ బంగ్లాదేశ్ కు షేక్ హసీనా ? ముహుర్తం ఖరారు..!
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో చెలరేగిన భారీ హింస కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటన్ ఆశ్రయం కోసం ప్రయత్నించి విఫలమైన హసీనా ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆమె సోదరి షేక్ రెహనాతో కలిసి ఢిల్లీలోనే ఉంటున్న హసీనా తిరిగి బంగ్లాదేశ్ ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారో ఆమె కుమారుడు సజీబ్ వెల్లడించారు.
షేక్ హసీనా రాజీనామా తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. దీనికి పలువురు సలహాదారుల్ని కూడా నియమించారు. హసీనా వెళ్లిపోయాక ఎవరు అధికారం చేపట్టాలనే అంశంపై జరిగిన చర్చల్లో ఆర్మీ పాలనకు ఎవరూ అంగీకరించలేదు. దీంతో తటస్దుడిగా పేరున్న నోబెల్ గ్రహీత యూనుస్ కు ఆపద్ధర్మ ప్రభుత్వ సారధిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ప్రస్తుతానికి తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. అయితే త్వరలోనే ఆయన దేశంలో ఎన్నికల నిర్వహణకు ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు.

బంగ్లాదేశ్ లో ఎన్నికల నిర్వహణకు ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రకటన చేయగానే తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు షేక్ హసీనా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు తన తల్లి తిరిగి బంగ్లా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హసీనా కుమారుడు సజీబ్ వాజెజ్ జాయ్ వెల్లడించారు. అయితే ఇప్పటికే ఏర్పడిన ఆపద్ధర్మ ప్రభుత్వంలో హసీనా పార్టీ అవామీ లీగ్ మధ్యంతర ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేకపోయింది. అయినా సాధారణ ఎన్నికలు జరిగితే మాత్రం పోటీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ ఇంత ప్రజాగ్రహం మధ్య ఎన్నికలు జరిగినా హసీనా పార్టీ గెలుపు మాత్రం సాధ్యం కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications