వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై విచారణ, జడ్జిని నియమించిన ఫ్రాన్స్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోదీ రఫేల్

ఫ్రాన్స్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాస్పద రఫేల్ డీల్‌పై స్వతంత్ర్య విచారణ జరపాలనే డిమాండ్ మరోసారి తెరపైకి రావొచ్చు.

ఫ్రెంచ్ సంస్థ డసో ఏవియేషన్ భారతదేశంతో చేసుకున్న రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపేందుకు ఫ్రాన్స్ కొత్తగా ఓ జడ్జిని నియమించిందని ఫ్రాన్స్ నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం (పీఎన్ఎఫ్) శుక్రవారం తెలిపింది.

కోట్ల విలువ చేసే యుద్ధ విమానాలను భారతదేశం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిందన్న విషయం తెలిసిందే.

అయితే, 2016లో జరిగిన ఈ డీల్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

'ఫ్రాన్స్ 24' న్యూస్ వెబ్‌సైట్ ప్రకారం, ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ నుంచి భారత ప్రభుత్వం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 9.3 బిలియన్ డాలర్లు అంటే సుమారు 70 వేల కోట్ల రూపాయలు.

రఫేల్

మీడియాపార్ట్ దర్యాప్తు ఫలితాలు

రఫేల్ డీల్‌లో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, దీనిపై దర్యాప్తు చేసేందుకు పీఎన్ఎఫ్ తొలుత నిరాకరించింది.

అయితే, ఫ్రెంచ్ పరిశోధనాత్మక వెబ్‌సైట్ 'మీడియాపార్ట్' దీనిపై దర్యాప్తు చేసి, ఈ డీల్‌లో ఉన్న లోటుపాట్లను పీఎన్ఎఫ్ దాచిపెట్టిందని ఆరోపించింది.

రఫేల్ ఫైటర్ జెట్ ఒప్పందాన్ని ఖాయం చేసేందుకు మధ్యవర్తులకు రహస్యంగా కొన్ని కోట్ల రూపాయలు ముట్టాయని, అందులో కొంత సొమ్ము భారత ప్రభుత్వ అధికారులకు కూడా లంచం కింద ముట్టిందని మీడియాపార్ట్ ఈ ఏప్రిల్‌లో పేర్కొంది.

అయితే, తమ సంస్థ నిర్వహించిన ఆడిట్‌లో అలాంటిదేమీ బయటపడలేదని డసో ఏవియేషన్ తెలిపింది.

ప్రస్తుతం పీఎన్ఎఫ్ ద్వారా రఫేల్ డీల్‌పై దర్యాప్తు జరిపించాలనే చర్చలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా మీడియాపార్ట్ స్పందిస్తూ, "ఈ డీల్‌లో అవినీతి, పక్షపాతం చోటు చేసుకున్నాయని మేం ముందే చెప్పాం. భారత ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు, స్థానిక భాగస్వామి అయిన అనిల్ అంబానీకి డసో ఏవియేషన్ భారీ ఆర్థిక సహాయం అందించిందని మా రిపోర్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పేందుకు ప్రయత్నించాం" అని తెలిపింది.

నరేంద్ర మోదీ

పీఎన్ఎఫ్‌పై ఒత్తిడి

రఫేల్ డీల్ ఫైళ్లను పారిస్ ఆర్థిక కేంద్రానికి చెందిన అత్యంత "సున్నితమైన చట్టపరమైన ఫైళ్లు (సెన్సిటివ్ లీగల్ ఫైల్స్)"గా మీడియాపార్ట్ పేర్కొంది.

ఇంత సున్నితమైన ఈ రఫేల్ ఒప్పందంపై దర్యాప్తును పీఎన్‌ఎఫ్ జూన్ 14న అధికారికంగా ప్రారంభించినట్లు మీడియాపార్ట్ జర్నలిస్ట్ యాన్ ఫిలిపీన్ తెలిపారు.

2021 ఏప్రిల్‌లో మీడియాపార్ట్ ప్రచురించిన వరుస రిపోర్టుల కారణంగా పీఎన్ఎఫ్‌పై ఒత్తిడి పెరగడంతో ఈ దర్యాప్తు ప్రారంభించినట్లు పలువురు భావిస్తున్నారు.

మీడియాపార్ట్ రిపోర్టులు చూసిన తరువాత, ఆర్థిక నేరాలపై పని చేసే ఫ్రెంచ్ ప్రభుత్వేతర సంస్థ 'షెర్పా' రఫేల్ డీల్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఒప్పందంలో అవినీతి, పలుకుబడి దుర్వినియోగం జరిగిందని పేర్కొంది.

దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఫ్రాన్స్ ఒక మేజిస్ట్రేట్‌ను నియమించింది.

రఫేల్ డీల్‌పై దర్యాప్తు జరపాలని 2018లో కూడా షెర్పా డిమాండ్ చేసింది. కానీ పీఎన్ఎఫ్ పట్టించుకోలేదు.

అనిల్ అంబానీ

డీల్‌తో ముడిపడి ఉన్న సవాళ్లు

డసో ఏవియేషన్ తమ ఇండియా పార్ట్‌నర్‌గా రిలయన్స్ గ్రూపును ఎంచుకుంది. దీని అధిపతి అనిల్ అంబానీ భారత ప్రధానికి అత్యంత సన్నిహితుడని షెర్పా తన మొదటి ఫిర్యాదులో పేర్కొంది.

భారతదేశానికి 126 ఫైటర్ జెట్లను సప్లయి చేసేందుకు దాసో ఏవియేషన్ 2012లో ఒక ఒప్పందన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం దాసో ఏవియేషన్‌కు ఇండియా పార్ట్‌నర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్). 2015నాటికి ఈ ఒప్పందం దాదాపు ఖాయమైంది.

అయితే, అదే సంవత్సరం ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన తరువాత మొత్తం చిత్రం మారిపోయింది.

రఫేల్

126 ఫైటర్ జెట్ల ఒప్పందం రద్దయిపోయింది. దాని స్థానంలో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే కొత్త ఒప్పందం కుదురింది. దీన్లో ఇండియా పార్ట్‌నర్ మారిపోయారు. హెచ్ఏఎల్‌కు బదులు రిలయన్స్ గ్రూప్ రంగంలోకి వచ్చింది. అయితే, ఈ సంస్థకు విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేదు.

2016 జనవరిలో, ఇరు పక్షాల మధ్య రఫేల్ ఒప్పందం కోసం చర్చలు ఇంకా జరుగుతుండగానే, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకో హోలాందే ఫిల్మ్-పార్ట్‌నర్ జూలీ గాయెట్ నిర్మిస్తున్న ఒక చిత్రానికి రిలయన్స్ పెట్టుబడి పెట్టింది.

దీన్ని "పలుకుబడిని దుర్వినియోగం చేయడంగా" చూడాలని షెర్పా ఆరోపించింది.

అయితే, అలాంటిదేమీ లేదని, దాసో భారత భాగస్వామి ఎవరనే విషయంలో ఫ్రెంచ్ ప్రభుత్వ జోక్యమేమీ లేదని ఫ్రాంకో హోలాందే వివరణ ఇచ్చారు.

కాపీ - ప్రశాంత్ చాహల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
France appoints judge to probe Rafale fighter jet dea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X