ఉచిత బస్సుకు న్యూయార్క్ కూడా ఫిదా..!మమ్దానీ హామీకి మన పథకానికి తేడా ఏంటి ?
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ-ఉగాండా మూలాలున్న డెమోక్రాట్ అభ్యర్ధి జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చివరి నిమిషం వరకూ బెదిరింపులతో అడ్డుపడినా మమ్దానీ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. సోషలిస్ట్ భావజాలం ఉన్న మమ్దానీని న్యూయార్క్ ఓటర్లు నెత్తిన పెట్టుకున్నారు. దీనికి ఆయన భావజాలం ఒక్కటే కాదు ఎన్నికల్లో విజయం కోసం భారతీయ ఎన్నికల్లో అభ్యర్ధుల తరహాలో ఆయన ఇచ్చిన ఉచిత హామీలు కూడా ఉన్నాయి. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ఒకటి.
అయితే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జొహ్రాన్ మమ్దానీ ఇచ్చిన ఉచిత బస్సు పథకం హామీ చూస్తే భారత్ లో ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు పథకం లాంటిదే అనిపించకమానదు. అలాగే ఎంతో అభివృద్ధి చెందిన నగరమైన న్యూయార్క్ ప్రజలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల తరహాలో ఉచిత బస్సు కోరుకుంటున్నారా అని అనిపించకమానదు. కానీ ఇక్కడ మన ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికీ, న్యూయార్క్ లో మమ్దానీ అమలు చేస్తానని చెప్పిన హామీకీ మధ్య చాలా తేడా ఉంది.

మమ్దానీ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా విజయవంతమైన ఉచిత బస్సు పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించడంలో గతంలో సాయ పడ్డారు. న్యూయార్క్ లో శ్రామిక-తరగతి వాసుల జీవన వ్యయాన్ని తగ్గించడానికి, ప్రయాణాలను మెరుగుపరచడానికి , అవసరమైన సేవలకు వాటిని విస్తరించడానికి బస్సు ఛార్జీలను శాశ్వతంగా తొలగించడం ఈ ప్రతిపాదన లక్ష్యం. ఉచిత బస్సు పథకంలో భాగంగా ఏ బస్సులోనూ ఎవరికీ ఛార్జీలు విధించరు. మొత్తం ఉచిత ప్రయాణమే. ఏడాదికి మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులతో పాటు కార్పోరేషన్లపై పన్నులు విధించడం ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చుకుంటానని మమ్దానీ హామీ ఇచ్చారు. ఇది ఆచరణయోగ్యంగా కనిపించడంతో ప్రజలు నమ్మారు.

మన దేశంలో ప్రస్తుతం ఏపీ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీలో ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది. కానీ ఇందులో కేవలం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమల్లో ఉంది. న్యూయార్క్ లో మాత్రం అందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది. అలాగే భారత్ లోని వివిధ రాష్ట్రాలు నిధుల లభ్యతను పట్టించుకోకుండా ఈ పథకం అమలును ప్రారంభించి ఆ తర్వాత ఇబ్బందులు పడతున్నాయి. కానీ న్యూయార్క్ లో మమ్దానీ ఈ పథకంతో పాటు తాను ప్రకటించిన ఇతర పథకాలకు నిధులు ఎలా అందుబాటులో ఉంచుతారో ముందే చెప్పేశారు.












Click it and Unblock the Notifications