వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీ 7: చైనాకు చెక్‌పెట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు జీ 7 దేశాల ప్రణాళికలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చైనాకు చెక్‌పెట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తెరపైకి తీసుకొచ్చేందుకు జీ 7 దేశాల నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తున్నారు.

బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ (బీ3డబ్ల్యూ) పేరుతో తాము ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. చైనా కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే.

చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా చాలా దేశాల్లో రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు నిర్మిస్తున్నారు.

అయితే, ఈ చైనా ప్రాజెక్టుల వల్ల చాలా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం బ్రిటన్‌లోని కార్న్‌వాల్‌లో జీ 7 దేశాల సదస్సు జరుగుతోంది. విలువలతో కూడిన, మేలిమి ప్రమాణాలతో, పారదర్శకమైన భాగస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు తాము అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు దీనిలో జీ 7 దేశాల నాయకులు చెప్పారు.

అయితే, జీ 7 దేశాలు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తున్నాయో ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ఈ దశలో ఆ వివరాలు వెల్లడించలేమని జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ వివరించారు.

చైనా ప్రాజెక్టులను మొదట్నుంచీ అమెరికా విమర్శిస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టులతో చాలా దేశాలపై రుణ భారం విపరీతంగా పెరిగిపోతోందని చెబుతోంది.

మరోవైపు భవిష్యత్‌లో వ్యాపించే మహమ్మారుల కట్టడికి కూడా కొత్త ప్రణాళికలను జీ 7 దేశాలు సిద్ధం చేస్తున్నాయి.

ముఖ్యంగా వ్యాక్సీన్ల అభివృద్ధి, లైసెన్సుల జారీ, చికిత్సలకు అనుమతుల సమయాన్ని వంద రోజుల కంటే తక్కువకు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రణాళికలను ఆదివారం అధికారికంగా విడుదల చేస్తారు.

కార్బిస్ బే రిసార్ట్‌లో జరుగుతున్న ఈ మూడు రోజుల సదస్సుకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆతిథ్యం ఇస్తున్నారు.

షిన్‌జియాంగ్‌లో కార్మికులు

చైనాను అడ్డుకునేందుకు...

''ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి చెక్‌పెట్టేందుకు జీ 7 దేశాల శనివారం నాటి సదస్సు ఓ అవకాశంగా అమెరికా భావిస్తోంది. కోట్ల డాలర్లతో చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులకు దీటుగా తమ ప్రాజెక్టులను తీసుకురావాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి’’అని బీబీసీ ఉత్తర అమెరికా ఎడిటర్ జాన్ సోపెల్ విశ్లేషించారు.

''పశ్చిమ దేశాల విలువలు విజయం సాధించగలవని వారు నిరూపించాలని భావిస్తున్నారు. చైనా పెట్టుబడులతో రుణ భారం అనే ట్యాగ్ ఉంటుందని వారు చెప్పాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని వీగర్లతో వెట్టిచాకిరీని ఎలాంటి పరిస్థితుల్లో సహించబోమని, నిష్పాక్షికతకు ఇది పూర్తి విరుద్ధమని వారు దీని ద్వారా చెబుతున్నారు’’.

''ఇలాంటి వెట్టిచాకిరీకి విముక్తి లభించాలని బైడెన్ నొక్కిచెబుతున్నారు. ఇది చైనాను ఢీకొట్టడంకాదని అమెరికా అధికారులు అంటున్నారు. వీటిని కొత్త ప్రత్యామ్నాయాలుగా చూడాలని చెబుతున్నారు’’.

''ఈ భారీ ప్రాజెక్టులకు పశ్చిమ దేశాలు ఎంతవరకు, ఎంతకాలం సహకరిస్తాయనే విషయంలో స్పష్టతలేదు. అయితే, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు పశ్చిమ దేశాలు నిబద్ధతతో ఉన్నాయని దీని ద్వారా స్పష్టం అవుతోంది’’.

బోరిస్ జాన్సన్, జో బైడెన్

ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాయి?

ఈ ఏడాది మొదట్లో అమెరికా, ఐరోపా సమాఖ్య, బ్రిటన్, కెనడాలు... చైనాపై సంయుక్తంగా కొత్త ఆంక్షలను విధించాయి.

షిన్‌జియాంగ్‌లో వీగర్ ముస్లింలపై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలతో సంబంధమున్న అధికారులపై ఆంక్షలు విధించడం, వారి ఆస్తులను స్తంభింపజేయడం లాంటి ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి.

చైనాలోని వాయువ్య షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో పది లక్షల మందికిపైగా వీగర్లను నిర్బంధ శిబిరాల్లో ఉంచినట్లు అంచనాలు ఉన్నాయి.

వీగర్ మహిళలు పిల్లల్ని కనకుండా ఆపరేషన్లు చేయిస్తున్నారని, పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తున్నారని చైనా ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి.

బందీలకు చిత్రహింసలు పెట్టడం, లైంగిక దాడులు చేయడం లాంటివి కూడా జరుగుతున్నాయని గత ఫిబ్రవరిలో బీబీసీ ఓ కథనం కూడా ప్రచురించింది.

మరోవైపు తమపై విధించిన ఆంక్షలకు స్పందిస్తూ.. ఐరోపా దేశాల అధికారులపై చైనా కూడా ఆంక్షలు విధించింది.

జీ7 దేశాల నాయకులు

కరోనా కట్టడికి ప్రణాళికలు ఏమిటి?

జీ 7 దేశాలు కార్బిస్ డే ప్రకటనను విడుదల చేయబోతున్నాయి. ముఖ్యంగా కరోనావైరస్‌తో సంభవించే ఆర్థిక, మానవతా సంక్షోభాలను అడ్డుకోవడమే లక్ష్యంగా దీన్ని సిద్ధంచేశారు.

ప్రపంచ వ్యాప్తంగా 17.5 కోట్ల మందికి ఇప్పటివరకు కరోనావైరస్ సోకింది. దీని వల్ల 37 లక్షల మంది మరణించారు.

ఈ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు జీ 7 దేశాలు కొన్ని చర్యలు తీసుకోబోతున్నాయి.

  • వ్యాక్సీన్ల అభివృద్ధి, లైసెన్సుల జారీ, చికిత్సలకు అనుమతుల జారీ సమయాన్ని వంద రోజులకు తగ్గించాలి.
  • వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాల నిఘాను పెంచాలి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాలకు మద్దతు ప్రకటించాలి.

జీ 7 దేశాలు విడుదల చేయబోయే ప్రకటనలో అంతర్జాతీయ నిపుణులు సమర్పించిన నివేదికలోని అంశాలు కూడా చేరుస్తారని భావిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయేసస్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

''ప్రపంచ దేశాలపై విరుచుకుపడే కొత్త మహమ్మారులను జాగ్రత్తగా కనిపెట్టేందుకు, ముప్పులను అంచనా వేసేందుకు గట్టి నిఘా వ్యవస్థలు అవసరం’’అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.

జీ7 దేశాల నాయకులు

బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలపై చర్యలు

వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా బోగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జీ 7 దేశాల నాయకులు భావిస్తున్నారు.

కర్బన ఉద్గారాలకు కళ్లెంవేసే టెక్నాలజీ లేని థెర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

అత్యధిక ఉద్గారాలను విడుదల చేయడంలో బొగ్గుదే ప్రధాన పాత్ర. దీని వాడకాన్ని తగ్గించే దిశగా జీ 7 దేశాలు తీసుకుంటున్న చర్యలను పర్యావరణవేత్తలు ప్రశంసిస్తున్నారు.

అయితే, ఈ విషయంలో పేద దేశాలకు సాయం చేయాలని ధనిక దేశాలకు వారు సూచిస్తున్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌తో బైడెన్

ఆ రోజులు ఎప్పుడో పోయాయ్: చైనా

కేవలం కొన్ని దేశాలు ప్రపంచ గతిని మార్చే రోజులు ఎప్పుడో పోయాయని, జీ 7 కూటమిని ఉద్దేశించి చైనా వ్యాఖ్యలు చేసింది.

చైనాకు చెక్‌పెట్టేందుకు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జీ 7 దేశాలు తెరపైకి తీసుకురావడంపై లండన్‌లోని చైనా రాయబారి స్పందించారు.

''ఒకప్పుడు ప్రపంచ దేశాలను కొన్ని దేశాలే శాసించేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి’’.

''దేశం చిన్నదైనా పెద్దదైనా, బలమైనదైనా బలహీనమైనదైనా, ధనిక దేశమైనా పేద దేశమైనా.. అందరూ సమానమేనని మేం భావిస్తాం. ప్రపంచ దేశాలకు సంబంధించిన నిర్ణయాలు అందరూ కలిసికట్టుగా తీసుకోవాలి. అంతేకానీ కొన్ని దేశాలే నిర్ణయించకూడదు’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
G7: plans for infrastructure projects to be stopped in China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X