వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ: అంధుల నగరం మార్బర్గ్... ఇక్కడ చూపులేని వారు కూడా అన్నీ చూడగలరు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

జర్మనీలో మార్బర్గ్ నగరం అంధుల నగరమని అంటారు. చూపులేనివారు నివసించేందుకు అనువుగా ఈ నగరాన్ని నిర్మించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనకు పునాది వేసింది ఒక స్కూలు.

marburg

పుట్టుకతో వచ్చిన అనారోగ్యం కారణంగా లియోన్ పోర్ట్జ్ ఎనిమిదేళ్ల వయసులో క్రమంగా తన కంటి చూపును కోల్పోయారు. అప్పుడే తొలిసారి లియోన్‌కు కంప్యూటర్ పరిచయం అయింది.

తొమ్మిదేళ్ల వయస్సులో లియోన్ వెబ్‌సైట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ టెక్స్ట్‌లను చదివే మెషీన్-జనరేటెడ్ వాయిస్‌ను ఎలా వేగవంతం చేయాలో కనుగొన్నారు. దాంతో, లియోన్‌కు వేగంగా సమాచారాన్ని గ్రహించే వీలు కలిగింది.

ఇప్పుడు లియోన్ ప్రామాణిక వేగం కన్నా అయిదు రెట్లు వేగంతో టెక్స్ట్‌లను వినగలరు.

సెంట్రల్ జర్మనీకి చెందిన లియోన్ సమీపంలో ఉన్న మార్బర్గ్ నగరంలో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూల్‌లో చేరారు. అక్కడే తనకు సైన్స్ పట్ల మక్కువ మరింత పెరిగింది.

ఆ స్కూలే మార్బర్గ్‌లో వినూత్నమైన ఆవిష్కరణలకు ప్రేరణ.

అంధుల నగరం మార్బర్గ్

"బ్లైండెన్‌స్టాట్" (అంధుల నగరం)గా పేరు పొందిన ఈ నగరానికి చాలా చరిత్రే ఉంది.

మొదటి ప్రపంచ యుద్ధంలో కంటిచూపు కోల్పోయిన యువకులకు అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ తొలిసారిగా 'బైల్డెన్‌ స్టూడియెన్ అన్‌స్టాల్ట్' (బ్లిస్టా) విద్యా సంస్థ ప్రారంభమైంది.

అప్పటి నుంచి ఈ సంస్థ, అంధుల కోసం కొత్త కొత్త ఆవిష్కరణలకు నెలవైంది. ఇక్కడే టాక్టైల్ మేథమటికల్ (స్పర్శ గణితం) ఫాంట్ రూపుదిద్దుకుంది.

అంతేకాకుండా, ఈ సంస్థ చుట్టూ అంధులకు అనువుగా ఒక నగరం తయారైంది. దీన్ని "అంధులకు శ్రేష్టమైన నగరం"గా లియోన్ అభివర్ణిస్తారు.

అయితే, మార్బర్గ్‌లో కనిపించేవన్నీ ఇక్కడే తయారైనవి కావు. కానీ, వాటన్నిటినీ తీసుకొచ్చి, ఇక్కడ అమర్చి చూపులేనివారికి అనువుగా మార్చిన విధానానికి మాత్రం టోపీలు తీయకుండా ఉండలేమని లియోన్‌తో సహా ఈ నగరంలో నివసించిన అంధులు అంటారు.

మార్బర్గ్ నగరంలో ఎక్కడికి వెళ్లినా సంకేత శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి.. బీప్ బీప్‌మంటూ ట్రాఫిక్ లైట్లు, కాలిబాటల నుంచి వచ్చే ధ్వనులు, నేలపై నడుస్తున్నప్పుడు ప్రమాదాలను సూచించే గుర్తులు.

అన్ని భవనాల్లో స్పర్శ ద్వారా గ్రహించగలిగే మ్యాపులు, అంతస్తుల వివరాలు తెలిపే పత్రాలు ఉంటాయి.

అలాగే, ముఖ్యమైన సందర్శన స్థలాల కాంస్య నమూనాలను నగరంలో పలుచోట్ల ఏర్పాటుచేశారు. పాక్షికంగా చూపు కోల్పోయినవారు ఈ నమూనాలు చూసి, వారు సందర్శిస్తున్న ప్రదేశం ఎలా ఉంటుందో అంచనా వేయగలరు.

ఈ నగరానికి సహజసిద్ధంగా ఉన్న ఆకారం వలన కూడా కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. ఇదంతా కొండ ప్రాంతం కావడంతో సహజంగా దారిలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నడుస్తున్నప్పుడు పైకి వెళుతున్నామో, కిందకు వస్తున్నామో సులువుగా తెలుసుకోవచ్చు.

ఇవే కాకుండా, ఇక్కడ అంధుల కోసం అనేక సౌకర్యాలు, విశ్రాంతి మందిరాలు కూడా ఏర్పాటుచేశారు. అంధులకు హార్స్-రైడింగ్ స్కూలు, బ్లైండ్ రోయింగ్, ఫుట్‌బాల్, క్లైంబింగ్ అండ్ స్కీయింగ్ క్లబ్‌లు ఉన్నాయి.

జర్మనీలో ఉన్న అంధ విద్యార్థుల్లో అధికభాగం మార్బర్గ్ యూనివర్సిటీలోనే చదువుతున్నారు. ఇక్కడ వీరికి అందిస్తున్న కోర్సులు కూడా విస్తృతంగా ఉంటాయి.

బ్లిస్టా సంస్థ కృషి

బ్లిస్టా సంస్థ, అందులో చదువుతున్న విద్యార్థుల ఆలోచనలు ఇక్కడి అనేక ఆవిష్కరణలకు మూలం. రోజువారీ అవసరాలకు తగిన సామాగ్రిని అభివృద్ధి చేయడం.. ఉదాహరణకు మడిచేందుకు వీలుగా ఉండే చేతికర్ర, యూనివర్సిటీతో కలిసి పనిచేస్తూ వివిధ విభాగాలను ప్రవేశయోగ్యంగా మలిచేందుకు కృషిచేస్తున్నారు.

న్యాయశాస్త్రం, సైకాలజీ ఇక్కడ చాలా పాపులర్ కోర్సులు. ఎందుకంటే వీటిల్లో లెక్కలు, ఇతరత్రా సూచికలు, సంకేతాల కన్నా టెక్స్ట్ ఎక్కువగా ఉంటుంది. స్క్రీన్ రీడర్స్ ఉపయోగించి వీటిని చదవడం సులువు.

ఈ సంస్థ ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ప్రస్తుతం నేచురల్ సైన్సెస్ కోర్సును అంధ విద్యార్థులకు అనువుగా తీర్చిదిద్దే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంతోకాలంగా ఈ సబ్జెక్ట్ అంధ విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. చూపులేనివారికి ఈ కోర్సు చదువుకోవడం చాలా ప్రయాసతో కూడిన పని. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఉంటాయి.

"నేను ఒక మార్గదర్శకుడినని అనుకోవట్లేదు. కానీ, నేను మార్గదర్శినేనేమో" అంటారు లియోన్. ప్రస్తుతం లియోన్ డ్యూసెల్‌డార్ఫ్‌లో బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.

తను అక్కడ బయోకెమిస్ట్రీ చదువుతున్న తొలి అంధ విద్యార్థి. జర్మనీ మొత్తంగా చేతి వేళ్లతో లెక్కపెట్టగలిగినంతమంది అంధులు మాత్రమే బయోకెమిస్ట్రీ చదువుతూ ఉంటారని లియోన్ అంచనా.

కెమిస్ట్రీ చదవాలంటే ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేయాలి. అంధ విద్యార్థులకు ఇది అంత సులభం కాదు. చార్టులు, గ్రాఫులు అనేకం. ఇవి కూడా చూపులేనివారికి కష్టమే.

అయితే, లియోన్‌కు మార్బర్గ్‌లో కెమిస్ట్రీ నేర్పిన ఉపాధ్యాయుడు టోబియాస్ మహంకే మాత్రం, తన సబ్జెక్టు కొందరికే ఎందుకు పరిమితం కావాలంటూ ప్రశ్నిస్తారు.

"మానవమాత్రులు ఎవరూ అణువులను, పరమాణువులనూ కంటితో చూడలేరు. మరి అప్పుడు చూపు ఉన్నవారు మాత్రమే బాగా చదవగల సబ్జెక్ట్‌గా కెమిస్ట్రీ ఎందుకు ఉంది? అంధులు దీనికి దూరం అయేలా ఎలాంటి ప్రతికూలతా ఉండకూడదు" అంటూ ఆయన వాదిస్తారు.

2013 నుంచి మహంకే ఈ స్కూల్‌లో పనిచేస్తున్నారు. అప్పట్లో అక్కడ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ కోర్సు లేదు. దాంతో మహంకే, ఆయన సహచరులు కలిసి నేచురల్ సైన్సెస్ బోధించడానికి సహాయపడే మల్టీ-సెన్సరీ సాధనాలను, పద్ధతులను కనుగొన్నారు.

వీరికి మార్బర్గ్‌లోని ఫిలిప్స్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మద్దతుతో పాటు స్వచ్ఛంద సంస్థ అయిన రీన్‌హార్డ్-ఫ్రాంక్-ఫౌండేషన్ నుంచి నిధులు సమకూరాయి.

అన్ని వర్గాలవారికీ కెమిస్ట్రీ బోధించేందుకు అనువైన మార్గాలు, సాధనాలను అభివృద్ధి చేయడంపై మహంకే థీసిస్ రాశారు. ఆయన రాసిన పరిశోధనలు కొన్ని జర్నల్స్‌లో పబ్లిష్ అయ్యాయి.

బ్లిస్టా కనిపెట్టిన మోడల్స్ కెమిస్ట్రీలో వివిధ రసాయన సంబంధాలను సులువుగా వివరించేందుకు సహాయపడతాయి.

ఉదాహరణకు, నీటి అణువుల త్రీ డైమెన్షనల్ నమూనాను కుదించి టూ డైమెన్షనల్‌లో అదెలా ఉంటుందో చూపేందుకు అనువుగా వివిధ యూనివర్సిటీలలోని కెమిస్ట్రీ ఉపాధ్యాయులు కలిసి ఒక మోడల్ తయారుచేశారు.

అలాగే ఒక కుళాయి కింద నది నమూనాను పెట్టి విద్యార్థులు నది కదలికలకు స్పర్శ ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. నది ఎక్కడ లోతుగా ఉంటుందో, ఎక్కడ సూర్యరశ్మి ఎక్కువగా ఉండి నీళ్లు వేడెక్కుతాయో, చేపలు ఇతర జలచరాలు ఎక్కడ, ఎందుకు ఎక్కువ ఉంటాయో స్పర్శ ద్వారా అంధ విద్యార్థులు తెలుసుకోగలరు.

ఇలాంటి అనేక నమూనాలను బ్లిస్టా అభివృద్ధి పరిచింది.

"అనేక సైన్స్ ప్రయోగాలను కంటితో చూడక్కర్లేదు. స్పర్శ ద్వారా తెలుసుకోగలిగేవి చాలా ఉంటాయి. వేడి, చల్లదనం, వాసన, వినికిడి ద్వారా తెలుసుకోగలిగేవి ఎన్నో ఉంటాయి. మామూలు విద్యా బోధనలో మనం ఎక్కువగా కంటిచూపుపై ఆధారపడతాం ఎందుకంటే ఏ ప్రయోగం అయినా అయిదు నిముషాలలో చేసి చూపించేయొచ్చు. దాన్నీ 30 మంది విద్యార్థులు చూసి నేర్చుకుంటారు. ఇలా చూపించడం టీచర్లకు సులువు, కానీ విద్యార్థులకు కాదు" అని మహంకే అన్నారు.

2017, 2019లలో ఇక్కడ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ కోర్సు ప్రవేశపెట్టారు. అంధులకు అనువుగా ప్రయోగశాలను తయారుచేశారు.

మహమ్మారి సమయంలో కరోనా వ్యాప్తిని స్పర్శతో తెలుసుకోగలిగే చార్టుల ద్వారా వివరించారు. కరోనా కారణంగా స్కూలు మూసివేసినప్పుడు, విద్యార్థులు ఇంట్లోనే చదువుకునేందుకు వీలుగా నమూనాలను రూపొందించారు.

ఇటీవల కార్ల్-స్ట్రెల్-స్కూల్‌లో అంధ విద్యార్థులతో పాటూ చదువుకునేందుకు కంటిచూపు ఉన్న విద్యార్థులను కూడా చేర్చుకుంటున్నారు. ఎందుకంటే చూపు ద్వారా మాత్రమే కాకుండా స్పర్శ, వినికిడి మొదలైన మల్టీ-సెన్సరీ విధానాల ద్వారా పాఠాలు నేర్చుకోవడం మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

"మల్టీ-సెన్సరీ విధానంలో నేర్చుకోవడం వలన గ్రాహకశక్తి పెరుగుతుంది. చదువుకున్నది ఎక్కువకాలం జ్ఞాపకం ఉంటుంది" అని మహంకే తెలిపారు.

'మార్బర్గ్ నగర వాతావరణమే వేరుగా ఉంటుంది'

తన ప్రపంచాన్ని విశాలం చేసింది ఈ స్కూలు మాత్రమే కాదని, మార్బర్గ్ నగరమే తనకు కొత్త ఊపిరిలూదిందని లియోన్ అంటారు. ఇక్కడి ట్రాఫిక్ లైట్లు, బస్ స్టాప్‌లు, అంధులకు సహాయం చేసే ప్రజలు.. ఇవన్నీ తన జీవితాన్ని మార్చివేశాయని ఆయన అంటారు.

మార్బర్గ్‌లో బస్ డ్రైవర్లకు అంధులకు సౌకర్యవంతంగా ఉండేలా బస్ నడపడం, నిలుపుచేయడం మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు. దుకాణాల్లో అంధులైనవారితో మాట్లాడడం దుకాణదారులకు అలవాటే. రెస్ట్రారెంట్లలో బెయిలీ స్క్రిప్ట్‌లో మెను కార్డులు పెడతారు.

వీటిల్లో కొన్ని ఇతర నగరాల్లో కూడా ఉంటాయిగానీ ఇక్కడ ఉన్నంత సౌకర్యవంతంగా ఉండవని, ఇక్కడ సర్వం అనుకూలంగా ఉంటాయని లియోన్ చెప్పారు.

"మార్బర్గ్‌లో ప్రతీ అంశం ఎంతో బాగా అనుసంధానించబడి ఉంటుంది. అయితే, కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. మార్బర్గ్‌లోని వాతావరణమే గొప్పగా ఉంటుంది. ఇక్కడ బ్లిస్టా ఉంది. ఎందరో ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే అంధులు ఎక్కువమందే ఉన్నారని లెక్క. ప్రతీ సంస్థా ఎప్పుడో ఒకప్పుడు వీరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని లియోన్ అన్నారు.

యువే బాయ్‌సెన్ ఒక రిటైర్డ్ న్యాయమూర్తి, అంధులు. మార్బర్గ్‌లో స్థాపించిన డీవీబీఎస్ అనే అంధ, దృష్టి లోపం ఉన్న విద్యార్థుల, నిపుణుల సంఘానికి మాజీ అధ్యక్షులు.

ఆయన కార్ల్-స్ట్రెల్-స్కూల్లో చదువుకున్నారు. తరువాత 1960ల చివర్లో మార్బర్గ్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.

మార్బర్గ్‌లో అభివృద్ధి చెందిన కమ్యూనిటీ సహాయం, స్వీయ సహాయం అనే భావనలు ఆవిష్కరణలను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని యునే బాయ్‌సెన్ అభిప్రాయపడ్డారు.

"అది నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త విషయాలను ప్రయత్నించడానికి కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని చేకుర్చుతుంది" అని ఆయన అన్నారు.

అంధ విద్యార్థులు సొంతంగా చదువుకోవడానికి రూపొందించిన స్క్రిప్ట్, బాయ్‌సెన్ విద్యామార్గాన్ని తీర్చిదిద్దింది.

తాను చదువుకునేటప్పుడు అంధులకు ప్రొఫెషనల్ అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని బాయ్‌సెన్ తెలిపారు. అయితే, జర్మనీలో అప్పటి నుంచి ఇప్పటికి అంధులైన న్యాయమూర్తుల సంఖ్య పెద్దగా పెరగలేదని ఆయన అన్నారు.

బాయ్‌సెన్, ఆయన అంధ సహచరులు కలిసి న్యాయశాస్త్రం చదువుకునే అంధ విద్యార్థులకు అనువుగా అనేక సాధనాలను అభివృద్ధిపరిచారు.

సాంకేతిక ఆవిష్కరణలు మానవ సంబంధాలతో ముడిపడి ఉండాలి

బహద్దీన్ బాట్మాజ్, మార్బర్గ్‌లో ఒక బ్లైండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, యాక్సెసిబిలిటీ ట్రైనర్. ఈ నగరంలో ఉన్న కొన్ని సౌకర్యాలు, ఆవిష్కరణల విషయంలో కొత్త పాఠాలు నేర్పుతాయని బాట్మాజ్ అంతారు.

మంచి డిజైన్ అందరికీ ప్రయోజకారిగా ఉంటుంది. ఉదాహరణకు మాట్లాడే బస్ స్టాప్‌లు. అక్కడ ఒక బటన్ నొక్కగానే బస్సుల వివరాలు వినిపిస్తాయి. అంధులకే కాక చూపు ఉన్నవారికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బాట్మాజ్ అంటారు.

అలాగే, తాను ఏదైనా వెబ్‌సైట్‌ను స్క్రీన్ రీడర్స్‌కు అనుకూలంగా రూపొందిస్తే, చూపు ఉన్నవారు కూడా దాన్ని ఉపయోగించుకుంటారని ఆయన తెలిపారు.

"సాంకేతిక ఆవిష్కరణలను, మానవ సంబంధమైన సాంఘిక అంశాలకు ముడిపెట్టడం ఎంతో ప్రయోజనకరం. ఉదాహరణకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోడ్డు దాటడం గురించి చింత లేకుండా ఉంటే మన మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి ఆలోచనలే ఆవిష్కరణలకు దారి తీస్తుంది. అంతే కాకుండా ఇతరుల దృష్టికోణాన్ని అర్థం చేసుకునేందుకు కూడా సహాయపడుతుంది" అని బాట్మాజ్ అంటారు.

'మార్బర్గ్ అంధుల కోసం రూపొందించిన ఒక స్మార్ట్ సిటీ'

"మార్బర్గ్ అంధుల కోసం రూపొందించిన ఒక స్మార్ట్ సిటీ" అనీ "స్మార్ట్‌నెస్‌కు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టిందని" ఫిల్మ్‌మేకర్ డాగో షెలిన్ అంటారు.

"మార్బర్గ్ సమ్మిళిత ఆవిష్కరణలకు ఒక నమూనాగా ఎదిగిందని" ఆ నగరంపై చేసిన ఒక అధ్యయనంలో షెలిన్ పేర్కొన్నారు.

డిజిటల్ సాంకేతికతలను అభివృధి పరచడం కన్నా ఇలాంటి స్మార్ట్ నగరాలు మానవతావాద దృక్పథాన్ని కలిగి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మార్బర్గ్ భవిష్యత్తులో తయారయే స్మార్ట్ సిటీలకు ఒక ప్రమాణంగా ఉంటుందని షెలిన్, ఆయన సహచరులు పేర్కొన్నారు.

"స్మార్ట్‌నెస్‌కు ప్రవేశయోగ్యత అనేది ఒక అవసరమైన లక్షణం"గా మారుతుందని, అందుకు మార్బర్గ్ ప్రామాణికం కాగలదని వారు భావిస్తున్నారు.

బ్రెజిల్‌కు చెందిన షెలిన్ 2014లో మార్బర్గ్‌కు మారినప్పుడు అక్కడి ఆవిష్కరణలకు ఎంతో ప్రభావిత్రం చెందారు.

ఫిల్మ్‌మేకింగ్‌లో ఆసక్తి ఉన్న అంధ విద్యార్థులకు ఆ సబ్జెక్ట్ బోధించేందుకు అవసరమైన మల్టీ-సెన్సరీ సాధనాలను తయారుచేశారు.

"ఇక్కడకు వచ్చిన తరువాతే ఫిల్మ్‌మేకింగ్ అనేది ఒక సాంఘిక ప్రయత్నమనే భావన బలపడింది" అంటారు షెలిన్.

'మనుషుల ఆలోచనలు మారాలి'

లియోనోర్ డ్రెవ్స్, దక్షిణ జర్మనీలోని హెప్‌స్టాడ్ట్‌‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఆమె కూడా అంధులే. డీవీబీఎస్ ప్రొఫెషనల్ అసోసియేషన్‌లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్‌టీఈఎం) బృందానికి హెడ్‌గా ఉన్నారు.

వీరంతా ఇంఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తారు. అంధులకు ఈ అంశంలో ఎన్నో అడ్దంకులు ఉన్నాయని డ్రెవ్స్ అంటారు. ముఖ్యంగా మనుషుల ఆలోచనలు మార్చడం పెద్ద సవాలు అని ఆమె అభిప్రాయపడ్డారు.

"మనుషుల మెదడులో ఉన్న అవరోధాలే అన్నిటికన్నా పెద్దవి. ఒక మహిళగా, అంధురాలిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టింది. నా సహచరులాగానే నేను కూడా నైపుణ్యంతో పనులు చేయగలనని అందరికీ విశ్వాసం కలిగించడానికి చాలా సమయం పట్టింది" అని ఆమె చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అంధులు కొత్త కొత్త ఆవిష్కరణల ద్వారా తమ దారికి నిలిచే అడ్డంకులను తొలగించుకుంటున్నారు.

కెమిస్ట్ మోనా మిన్‌కారా ఒక కొత్త ఎస్‌టీఈఎం కరికులం రూపొందిస్తున్నారు. కంప్యూటర్ సైంటిస్ట్ చియెకో అసకావా కొత్త కృత్రిమ మేధస్సును వృద్ధి చేస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్త వాండా డియాజ్-మెర్సెడ్ స్పేస్ అధ్యయనం చేయడానికి ధ్వనిని ఉపయోగిస్తున్నారు.

డ్యూసెల్డార్ఫ్‌లో లియోన్ అంధులకు అనువైన సాధనాలపై తన పరిశోధన కొనసాగిస్తున్నారు. చార్టులు, ఫొటోలను వివరించడంలో, పెద్ద పెద్ద టెక్స్టులు చదవడంలో లియోన్‌కు తన స్నేహితులు సహాయం అందిస్తారు.

మహమ్మారి సమయంలో యూనివర్సిటీ మూసివేసినప్పుడు, ఇంట్లో కూర్చునే రికార్డ్ చేసిన పాఠాలను రెట్టింపు వేగంతో వింటూ నేర్చుకోగలిగారు.

ఇప్పటికీ లియోన్, తనకు చదువు చెప్పిన టీచర్ మహంకేతో కొత్త కొత్త టెక్నాలజీల గురించి చర్చిస్తూ ఉంటారు. తాను పూర్వం చదువుకున్న స్కూలే ఇప్పటికీ తనకు ప్రేరణ అని లియోన్ అంటారు.

"ఆ స్కూలే నా బలం. అసాధ్యాన్ని సుసాధ్యంగా ఎలా మార్చవచ్చో అక్కడే నేర్చుకున్నాను" అని లియోన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Germany: Marburg, the city of the blind,even the blind can see everything here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X