Hajj 2021: విదేశీయులకు నో ఛాన్స్ -covid టీకాలు పొందిన 60వేల మంది స్థానికులకే: సౌదీ అరేబియా
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా విదేశీ యాత్రికులకు అనుమతి నిరాకరించింది. కేవలం తమ దేశానికే చెందిన, అది కూడా కొవిడ్ టీకాలు పొందిన 60 వేల మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతిస్తున్నట్లు సౌదీ రాజప్రసాదం శనివారం అధికారిక ప్రకటన చేసింది.
జూన్ రెండో వారంలో హజ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం 2021 ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ఏడాది కూడా హజ్ యాత్రకు విదేశీ యాత్రికులకు సౌదీ నిరాకరించింది. 2020లో గరిష్టంగా 1000 మందికి అనుమతిచ్చిన సౌదీ, ఈసారి ఆ సంఖ్యను 60వేలకు పెంచినప్పటికీ, అందులో 18నుంచి 65ఏళ్లలోపు వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని నిబంధన విధించింది. మరోవైపు,

హజ్ యాత్రకు విదేశీయుల రాకను నిరాకరిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోకముందే పలు దేశాలు స్వచ్ఛందంగా హజ్ యాత్రను రద్దు చేసుకున్నాయి. హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వెల్లడించారు. ఇక భారత్ విషయానికొస్తే..
కరోనా పరిస్థుల నేపథ్యంలో హజ్ యాత్రపై సౌదీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటామన్నా సహకరిస్తామంటూ భారత మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గత వారం ఒక ప్రకటన చేశారు. హజ్ 2021పై ముంబైలో 'జాన్ హై తోహ్ జహాన్ హై' పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోవిడ్-19 టీకాలపై ఈ సంస్థలు చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో అన్ని వక్ఫ్ బోర్డులు, హజ్ కమిటీలు పాల్గొని, విజయవంతం చేయాలని నఖ్వీ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications