హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను హతమార్చాం: ఇజ్రాయెల్ ప్రకటన
ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై గత సంవత్సరం అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి,ప్రస్తుతం హమాస్ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ను తాము చేసిన దాడుల్లో హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వార్త నిజమైతే హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలినట్లవుతుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ఇదే మాట చెప్పడం గమనార్హం.
తాము హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకూ యుద్ధం ఆపేది లేదని నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సిన్వార్ మరణంతో యుద్ధ పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టేలా కనిపిస్తున్నాయి. గాజా దక్షిణ ప్రాంతమైన రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చేసిన దాడుల్లో హమాస్ చీఫ్ సిన్వార్ మరణించినట్లు తెలుస్తోంది.

సిన్వార్ మరణవార్తను పలువురు ఇజ్రాయెల్ అధికారులు కూడా ధృవీకరించారు. దాడి జరిగిన సమయంలో మిలిటెంట్లు ఉణ్న భవనంలో బందీలు ఎవరూ లేరని తెలిపారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిన్వార్ సహా ముగ్గురు హమాస్ మిలిటెంట్లు చనిపోయినట్లు సమాచారం. యాహ్యా మృతిపై అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి.
కాగా, గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లుగా చంపేశారు. పిల్లలు, మహిళలు అనే తేడాలేకుండా 1200 మందిని దారుణంగా చంపారు. మరో 251 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో 90 మంది వరకు ఇంకా గాజాలోనే బందీలుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్.. హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించింది. గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించినట్లు సమాచారం. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తోంది. మరోవైప, లెబనాన్ హిజ్బొల్లా మిలిటెంట్లపైనా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. వరుస దాడులతో హమాస్, హిజ్బొల్లా కీలక నేతలను మట్టుబెడుతోంది. గాజాతోపాటు లెబనాన్‌పైనా వరుస దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ ఐడీఎఫ్.












Click it and Unblock the Notifications