అమెరికాలో దారుణం.. కాల్పుల ఘటనలో మరో భారతీయుడు బలి !
హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు కపిల్ అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. లాస్ ఏంజిల్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గత శనివారం రాత్రి ఒక అమెరికా జాతీయుడు బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయడం పట్ల కపిల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో ఆగ్రహించిన వ్యక్తి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. గాయాలతో కపిల్ అక్కడికక్కడే కుప్పకూలగా.. ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
కాగా కపిల్ మరణ వార్తతో స్వగ్రామమైన బ్రహ్ కలాన్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ సురేష్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. మా ఊరి యువకుడు తన భవిష్యత్తు కోసం కష్టపడి అమెరికా వెళ్లాడు. కానీ ఇలాంటి విషాదాంతం జరుగుతుందని ఎవరు ఊహించారు?" అని కన్నీరు మున్నీరయ్యారు.

అమెరికాలో సెలవులు ఉండటంతో పోస్ట్‌మార్టం బుధవారం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సుమారు ₹15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టమని, ఈ విషయంలో ప్రభుత్వం సహాయం చేయాలని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు.
కపిల్, 2022లో హెచ్చరికలతో కూడిన "డాంకీ రూట్" ద్వారా అమెరికాకు చేరుకున్నాడు. ఈ ప్రయాణానికి ఆయన కుటుంబం సుమారు రూ.45 లక్షలు ఖర్చు చేసింది. పనామా అడవులు, మెక్సికో సరిహద్దు గోడ దాటి ప్రాణాల మీదకు తెచ్చుకొని అమెరికాలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అమెరికా బోర్డర్ పోలీస్ అరెస్ట్ చేసినా, చట్టపరమైన ప్రక్రియల తర్వాత విడుదలై అక్కడే స్థిరపడ్డాడు. అప్పటి నుండి కాలిఫోర్నియాలోని ఒక దుకాణంలో, తర్వాత సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ జీవనోపాధి కొనసాగించాడు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన కపిల్, తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఇద్దరు అక్కచెల్లెళ్లకు అన్నయ్య. "మా ఇల్లు నిలబెట్టేది ఒక్క కపిల్ మాత్రమే. ఇప్పుడు మా భవిష్యత్తు చీకటిలో మునిగిపోయింది" అని కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది.
ఈ ఘటనతో, అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్ళే వలసదారుల భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. అనేక కుటుంబాలు తమ ఆస్తులు అమ్మి, ఏజెంట్లకు భారీ మొత్తాలు చెల్లించి తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు. కానీ అక్కడ ఎదురయ్యే ప్రమాదాలు, అనుకోని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications