వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్ బెగ్గింగ్: ఆన్‌లైన్‌లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సిరియా శరణార్థులు

సిరియా శరణార్థులు తమకు సాయం చేయాలంటూ ఇటీవల టిక్‌టాక్ వీడియోల్లో కనిపిస్తున్నారు. అయితే, వీరి దగ్గర టిక్‌టాక్ 70 శాతం వరకు కమీషన్ తీసుకుంటోందని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

ఈ వీడియోల్లో శరణార్థుల పిల్లలు కనిపిస్తున్నారు. వీరు గంటలపాటు లైవ్‌లు చేస్తున్నారు. డిజిటల్ గిఫ్టుల రూపంలో తమకు సాయం చేయాలని వీరు కోరుతున్నారు.

గంటకు వీరు వెయ్యి డాలర్లు (రూ.82,000) వరకు సంపాదిస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. అయితే, నిజానికి వీరి చేతికి అందేది మాత్రం చాలా తక్కువని వెలుగులోకి వచ్చింది.

అయితే, ''భిక్షాటనలో దోపిడీ’’కి కళ్లెం వేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని టిక్‌టాక్ చెబుతోంది.

అసలు అలాంటి కంటెంట్‌ను తమ వేదికపై అనుమతించబోమని సంస్థ వివరిస్తోంది. మరోవైపు డిజిటల్ గిఫ్టుల నుంచి తమకు వచ్చే కమీషన్ 70 శాతం వరకు ఉండదని అంటోంది. కానీ, ఆ కమీషన్ ఎంత శాతం ఉందనేది మాత్రం వెల్లడించడం లేదు.

సిరియా శరణార్థులు

ఎవరీ మిడిల్‌మెన్?

ఇటీవల కాలంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో టిక్‌టాక్ ఫీడ్‌లో భిక్షాటన వీడియోల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సిరియా శిబిరాల నుంచి చాలా లైవ్‌లు ఫీడ్‌‌లో కనిపించడం ఎక్కువైంది.

వాయువ్య సిరియాలో శరణార్థుల శిబిరాలను బీబీసీ సందర్శించంది. ''టిక్‌టాక్ మిడిల్‌మెన్’’గా పిలిచేవారు ఇక్కడికి రావడం ఎక్కువైందని బీబీసీ పరిశోధనలో తేలింది. ఈ మధ్యవర్తులు శరణార్థులకు ఫోన్లతోపాటు లైవ్‌లు చేసేందుకు అవసరమైన పరికరాలన్నీ ఇస్తున్నారు.

చైనా, పశ్చిమాసియాలలోని టిక్‌టాక్‌తో సంబంధమున్న సంస్థలతో తాము కలిసి పనిచేస్తున్నట్లు మిడిల్‌మెన్ చెబుతున్నారు. వీరే టిక్‌టాక్ అకౌంట్లలో శరణార్థులతో లైవ్‌లు చేయిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ చేసేవారిని పెద్దయెత్తున నియమించుకోవాలనే టిక్‌టాక్ వ్యూహాల్లో ఈ మధ్యవర్తులు భాగంగా ఉంటున్నారు.

సాధారణంగా మన చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వీడియోలను టిక్‌టాక్ అల్గారిథమ్‌లు మనకు సూచిస్తుంటాయి. అందుకే ఈ మధ్యవర్తులు ఎక్కువగా బ్రిటిష్ సిమ్‌కార్డులను ఎంచుకుంటారు. బ్రిటన్ నుంచి ఎక్కువ విరాళాలు రావడమే దీనికి కారణం.

సిరియా శరణార్థులు

ఇంగ్లిష్‌లోనే...

మోనా అలీ అల్-కరీం, ఆమె ఆరుగురు కుమార్తెలు టిక్‌టాక్ వేదికగా తరచూ లైవ్‌లు ఇస్తుంటారు. తమ శిబిరంలో నేలపై కూర్చొని గంటలపాటు వీరు లైవ్‌లు ఇస్తారు. ''ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ గిఫ్ట్’’లాంటి ఇంగ్లిష్ పదాలను వీరు ఉపయోగిస్తుంటారు.

మోనా భర్త వైమానిక దాడుల్లో మరణించారు. ప్రస్తుతం లైవుల ద్వారా వచ్చే డబ్బును తమ కుమార్తెల్లో ఒకరైన అంధురాలు షరీఫా ఆపరేషన్ కోసం పోగుచేస్తున్నారు.

వీరు వర్చువల్ గిఫ్టులు అడుగుతున్నారు. అయితే, టిక్‌టాక్ వినియోగదారులు డబ్బుల రూపంలో వీరికి చెల్లింపులు చేయొచ్చు.

సాధారణంగా ఈ లైవ్‌స్ట్రీమ్‌లను చూసేవారు శరణార్థులకు సెంట్( డాలర్ లో 1 శాతం ) నుంచి 500 డాలర్ల వరకు గిఫ్టులు పంపిస్తుంటారు.

గత ఐదు నెలల్లో 30 టిక్‌టాక్ అకౌంట్లను బీబీసీ పరిశీలించింది. ఇవన్నీ సిరియా శరణార్థుల శిబిరాల నుంచి ఏర్పాటు చేసినవే. దీంతో గంటకు ఒక్కొక్కరూ 1000 డాలర్లు (రూ.82,000) వరకు గిఫ్టులు సంపాదించినట్లు తేలింది.

అయితే, ఈ మొత్తంలో కొంత భాగం మాత్రమే ఈ శిబిరాల్లో జీవించే వారికి అందుతోంది. సింహభాగం తమ దగ్గర ఉంటోందన్న వాదనకు మాత్రం టిక్‌టాక్ అంగీకరించడం లేదు. దీంతో అసలు ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో బీబీసీ పరిశోధన చేపట్టింది.

టిక్‌టాక్‌తో కలిసిపనిచేస్తున్న ఓ సంస్థను బీబీసీ రిపోర్టర్ సంప్రదించారు. తాను శరణార్థుల శిబిరంలోనే ఉంటానని ఆ సంస్థకు బీబీసీ రిపోర్టర్ చెప్పారు. దీంతో ఆయనకు లైవ్ అకౌంట్‌ను ఇచ్చారు. అదే సమయంలో బీబీసీ లండన్‌లో పనిచేసే సిబ్బంది ఒక అకౌంట్ నుంచి 106 డాలర్లు (రూ.8700) విలువైన గిఫ్టులను పంపించారు.

అయితే, ఇక్కడ ఆ లైవ్ స్ట్రీమ్ అకౌంట్‌కు వచ్చినది కేవలం 33 డాలర్లు (రూ.2700) మాత్రమే. ఈ గిఫ్టుల్లో 69 శాతం మొత్తం టిక్‌టాక్ దగ్గరే ఉండిపోయాయి.

మోనా, ఆమె కుమార్తెలు

ప్రముఖులు కూడా ఇలానే విరాళాలు

టిక్‌టాక్‌లో భారీగా ఫాలోవర్లు ఉన్న, మాజీ రగ్బీ ప్లేయర్ కీత్ మేసన్ ఒక శరణార్థి కుటుంబానికి 330 డాలర్లు (రూ.27,000) విరాళంగా ఇచ్చారు. తన ఫాలోవర్లు కూడా ఇలానే సాయం చేయాలని ఆయన సూచించారు.

ఈ డబ్బు పూర్తిగా శరణార్థులకు వెళ్లడంలేదని మేం ఆయనకు చెప్పినప్పుడు.. ఇది చాలా దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇలాంటి విషయాల్లో సంపూర్ణ పారదర్శరకత ఉండాలి. ఇలా వారి దగ్గర డబ్బులను తీసుకోవడం చాలా దారుణం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక్కడ బీబీసీ ప్రతినిధులు పంపిన 106 డాలర్లలో మిగిలిన 33 డాలర్లను స్థానిక నగదు మార్పిడి కేంద్రం నుంచి శరణార్థులు తీసుకొనేటప్పుడు మరో పది శాతం కోత పడింది. మరోవైపు 35 శాతాన్ని టిక్‌టాక్ మిడిల్‌మెన్ తీసుకోగా.. ఆ కుటుంబానికి చేతికి వస్తోంది కేవలం 19 డాలర్లు (రూ.1500) మాత్రమే.

ఈ శిబిరాల్లో మధ్యవర్తిగా పనిచేస్తున్న హమిద్‌తో బీబీసీ మాట్లాడింది. మొబైల్ ఫోన్, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలను కొనేందుకు తన దగ్గరున్న పశువులను అమ్మేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం 12 కుటుంబాలు లైవ్‌ స్ట్రీమింగ్ ఇచ్చేందుకు ఆయన పనిచేస్తున్నారు.

హమిద్

ఇక్కడున్న కుటుంబాలకు సాయం చేసేందుకు టిక్‌టాక్ సాయం తీసుకుంటున్నానని ఆయన చెబుతున్నారు. గిఫ్టుల్లో వచ్చే మొత్తంలో శరణార్థులకే సింహభాగం ఇస్తానని ఆయన అంటున్నారు.

ఇతర మధ్యవర్తుల్లానే హమిద్‌కు కూడా చైనాకు చెందిన ''లైవ్ ఏజెన్సీస్’’ సాయం చేస్తుంది. ఈ సంస్థ నేరుగా టిక్‌టాక్‌తో కలిసి పనిచేస్తుంది.

''యాప్‌లో ఏమైనా సమస్య ఉంటే వారు మాకు సాయం చేస్తారు. బ్లాక్ అయిన అకౌంట్లు అన్‌లాక్ కావడంలో వారు సాయం చేస్తారు. మేం వారికి పేజీ పేరు, ప్రొఫైల్ పిక్చర్ ఇస్తాం. వారే అకౌంట్ తెరుస్తారు’’అని హమిద్ వివరించారు.

''లైవ్ స్ట్రీమింగ్ గిల్డ్స్’’గా పిలిచే ఈ ఏజెన్సీలు ప్రపంచంలో చాలా చోట్ల నుంచి పనిచేస్తున్నాయి. మెరుగైన లైవ్ స్ట్రీమింగ్ కంటెంట్ కోసం వీరు టిక్‌టాక్‌తో కలిసి పనిచేస్తున్నారు.

లైవ్ స్ట్రీమింగ్ సమయం, వచ్చిన గిఫ్టుల ఆధారంగా టిక్‌టాక్ తమకు కమీషన్ ఇస్తుంటుందని ఆ సంస్థలు బీబీసీతో చెప్పాయి.

ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ సమయంపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అందుకే సిరియాలోని శరణార్థి శిబిరాల్లో చిన్నారులు గంటలపాటు లైవ్‌లు ఇస్తున్నారు.

సిరియా శరణార్థులు

ఈ లైవ్ స్ట్రీమింగ్‌లు టిక్‌టాక్ సొంత విధానాలకే విరుద్ధంగా జరుగుతున్నాయని డిజిటల్ రైట్స్ అసోసియేషన్ 'యాక్సెస్ నౌ’కు చెందిన మార్వా ఫతాఫ్తా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మైనర్లను ఎలాంటి హాని కలగకుండా చూడటం, దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త వహించడం లాంటి నిబంధనలు పాటిస్తామని టిక్‌టాక్ చెబుతోంది.

''టిక్‌టాక్ అనుసరిస్తున్న విధానాలు తమ సొంత నిబంధలకే విరుద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఇక్కడి శరణార్థుల హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారు’’అని ఆమె అన్నారు.

''ఇక్కడి ప్రజలకు తమ కథలను ఆన్‌లైన్ పోస్టు చేసుకునే హక్కు ఉంటుంది. వీరు సాయం కోసం అభ్యర్థించుకోవచ్చు. అయితే, ఈ లైవ్‌స్ట్రీమింగ్‌లలో గౌరవం అనేదే ఎక్కడా కనిపించడం లేదు’’అని ఆమె వివరించారు.

టిక్‌టాక్‌లో లైవ్ ఇవ్వాలంటే ఫాలోవర్లు కనీసం వెయ్యికిపైగా ఉండాలి. మరోవైపు నేరుగా గిఫ్టులు ఇవ్వాలని అభ్యర్థించకూడదు. మైనర్లు దోపిడీకి గురికాకుండా చూడాలనే నిబంధన కూడా టిక్‌టాక్ నిబంధనల్లో ఉంది.

అయితే, పిల్లలు అడుక్కుంటున్న 30 అకౌంట్లను బీబీసీ రిపోర్టు చేసినప్పుడు.. వీరు ఎలాంటి నిబంధనలనూ ఉల్లంఘించడంలేదని టిక్‌టాక్ చెప్పింది.

ఈ విషయంపై స్పందించాలని బీబీసీ కోరినప్పుడు.. ''మొత్తంగా అన్ని అకౌంట్లనూ బ్యాన్ చేస్తున్నాం’’అని టిక్‌టాక్ చెప్పింది. ''మీరు చెబుతున్న సమాచారం, చేస్తున్న ఆరోపణలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. మేం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకుంటాం’’అని పేర్కొంది.

''ఇలాంటి కంటెంట్‌ను మా ప్లాట్‌ఫామ్‌పై అనుమతించం. మా విధానాలను మరింత పటిష్ఠం చేస్తాం’’అని వివరించింది.

ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా యాప్‌లలో టిక్‌టాక్ కూడా ఒకటి. యాప్ నుంచి మొత్తంగా సంస్థకు 2017 నుంచి 6.2 బిలియన్ డాలర్లు (రూ.51,142 కోట్లు) ఆదాయం వచ్చినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ సెన్సర్ టవర్ వెల్లడించింది.

టిక్‌టాక్ లైవ్‌లకు బదులుగా శరణార్థులకు సాయం చేయాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలను బీబీసీ ఆశ్రయించింది.

ఇక్కడి కుటుంబాలకు అవసరమైన మౌలిక వనరులను మూడు నెలల్లోగా అందిస్తామని స్థానిక స్వచ్ఛంద సంస్థకు చెందిన టకాఫుల్ అల్షామ్ అన్నారు. ఈ పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు తాము సాయం చేస్తామని వివరించారు.

శరణార్థుల్లో చాలా మంది మాత్రం భిక్షాటన మినహా వేరే ప్రత్యామ్నాం లేదని చెబుతున్నారు. నేటికీ చాలా మంది టిక్‌టాక్‌ భిక్షాటనపైనే ఆధారపడుతున్నారు.

(మహమ్మద్ అబ్దుల్లా, రునాకో సెలీనా, సైరస్ చాన్, నెడ్ డేవీస్, కేటీ లింగ్.. అదనపు సాయం అందించారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hi-tech begging: Tech company taking 70 percent commission from online beggars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X