ఆపరేషన్ సిందూర్ తో బోర్డర్ లో హైటెన్షన్..! పాక్ కాల్పుల్లో 15 మంది మృతి..!
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఇవాళ పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తీవ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఈ చర్యతో పాక్ భగ్గుమంది. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద భారీగా కాల్పులకు దిగింది. ఈ కాల్పులతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తోంది.
ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ బలగాలు నియంత్రణ రేఖ వెంబడి ఇవాళ కాల్పుల్ని ముమ్మరం చేశాయి. వాస్తవానికి పహల్గాం దాడి తర్వాత బారత్ ప్రతీకార దాడి చేస్తుందన్న భయంతో కాల్పులు మొదలుపెట్టిన పాకిస్తాన్ బలగాలు.. ఇవాళ వాటిని మరింత పెంచాయి. దీంతో సరిహద్దులు రక్తమోడుతున్నాయి. పాకిస్తాన్ కాల్పుల్లో 15 మంది భారతీయ పౌరులు చనిపోయారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ పరిణామాలతో సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి.

పాకిస్తాన్ బలగాలు నియంత్రణ రేఖ వెంబడి జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోన్ చేసి మాట్లాడారు. సరిహద్దు గ్రామాల్ని వేగంగా ఖాళీ చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ఆయా రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా తెలిపారు. దీంతో సరిహద్దుల్లో గ్రామాల నుంచి జనాన్ని ఖాళీ చేయించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

మరోవైపు పాకిస్తాన్ బలగాల కాల్పులకు భారత్ దీటుగా సమాధానం ఇస్తూనే ఉంది. అయినా పలు చోట్ల అమాయక పౌరులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా జరిగిన కాల్పుల్లో 10 మంది సిక్కులు చనిపోయారు. దీనిపై అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పందించారు. పాకిస్తాన్ చర్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి ప్రకటించారు.












Click it and Unblock the Notifications