వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్క్ చరిత్ర: 17వ శతాబ్దంలో ప్లేగు నుంచి రక్షించే కాకి ముక్కు మాస్క్ నుంచి నేటి కోవిడ్-19 మాస్క్‌ వరకు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
1930ల్లో మాస్కుతో ముక్కు నోరు రెండూ కప్పుకోవాలని అనుకునేవారు కాదు.

ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులను బ్యాంకుల దోపిడీ చేసేవారు, పాప్ స్టార్లు, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకునే జపాన్ పర్యటకులు మాత్రమే పెట్టుకునేవారు.

కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని 'న్యూ నార్మల్' అని చెప్పుకుంటున్నారు.

మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు.

గత 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు.

బ్లాక్ ప్లేగ్ నుంచి వాయు కాలుష్యం, ట్రాఫిక్ కాలుష్యం చివరికి రసాయన గ్యాస్ దాడుల వరకూ చాలా దేశాల్లో మాస్క్‌‌లు వాతున్నారు.

వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఆరో శతాబ్దం ముందు నుంచే మాస్క్‌లను ఉపయోగించేవారని చెబుతున్నారు.

జనం తమ నోటిని గుడ్డతో కప్పుకున్నట్టు ఉన్న చిత్రాలు పర్షియన్ సమాధుల తలుపుల మీద కనిపించాయి.

మార్కో పోలో వివరాల ప్రకారం 13వ శతాబ్దంలో చైనాలో నౌకర్లు, నేసిన వస్త్రంతో తమ ముఖం కప్పుకోవాల్సి వచ్చేది.

చక్రవర్తి తింటున్నప్పుడు ఆ ఆహార పదార్థాల సువాసన, నౌకర్లు వదిలే శ్వాసతో పాడవకూడదనే అలా చేసేవారని చెబుతారు.

ఆకాశాన్ని కమ్మేసిన పరిశ్రమల పొగ

కాలుష్యం వల్ల కమ్మేసిన పొగ

18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం లండన్‌కు ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చింది.

ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఏర్పడిన పరిశ్రమలు కలుషితమైన పొగను భారీగా వదిలేవి.

ఇళ్లలో బొగ్గుతో మండే పొయ్యిల నుంచి ఎప్పుడూ నల్లటి పొగలు వస్తుండేవి.

చలికాలాల్లో లండన్ నగరం మీద బూడిద-పసుపు రంగు పొగ మంచు ఒక మందపాటి పొరలా కమ్మేసి ఉండడం చాలా మంది చూశారు.

1952 డిసెంబర్ నెలలో 5 నుంచి 9 మధ్య నగరంలో 4 వేల మంది చనిపోయారు.

ఆ తర్వాత వారాల్లో దాదాపు 8 వేల మంది చనిపోయారు.

1962లో లండన్‌లో వ్యాపించిన పొగ

నగరమంతా వ్యాపించిన పొగ ఎంత దట్టంగా అలుముకుందంటే రైళ్లు నడపడమే కష్టమైంది.

ఆ కాలంలో చుట్టుపక్కల పొలాల్లో కొన్ని జంతువులు ఊపిరాడక చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి.

1956, 1968లో చిమ్నీల నుంచి వచ్చే నల్లటి పొగను, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగలో ధూళి కణాలను తగ్గించడానికి క్లీన్ ఎయిర్ చట్టం తీసుకొచ్చారు.

ఆ చట్టంలో చిమ్నీ ఎత్తును, దాన్ని కట్టే ప్రాంతాన్ని కూడా నిర్ణయించారు.

1950ల్లో ఫేస్ మాస్క్

బ్లాక్ డెత్ ప్లేగ్

14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ ప్లేగ్ మొట్టమొదట యూరప్‌లో వ్యాపించింది.

1347 నుంచి 1351 మధ్య ఆ వ్యాధి అక్కడ రెండున్నర కోట్ల మందిని బలి తీసుకుంది.

తర్వాత నుంచి అక్కడి డాక్టర్లు స్పెషల్ మెడికల్ మాస్కులు ఉపయోగించడం మొదలుపెట్టారు.

పక్షి ముక్కు మాస్క్ కనుగొనక ముందు ప్లేగుకు చికిత్స చేస్తున్న వైద్యులు

విష వాయువు శరీరంలోకి వెళ్లడం వల్ల వ్యాధికి గురవుతున్నారని భావించారు.

కలుషిత గాలి శరీరంలోకి వెళ్లకుండా తమ ముఖాలను గుడ్డతో కప్పుకోవడం లేదంటే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటపుడు సువాసన వచ్చే పూలు లేదా అత్తరు తీసుకుని చేసేవారు.

పక్షి ముక్కు ఆకారంలో ఉన్న ఈ మాస్కులో మూలికలు పెట్టేవారు

17వ శతాబ్దం మధ్యలో ప్లేగ్ వ్యాపించినప్పుడు, కాకి ఆకారంలో ఉన్న మాస్కు ధరించిన ఒక వ్యక్తి చిత్రం కనిపించడం మొదలైంది.

దానిని చాలా మంది మృత్యువు నీడగా పిలిచేవారు.

ఆ మాస్క్‌ ముందు ముక్కులా ఉన్న చోట సువాసన వచ్చే మూలికలను నింపేవారు.

అలా కలుషిత గాలి శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చని భావించేవారు.

ఆ తర్వాత సమయంలో కూడా ఇలాంటి మాస్కులు ఉపయోగించారు.

పక్షి ఆకారంలో ఉండే మాస్కులు ధరించిన వైద్యులు

1965లో గ్రేట్ ప్లేగ్ వ్యాపించిన సమయంలో రోగులకు చికిత్స చేసే డాక్టర్లు చర్మంతో చేసిన గౌన్, కళ్లకు గాజు కళ్లజోడు, చేతులకు గ్లవ్స్, తలకు టోపీ పెట్టుకునేవారు.

అది అప్పట్లో డాక్టర్ల పీపీఈ కిట్‌లా పనిచేసేది.

1971లో లండన్ ట్రాఫిక్

రాకపోకలతో కాలుష్యం

19వ శతాబ్దంలో లండన్‌లో చదువుకున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉండేది.

వాళ్లు తమ చర్మాన్ని కప్పి ఉంచేలా పూర్తిగా నల్లగా ఉండే గౌన్లు వేసుకోవడానికి ఇష్టపడేవారు.

వాటితోపాటూ ముఖాన్ని కప్పి ఉంచేలా వారి టోపీకి ఒక పలచటి మేలిముసుగు కూడా ఉండేది.

మేలి ముసుగుతో ఉన్న యువతి

ఆ బట్టలు, ముఖ్యంగా వారి ముఖాన్ని కప్పే ఆ పలుచటి ముసుగు సూర్యరశ్మితోపాటూ, ధూళి కణాలు, కాలుష్యం నుంచి వారిని కాపాడేవి.

లండన్‌ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ, కింగ్స్ కాలేజ్ లండన్ వివరాల ప్రకారం అప్పటి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల రద్దీ.

డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్, రబ్బరు, లోహ కణాలు గాల్లో కలిసిపోయేవి.

కానీ 20వ శతాబ్దం నాటికి వాయు కాలుష్యం ఎంత పెరిగిందంటే, ముఖాన్ని కప్పే ఆ పలచటి మేలిముసుగు గాలిలోని ధూళి కణాలను ఆపలేదని నిరూపితమైంది.

ప్రత్యేక మాస్కు ధరించిన సైకిలిస్టులు

కరోనా మహమ్మారి రావడానికి చాలా ముందు నుంచే లండన్‌లో సైకిళ్లు తొక్కేవారు తమ ముఖానికి ఒక ప్రత్యేక రకం యాంటీ-పొల్యూషన్ మాస్క్ ధరించేవారు.

గాస్ మాస్కులు ధరించిన కాబరే డాన్సర్లు

విష వాయువులు-గ్యాస్ మాస్కులు

మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో క్లోరిన్ గ్యాస్, మస్టర్డ్ గ్యాస్ లాంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడంతో, భయపడిన ప్రభుత్వాలు తమ ప్రజలకు, సైనికులకు విష వాయువుల నుంచి రక్షించుకోడానికి గ్యాస్ మాస్కులు పంపిణీ చేశాయి.

సైకిళ్లపై గస్తీ కాసే పోలీసులు కూడా వాటిని తమ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌లా ధరించేవారు.

సైకిళ్లపై గ్యాస్ మాస్కులతో పోలీసుల గస్తీ

1938లో రోడ్లపై వెళ్తున్నవారు రెస్పిరేటర్లు వేసుకోవడం మామూలైపోయింది.

ఆ ఏడాది ప్రభుత్వం సామాన్యులకు, సైనికులకు 350 లక్షల రెస్పిరేటర్లు పంచింది.

లండన్ బీక్ స్ట్రీట్‌లోని ముర్రే కాబరే క్లబ్ డాన్సర్లకు కూడా ప్రభుత్వం వాటిని అందించింది.

జూలో ఒంటెకు మాస్క్ తయారు చేయడానికి కొలతలు తీసుకుంటున్న సిబ్బంది

అదే సమయంలోనే జంతువులను కాపాడ్డానికి వాటికి కూడా మాస్కులు వేశారు.

చెసింగ్టన్ జూలోని కొన్ని జంతువులకు మాస్కుల తయారు చేయడానికి వాటి ముఖాల కొలతలు కూడా తీసుకున్నారు.

తన గుర్రంతో మాస్క్ ధరించిన వ్యక్తి

గుర్రాలకైతే నోరు, ముక్కు కప్పి ఉంచేలా ఒక సంచిలాంటి మాస్కులు తగిలించేవారు.

రైల్లో పిచికారీ చేస్తున్న వ్యక్తి

స్పానిష్ ఫ్లూ

మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక కొన్ని దేశాల ముందు మరో భయంకరమైన సవాలు నిలిచింది.

స్పెయిన్‌లో మొదట ఒక ఫ్లూ వ్యాపించడం మొదలైంది. అది తర్వాత మహమ్మారిగా మారింది.

ఆ వ్యాధి స్పెయిన్‌లో ఐదు కోట్ల మంది ప్రాణాలు తీసింది.

ఆ వ్యాధి స్పెయిన్ నుంచి వ్యాపించడంతో దానికి స్పానిష్ ఫ్లూ అనే పేరు పెట్టారు.

స్పానిష్ ఫ్లూ రాకుండా డిస్ ఇన్పెక్టెంట్స్ మాస్క్ వేసుకున్న పౌరులు

ఉత్తర ఫ్రాన్స్‌లో కందకాల నుంచి తిరిగి వచ్చిన సైనికులతోపాటూ ఈ వైరస్ వేగంగా వ్యాపించినట్టు భావిస్తారు.

ఆ సమయంలో ఆ వైరస్‌ను అడ్డుకోవడానికి చాలా కంపెనీలు తమ రైళ్లు, బస్సుల్లో కూడా క్రిమినాశకాలను పిచికారీ చేయించాయి.

సైనికులు ట్రక్కులు, కార్లలో కిక్కిరిసిపోయి తమ దేశాలకు తిరిగి వచ్చేవారు.

దాంతో అది ఒక భయంకరమైన అంటు వ్యాధిగా మారింది.

మొదట రైల్వే స్టేషన్లలో, ఆ తర్వాత నగరమంతా వ్యాపించేది.

శివార్ల నుంచి మెల్లమెల్లగా పల్లెలకు వ్యాపించింది.

సొంతంగా తయార చేసుకున్న మాస్కుతో వ్యక్తి

లండన్ జనరల్ ఒమ్నిబస్ కార్పొరేషన్ లాంటి కంపెనీలు వేగంగా వ్యాపిస్తున్న ఫ్లూను అడ్డుకోడానికి రైళ్లు, బస్సుల్లో మందులు పిచికారీ చేయించాయి.

వ్యాధి వ్యాపించకుండా మాస్క్ ధరించాలని తమ సిబ్బందిని ఆదేశించాయి.

1918లో నర్సింగ్ టైమ్స్ పత్రికలో ఈ వ్యాధి నుంచి కాపాడుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రచురించారు.

ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి నార్త్ కెన్సింగ్టన్ సెయింట్ మెరిలబోన్ ఇన్‌ఫర్మరీ ఆస్పత్రిలో నర్సులు రోగుల పడకల మధ్య సెక్షన్లు ఏర్పాటు చేశారు.

ఆస్పత్రిలోకి వచ్చే డాక్టర్లు, నర్సులు అందరూ దూరం దూరంగా ఉండే ఏర్పాట్లు చేశారు.

ఆ సమయంలో వైద్య సిబ్బంది ఫుల్ బాడీ సూట్ వేసుకునేవారని, ముఖానికి మాస్క్ ధరించేవారని రాశారు.

ఆ సమయంలో మీరు బతికి ఉండాలంటే, మాస్కులు ఉపయోగించాలని పౌరులకు కూడా సూచించారు.

చాలా మంది స్వయంగా తమ మాస్కులను తయారు చేసుకున్నారు.

1985లో హీత్రూ విమానాశ్రయంలో ముఖం కప్పుకుని ఉన్న బాయ్ జార్జ్

తర్వాత మరో రకం మాస్క్ వాడకంలోకి వచ్చింది.

ఇది ఒక రకంగా మొత్తం ముఖాన్ని కప్పుకునే ఒక పెద్ద వస్త్రంలా ఉండేది.

చాలా మంది ప్రముఖులు తమ అభిమానులు, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి మాస్కులే ఉపయోగించేవారు.

అప్పట్లో ముఖం కప్పుకోవడం అంటే మిగతా వారిని ఆకర్షించే ప్రయత్నం చేయడం లాంటిదే. 'నన్ను గుర్తు పట్టకుండా నేను ప్రత్యేకమైన మాస్క్ వేసుకున్నా' అని చెబుతున్నట్టు ఉండేది.

మాస్కుతో గాయకుడు జస్టిన్ బీబెర్

కానీ, ఇప్పుడు మాస్క్ వేసుకోవడం సర్వ సాధారణం అయ్యింది.

అది ఎంత మామూలు అయ్యిందంటే ఇప్పుడు మనం ఎలాంటి ప్రత్యేక రకం మాస్క్ వేసుకున్నా వాటిని ఎవరూ చూడరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
History of the Mask: From the 17th century plague- to today's Covid-19 mask
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X